ఎన్యూమరేషన్ ప్రక్రియలో బీఎల్‌వోల నిర్లక్ష్యం - వేటు తప్పదంటున్న అధికారులు
సర్ ప్రక్రియలో వెనకబడిన మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు - పనిచేయని బీఎల్‌ఓలపై చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు - సర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Published : July 6, 2026 at 8:43 AM IST
Vote Enumeration Process In Hyderabad : తెలంగాణలోని 33 జిల్లాలతో పోలిస్తే రాజధానిలోని మూడు జిల్లాలు సర్ (ప్రత్యేక ఓటర్ల సమగ్ర జాబితా) ప్రక్రియలో వెనకబడి ఉన్నాయి. సర్ మొదలై దాదాపు పది రోజులవుతున్నా ఓటరు నమోదు పత్రాల పంపిణీ మాత్రం అంతంత మాత్రంగానే జరిగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చివరి స్థానంలో ఉండటంపై అధికారులు గుస్సా అవుతున్నారు. ఇది ఓటరు సర్వేపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోంది. ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఈ పరిస్థితిపై వెంటనే దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియలో పనిచేయని బీఎల్‌వో (బూత్ స్థాయి అధికారులు), ఇతర స్థాయిల్లోని అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
30 శాతంలోపే ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ : హైదరాబాద్‌లో దారుణంగా యాకుత్‌పురలో ఒకటి, బహదూర్‌పురలో ఒకటి, ముషీరాబాద్‌లో ఒకటి, మలక్‌పేటలో రెండు, నాంపల్లిలో రెండు, సికింద్రాబాద్‌లో మూడు, కంటోన్మెంట్‌లో 17 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 30 శాతంలోపే నమోదైంది. ఆ 27 మంది బీఎల్‌వోల పేర్లతో ఎన్నికల విభాగం లిస్ట్‌ను సిద్ధం చేసింది. 60 శాతం కన్నా తక్కువ ఓటరు నమోదు పత్రాల పంపిణీ జరిగిన నియోజకవర్గాల నుంచి 13 మంది ఏఈఆర్‌వో (అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్), 13 బీఎల్‌వో సూపర్‌వైజర్ల పేర్లను ఈ జాబితాలో చేర్చారు. వారికి మొదటి హెచ్చరిక జారీ చేశామని, పనితీరు మారకపోతే కచ్చితంగా వేటు వేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ నాయకులతో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ప్రజాభవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశానికి హైదరాబాద్ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు.
సర్‌ను నిరంతరం పర్యవేక్షించాలి : ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఓటరు జాబితాలో అన్-మ్యాపింగ్ పేర్లు, ఇంటి పేర్ల మార్పులు, సాంకేతిక లోపాలు, అక్షర దోషాలు లేకుండా బీఎల్‌ఏలతో కలిసి డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూలతను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేయాలని భట్టి దిశానిర్దేశం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ మాట్లాడుతూ అన్-మ్యాపింగ్‌లో ఉన్న పేర్లు 50 శాతానికి పైగా ఉండటం ఆందోళనకరంగా ఉందన్నారు. వీటిపై వెంటనే బీఎల్‌ఏలతో కలిసి సరిచూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అరచేతిలో ఎన్యూమరేషన్ ఫారం! - ఒక్క క్లిక్‌తో క్షణాల్లో 'సర్' పూర్తి చేసేయండిలా
పత్రాలు ఇచ్చారు సరే - ఎలా నింపాలి 'సర్' : అయోమయంలో పల్లె ఓటర్లు

