ETV Bharat / state

మీ వద్ద పాత వాహనం ఉందా? - రెట్రోఫిట్​తో కొత్త ఈవీగా మార్చుకోండిలా

వాహనదారుల్లో రెట్రోఫిట్​మెంట్​పై పెరుగుతున్న అవగాహన - పాత వాహనాలను ఈవీలుగా మార్చుకుంటున్న పలువురు - రిట్రోఫిట్ ద్వారా ఈవీ కిట్ అమర్చే ఆటోలకు ప్రభుత్వం ప్రోత్సహకాలు

Retrofitment To Old Vehicles
ప్రతీకాత్మక చిత్రం (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 27, 2026 at 7:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Retro Fitment To Old Vehicles : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని సీఎన్జీ, ఎల్‌పీజీ వైపు, అవి అందుబాటులో ఉండటం లేదని ఈవీ (విద్యుత్ వాహనాల) వైపు వాహనదారులు చూస్తున్నారు. పెట్రోల్‌ వాహనాలకు సీఎన్జీ కిట్లను అమర్చడాన్ని పలు ప్రాంతాల్లో గమనించే ఉంటాం. కానీ ప్రస్తుతం ట్రెండు మారింది. అందరూ ఈవీ కిట్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆటోలకు ఈ మార్పులు చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. రెట్రోఫిట్‌ విధానంలో ఈవీ కిట్లను అమర్చుకునే వాహనాలకు ప్రోత్సాహకాలను కూడా ఇస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులను కూడా ఈవీలుగా మారుస్తున్నాయి. దిల్లీ ప్రభుత్వం ఈ విషయంలో అన్ని నగరాల కంటే ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు.

మీ వాహనం సిద్ధమేనా :

  • రోజూ కనీసం 50 కిలోమీటర్లకు పైగా తిరిగే పెట్రోల్‌ వాహనాలకు రెట్రోఫిట్‌ చేసుకుంటే గిట్టుబాటు అవుతుంది. సీఎన్‌జీ రెట్రోఫిట్‌ చేస్తే పెట్రోలు ఖర్చు ఆదా అయ్యే అవకాశం.
  • కనీసం 7-8 సంవత్సరాలు దాటిన వాహనం మంచి కండిషన్‌లో ఉంటే సీఎన్‌జీ లేదా ఈవీ కిట్లను అమర్చుకోవచ్చని ఆటోమొబైల్‌ నిపుణులు సూచిస్తున్నారు.
  • ఆ విధంగా మార్చేటప్పుడు వాహనం బాడీ తుప్పు పట్టిందా, ఇంకా కనీసం 10-15 ఏళ్లు నడపొచ్చా అనేవి పక్కాగా అంచనా వేసుకోవడం ఉత్తమం.
  • ఫ్రేమ్, ఛాసిస్‌ దృఢంగా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి.
  • అవసరమైతే వర్క్‌షాప్‌లలో వాహన కండిషన్‌ చెక్ చేయించి, వాహన మోడల్‌కు ఏఆర్‌ఏఐ(ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ధ్రువీకరించిన ఈవీ కిట్‌ సరిపోతుందో లేదో చూసుకోవచ్చు.
  • వాహన మార్కెట్‌ వేగంగా మారిపోతున్న కాలంలో రెట్రోఫిట్‌ చేయనున్న పాత వాహన విడిభాగాలు భవిష్యత్తులోనూ దొరుకుతాయో లేదో అనే విషయాలు తెలుసుకోవాలి.

ఏ విధంగా చేయించుకోవాలి : ఏ ఈవీ కిట్ అమర్చినప్పటికీ ఏఆర్‌ఏఐ, సీఐఆర్‌టీ, ఏసీఏటీ, జీఏఆర్‌సీ తదితర సంస్థల గుర్తింపు పొందిన రెట్రోఫిట్‌ సెంటర్లను సంప్రదించాలి. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లేదా ఆర్టీఓ ఆమోదించిన కిట్లను ఉపయోగించే అధీకృత గ్యారేజీలలో రెట్రోఫిట్ చేయించుకోవడం ఉత్తమం. అనధికార కిట్లు సురక్షితం కాదని గుర్తుంచుకోండి.

కార్లను విద్యుత్ వాహనాలగా మార్చడానికి ప్రారంభ ధరే రూ.3 లక్షలు ఉంటుందని, అందుకే వాణిజ్యంగా తిరిగే క్యాబ్స్, డెలివరీ వాహనాలకు అమర్చుకుంటే గిట్టుబాటవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈవీ వాహనంగా మార్చాలంటే ఏం చేయాలి? :

  • సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం వాహనంలో చేయబోయే మార్పులతో సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్సీ, లైసెన్స్, అమర్చబోయే ఎలక్ట్రిక్‌ కిట్‌ వివరాలు సమర్పించి ముందస్తు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆథరైజిడ్ సెంటర్లో మార్పులు చేసుకోవాలి.
  • కిట్‌ అమర్చిన తర్వాత వాహనం పనితీరు, బ్రేకులు, ఎలక్ట్రానిక్స్‌ వ్యవస్థలను ఆ సంస్థే తనిఖీ చేసి ఇస్తుంది. అప్పుడే ఇన్వాయిస్‌తో కూడిన ఫిట్‌నెస్, కన్వర్షన్‌ సర్టిఫికెట్​ను ఇస్తారు.
  • మళ్లీ ఈ సర్టిఫికెట్‌ను, వాహనాన్ని ఆర్టీవో ఆఫీసుకు తీసుకెళ్తే ఎంవీఐ పరిశీలించి ఆర్సీలో ఇంధన రకాన్ని ఎలక్ట్రిక్ వెహికల్​గా మార్చి ఎండార్స్‌మెంట్‌ చేస్తారు. అప్పుడు ఆ వాహనం ఈవీగా మారిపోయినట్లు లెక్క. అప్పుడే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

రెట్రోఫిట్‌ అంటే? : తయారీ సమయంలో వాహనానికి ఉన్న ఇంజిన్‌ లేదా ఇంధన వ్యవస్థను మార్చి కొత్త సాంకేతికతను అమర్చడమే రెట్రోఫిట్​మెంట్ అంటారు. పెట్రోల్​తో నడిచే కార్లకు సీఎన్‌జీ కిట్లు అమర్చడం దీని కిందికే వస్తుందని చెప్పవచ్చు. ఈ విధానం ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కన్వర్షన్‌ కిట్లను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండటంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.

కేంద్రాలు ఇక్కడే :

  • హైదరాబాద్‌ నగరంలో బోయగూడ, అత్తాపూర్, నాగోల్, ఎల్బీనగర్‌లలో సీఎన్‌జీ కిట్లు అమర్చేందుకు ప్రభుత్వ ఆమోదం పొందిన అధీకృత ఆటో గ్యాస్‌ సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయి.
  • ఈవీ కన్వర్షన్‌ సెంటర్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. బొల్లారం, ఎల్బీనగర్​తో పాటు తెల్లాపూర్‌ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు, ఆటోలకు మాత్రం చేస్తున్నారు. ఆటోలు, ఇతర వస్తు రవాణా చేసే వాహనాలకు రెట్రోఫిట్‌ చేసే ప్రభుత్వ ఆమోదిత సంస్థలు ఉన్నాయి.

"ఒక రోజుకు డ్రైవర్‌ ఆటోను సుమారు 10 నుంచి 12 గంటల సమయం నడుపుతున్నారు. సగటున 1100 సార్లు గేర్లు మారుస్తున్నారు. దీంతో వాహన వైబ్రేషన్, గేర్ల మార్పు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈవీతో ఇలాంటి సమస్యలు తలెత్తవు. అటు కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన రాయితీ సొమ్ముతోనే ఒక ఆటోకు ఈవీ కిట్‌ అమర్చే విధంగా ప్రణాళిక వేస్తున్నాం. రెట్రోఫిట్‌తో ఈవీ కిట్​ను అమర్చుకోవచ్చని ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది"- రాణి శ్రీనివాస్, జీరో 21 రెట్రోఫిట్​ సెంటర్ వ్యవస్థాపకులు

'ప్రభుత్వం పథకం బాగుంది - కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆటోలను కూడా కంట్రోల్ చేయాలి!'

మీ పాత బండి 15 ఏళ్లు దాటేసిందా? - రూ.30 వేలతో ఎలక్ట్రిక్​ బైక్​గా మార్చేసుకోండి!