అరటి తోటను సందర్శించిన బిల్‌గేట్స్ - డ్రోన్లు, ఏఐతో చేసే సాగు విధానంపై రైతులతో చర్చ
ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించిన బిల్‌గేట్స్, గేట్స్ ఫౌండేషన్ బృందం - డ్రోన్లతో పురుగుమందుల పిచికారి, ఏఐ ద్వారా చీడపీడలు గుర్తించడంపై రైతులతో చర్చ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 4:23 PM IST
|Updated : February 16, 2026 at 5:06 PM IST
Bill Gates visit Banana Plantation in Undavalli: ఉండవల్లిలోని అరటి తోటను బిల్ గేట్స్, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు సందర్శించారు. చీడపీడలను నివారించేందుకు డ్రోన్ల సాయంతో పురుగుమందుల పిచికారి, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చీడపీడలను గుర్తించడంపై రైతులతో చర్చించారు. నివారణ చర్యలు చేపడుతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు.
అమరావతి పర్యటన ముగించుకుని బిల్ గేట్స్ విజయవాడ బయలుదేరారు. విజయవాడలోని పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియానికి వెళ్లి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం విజయవాడ విమానాశ్రయానికి వెళ్లారు. దాదాపు 5 గంటలపాటు బిల్ గేట్స్ ఏపీ పర్యటన సాగింది. పొగమంచు కారణంగా గేట్స్ విమానం ల్యాండింగ్‌లో స్వల్ప ఆలస్యం జరిగినప్పటికీ అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శన: అంతకుముందు ప్రపంచటెక్నాలజీ రంగానికి దిశానిర్దేశం చేసిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించడం ఏపీ డిజిటల్ పరిపాలనకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల అమలు, విస్తరణపై చర్చించేందుకు సచివాలయనికి వచ్చిన బిల్‌గేట్స్‌కు సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు,ఉన్నతాధికారులను పరిచయం చేశారు. హలో ఫ్రెండ్- హౌఆర్ యూ అంటూ బిల్ గేట్స్ పలకరించగా నేను బాగున్నా, మీరెలా ఉన్నారంటూ సీఎం కుశలప్రశ్నలు వేశారు. ఆతర్వాత ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌర సేవలు డేటా లేక్‌తో శాఖల సమగ్ర అనుసంధానం, అవేర్ 2.0 ఆధారిత తక్షణ నిర్ణయ వ్యవస్థ, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలను బిల్ గేట్స్ సమగ్రంగా పరిశీలించారు.
డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.O ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్నిసేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్‌తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
బయో డిజైన్ ద్వారా వైద్య సేవల విధానాలను అడిగి తెలుసుకున్న గేట్స్ డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ప్రశంసించగా జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలనూ గేట్స్‌కు చంద్రబాబు వివరించారు. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని గ్రేట్ వర్క్ అని బిల్ గేట్స్ మెచ్చుకున్నారు.
ముగిసిన బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటన - అయిదున్నర గంటలపాటు వివిధ కార్యక్రమాలు
బిల్‌గేట్స్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు - ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాలపై ప్రధానంగా చర్చ

