భూమా అఖిలప్రియ Vs గంగుల నాని - నేడు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
అహోబిలం మఠంలోని తలనీలాల అంశంలో వివాదం - తలనీలాల అంశంపై టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం - నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 9, 2026 at 10:19 AM IST
TDP vs YSRCP in Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైరి వర్గాలు తలపడే పరిస్థితి తృటిలో తప్పింది. అహోబిలం మఠంలోని తలనీలాల వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని (గంగుల బ్రిజేంద్రరెడ్డి)ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డలో వాతావరణం వేడెక్కింది. ఏడాది నుంచి అహోబిలంలో తలనీలాల విక్రయించడానికి టెండర్లు పిలవకుండా మఠం అధికారులు జాప్యం చేస్తున్నారు.
తలనీలాల టెండర్లను రద్దు చేశామని చెప్పిన మఠం అధికారులు మంగళవారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా 150 కిలోల తలనీలాలను చెన్నైకి చెందిన ఓ గుత్తేదారుకు అప్పగించడానికి వాహనంలో తీసుకెళ్తుండగా టీడీపీ నేతలు పట్టుకున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి స్వయంగా వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దొంగచాటుగా తలనీలాలను సీఈఓ పార్థసారథి అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.
High tension in Allagadda : అయితే ఎమ్మెల్యే అఖిలప్రియే మఠంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని ఆరోపించారు. ఆయన మాటలపై మండిపడిన ఎమ్మెల్యే అఖిలప్రియ అదే నిజమైతే బుధవారం సాయంత్రం అహోబిలం మఠానికి వచ్చి తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. సాయంత్రం ఐదు గంటలకు అఖిలప్రియ రెండు వాహనాల్లో ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వెళ్లారు. అదే సమయానికి గంగుల నాని ఆళ్లగడ్డలోని ఇంటినుంచి బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
‘‘పోలీసులు అడ్డుకున్నారు. అందుకే సవాల్ నిరూపణకు రాలేకపోయామని చెబుతూ హీరోలై పోవాలని మాజీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు. ఎస్పీ సమక్షంలోనే పంచాయితీ చేశాం. అహోబిలంలో మాజీ సీఈఓ పార్థసారథి నరసింహ స్వామికి చెందిన బంగారం, వెండి, తలనీలాలు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అనుమతి లేకుండా అహోబిలం నుంచి ఎలాంటి విలువైన వస్తువులు పోకుండా అడ్డుకోవాలని చెప్పా. అయినా ఎస్పీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే అహోబిలంలో అక్రమాలకు ఆస్కారం ఏర్పడింది. తనపై చేసిన ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే నిరూపించాలని, లేనిపక్షంలో క్షమాపణలు చెప్పాలి." - అఖిలప్రియ, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే
"చర్చకు ఎప్పుడైనా సిద్ధం. మీరు పోలీసులతో మాట్లాడి మాకు సమయం ఇప్పించండి. మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధం. మేము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం." - గంగుల నాని, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అఖిలప్రియ రాత్రి అహోబిలం నుంచి ఆళ్లగడ్డకు వచ్చి గంగుల నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పడకండ్ల బైపాస్ రోడ్డు మీదుగా మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుండగా సీఐలు నాగరాజారావు, బీవీ రమణ, ఎస్సై రామిరెడ్డి ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. ఈ దశలో ఆమె స్పందిస్తూ చర్చకు వెళ్తున్నానని, తనను అడ్డుకోవద్దన్నారు. సీఎం వచ్చే ఒక రోజు ముందు ఆరోపణలు చేయడమేంటని మండిపడ్డారు.
ఇలాంటి ఆరోపణలు చేసినా పోలీసులు స్పందించకపోవడంతోనే సమస్య ఇంత వరకు వచ్చిందని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు సర్దిచెప్పి ఎమ్మెల్యేను ఇంటికి పంపించారు. నేడు సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా బనగానపల్లెకు వస్తున్న సమయంలో రెండు పార్టీల నేతల మధ్య సవాళ్ల పర్వం చెలరేగడంపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ గొడవలు జరగకుండా రెండు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా - వైఎస్సార్సీపీకి భూమా అఖిలప్రియ సవాల్
మచిలీపట్నంలో హీటెక్కుతున్న రాజకీయాలు - కొల్లు రవీంద్ర Vs పేర్ని నాని

