"అల్లరి ఆడపులి దుర్గ" - విశాఖలో సాగర తీరాన సందడి!
ఆకర్షణీయంగా బ్లాక్ పాంథర్ - ఆకర్షణీయంగా జూ పార్క్

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2026 at 3:13 PM IST
Visakhapatnam Zoo Park : ఇక్కడే పుట్టి, పెరుగుతున్న పులులు కొన్ని, ఇతర ప్రాంతాల నుంచి తరలించినవి మరికొన్ని! జనావాసాల్లోకి వచ్చి బోనులో చిక్కిన హర్ష అనే చిరుత మరొకటి! ఇవన్నీ నేడు విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాలలో కనువిందు చేస్తున్నాయి. వేసవి వేళ చిన్నారులు, పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.
రోడ్లపై గీతలు, పక్కన మైలు రాళ్లకు ఆ రంగులెందుకు? - వాటి మీనింగ్ ఎంటో తెలుసా?

విశాఖ సాగర తీరాన పచ్చని కొండల మధ్య 'ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల' వివిధ రకాల పులులతో సందడిగా మారింది. ముఖ్యంగా "బిగ్ క్యాట్స్" విభాగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బంగారు వర్ణపు రాయల్ బెంగాల్ టైగర్లు, దవళ కాంతులీనే తెల్ల పులులు, మెరుపు వేగంతో దూసుకెళ్లే చిరుతలను చూసేందుకు చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా నలుపు రంగుతో మెరిసిపోతున్న 'బ్లాక్ ఫాంథర్' సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. మొత్తంగా విశాఖ జంతు ప్రదర్శనశాలలో 7 పెద్ద పులులు, 5 చిరుతలు ఉన్నాయి.

ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి!
తెల్ల పులులు చూడ ముచ్చటగా ఉంటాయి. విశాఖ జూలో మూడు తెల్ల పులులు ఉన్నాయి. ఇక్కడే పుట్టిన 13 సంవత్సరాల వయస్సున్న విజయ్, బెంథనీ, 8 ఏళ్ల బాలు దవళ కాంతులీనుతున్నాయి. నల్లని గీతలు, మంచు లాంటి శరీర ఛాయతో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.

జనావాసాల్లోకి వచ్చి జూ లోకి
హర్ష అనే చిరుత 2008లో ఎంవీపీ కాలనీలో జనావాసాల్లోకి వచ్చి పట్టుబడింది. అప్పట్లో మూడేళ్ల వయసున్న ఈ చిరుతను అటవీ అధికారులు పట్టుకుని జంతు ప్రదర్శన శాలకు తరలించారు. 'హర్ష' అని నామకరణం చేసి ఇక్కడే పోషిస్తున్నారు. ప్రస్తుతం హర్ష వయస్సు 21 ఏళ్లు. ఇక్కడున్న జంతువుల్లో దీని వయస్సే ఎక్కువ కావడం గమనార్హం. హర్ష తో పాటు ఆడుకోవడానికి అసోం నుంచి వచ్చిన మరో చిరుతతో కలిపి మొత్తం నాలుగు చిరుతలు ఇక్కడ సందడి చేస్తున్నాయి.

ఆకర్షిస్తున్న నల్ల పులి
సందర్శకుల్లో అధికులు నల్లరంగు చిరుత పులి 'రిజిమా'ను పలకరిస్తున్నారు. 4 ఏళ్ల వయసున్న ఈ బ్లాక్ పాంథర్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య కాలంలోనే దీనిని అధికారులు ఇక్కడికి తరలించారు. సాధారణ చిరుతల్లా కాకుండా నలుపు రంగుతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగని ఇది ప్రత్యేకం కాదు. మెలనిజం అనే జన్యు పరమైన కారణాలతో చర్మం నల్లగా కనిపిస్తుందే తప్ప ఎండలో నిశితంగా గమనిస్తే శరీరంపై ఉండే మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ మెలనిస్టిక్ చిరుతపులి విశాఖ జూలో కనిపించడం విశేషం.
రాయల్ బెంగాల్ గంభీరం
పులిని చూడాలని, పులితో సెల్ఫీ దిగాలని పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపుతున్నారు. వచ్చే వారిలో అధికులు రాయల్ బెంగాల్ టైగర్ కోసం చూస్తున్నారు. 12 ఏళ్ల మగ పులులు మంజునాథ్, ఆకాశ్ తో పాటు అల్లరి ఆడ పులిగా పేరొందిన 6 సంవత్సరాల 'దుర్గ' సందర్శకులను అబ్బుర పరుస్తున్నాయి. మొత్తం మూడు పులులు తమ రాజసాన్ని ప్రదర్శిస్తున్నాయి.

జంతు ప్రదర్శనశాలలో ఉన్న వివిధ జంతువులు గత నెలలో కూనలకు జన్మనిచ్చాయి. అందులో భారతీయ తొడేలు, చారల హైనా, అడవికుక్క, దుప్పి, మచ్చల జింక, మార్మోసెట్ కోతులు సహా మరికొన్ని పక్షులకు పిల్లలు పుట్టాయి. 6 జంతువులకు 24 కూనలు, 3 పక్షులకు 11 పిల్లలు పుట్టాయి. అధికారులు వాటి ఆరోగ్య పరిరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతరించిపోతున్న పలు జాతులు సంతానోత్పత్తితో పాటు వాటి పరిరక్షణకు పశువైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పోషకాహారం అందించడంతో పాటు సురక్షితమైన వాతావరణంలో వాటిని సంరక్షిస్తున్నారు.

"దయచేసి వినండి" - తిరుపతికి మరో కొత్త ట్రైన్ వచ్చేస్తోంది!
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మనకు సమీపంలో హిల్ స్టేషన్స్ ఇవే!

