ETV Bharat / state

బైకర్ మెడకు చుట్టుకున్న గాలిపటం మాంజా - తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువకుడు

ఓ వ్యక్తి బైక్​పై వెళ్తుండగా మెడకు చుట్టుకున్న మాంజా - ఘటనలో బైకర్​కు తీవ్ర గాయాలు - వెంటనే ఆస్పత్రికి తరలింపు - శస్త్ర చికిత్స చేసి కాపాడిన వైద్యులు

యువకుడి గొంతు కోసిన మంజా దారం
Manja String Slits Young Man Throat (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : December 6, 2025 at 10:32 PM IST

|

Updated : December 6, 2025 at 10:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Man Injured with Manja in Hyderabad : సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు, పిల్లలు ఆనందంగా గాలిపటాలను ఎగరవేస్తుంటారు. వాటిని ఎక్కువ ఎత్తుకు ఎగిరించే ప్రయత్నంలో, తెగిపోకుండా ఉండటానికి మాంజా దారాన్ని వాడుతుంటారు. ఈ దారం ఎంత ప్రమాదకరమైందంటే, మనుషుల గొంతులను సైతం సునాయసంగా తెంచేయగలదు. తాజాగా హైదరాబాద్​లో ఓ వ్యక్తి బైక్​పై వెళ్తుండగా అకస్మాత్తుగా మాంజా అతడి మెడకు చుట్టుకుంది. తీరా అతడు దాన్ని ఏంటని చూసే సరికే మెడ తెగిపోయింది. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి దీన్ని గమనించి, వెంటనే సమీప ఆస్పత్రికి తరలించాడు. ఈ ప్రమాదంలో బాధితుడి రక్త నాళాలు కూడా తెగిపోయాయి. పండగకు ఇంకా సుమారు 40 రోజుల పైనే ఉన్నా, ఇప్పటి నుంచే వీటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

హెల్మెట్ ధరించినా : హైదరాబాద్​లోని గుర్రంగూడకు చెందిన కార్తీక్ త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో కలిసి, కామినేని హాస్పిటల్​ దగ్గరున్న ఫ్లై ఓవర్​పై హెల్మెట్ ధరించి బైక్​పై వెళ్తున్నాడు. అనుకోకుండా అతడి మెడకు ఏదో చిక్కుకున్నట్లు అనిపించింది. తీరా చూస్తే మాంజా దారం అతడి మెడకు చుట్టుకుని, గట్టిగా తెంచేసింది. మెడ కండరాలతో పాటు, లోపల ఉండే రక్తనాళాలు కూడా తెగిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. అదృష్టవశాత్తూ, లోపలి ప్రధాన రక్త నాళాలు, శ్వాస నాళం దెబ్బతినలేదు. వెంటనే దగ్గర్లో ఉన్న కామినేని హాస్పిటల్​కి తరలించడంతో, వైద్యులు శస్త్ర చికిత్స చేసి రక్తనాళాలను అతికించి బాధితుణ్ని కాపాడగలిగారు.

అందుకే ఆపరేషన్ చేశాం : బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగానే, అత్యవసర విభాగానికి చేర్చి, రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించినట్లు డాక్టర్లు తెలిపారు. కానీ, ఎంతకూ రక్తం ఆగకపోవడంతో, ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్ర చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, తెగిపోయిన రక్తనాళాన్ని అతికించి, కండరాన్ని కూడా కుట్టినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో కార్తీక్ గొంతుకు తగిలిన మాంజా దారాన్ని చేత్తో తీసే క్రమంలో చేతి వేళ్లు కూడా తెగిపోయాయి. బాధితుడి వెంట ఉన్న యువతికి కూడా మెడ, కంటి దగ్గర స్వల్పంగా గాయాలయ్యాయి. ఆమెకు కూడా ప్రాథమిక చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు.

"నాకు కాబోయే భార్యతో నాగోలు వైపు వెళ్తున్నాను. అకస్మాత్తుగా నా మెడకు ఏదో తగిలి కోసుకుపోయినట్లు అనిపించింది. చేయి పెట్టి చూస్తే, హెల్మెట్​ లోపలి నుంచి మాంజా కనిపించింది. దాన్ని తీసివేసేటప్పుడు చేతికి గాయమైంది. మెడ దగ్గర చేయి పెట్టి చూస్తే అంతా రక్తమే. ఇంతలో అటుగా వెళ్తున్న వ్యక్తి నాకు సహాయం చేశారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలను ఆపినా ఆగకపోవడంతో, ఆయనే తన బైక్​పై నన్ను దగ్గర్లో ఉన్న కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత తెలిసిందేంటంటే నన్ను కాపాడింది కూడా ఈ ఆస్పత్రి వైద్యుడేనని. కానీ, ఇలా మాంజాలతో పతంగులను ఎగరేయడం, బాటసారులకు చాలా ప్రమాదకరం" - కార్తీక్, బాధితుడు

అధికారులు చర్యలు తీసుకోవాలి : సంక్రాంతి పండగతో సంబంధం లేకుండా ఇప్పటి నుంచే పతంగులు ఎగరేయడం, వాటికి మాంజాలను ఉపయోగించడం పట్ల అధికారులు చర్యలు తీసుకోవాలని డాక్టర్లు కోరారు. మాంజా దారాలు తెగిపోయి, గాలికి వేలాడుతూ రోడ్ల మీద వెళ్లే వారికి ప్రాణాపాయంగా మారాయని అన్నారు. ముఖ్యంగా గాజు పూసిన మాంజాలు ఎక్కువ ప్రమాదకరంగా ఉంటాయని వైద్యులు వివరించారు. వాటిని నియంత్రించడం కోసం అధికారులు త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే నిత్యం ఈ తరహా ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు.

పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం!

చేతి వేలు తెంచిన చైనా మాంజా - ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణానికే ప్రమాదం!

Last Updated : December 6, 2025 at 10:56 PM IST