వరిపొట్టు, ఆయిల్‌పామ్ వ్యర్థాలు, కోకోపిట్ - మట్టి లేకుండానే మొక్కల పెంపకం
మట్టి వల్ల ఎక్కువగా తెగుళ్ల సమస్యలు వస్తున్నాయంటున్న నిపుణులు - నర్సరీలో అవసరమైనంత అందుబాటులో లేని మట్టి- ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించిన పరిశోధకులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 4:59 PM IST
Plants Without Soil : మొక్కలు, చెట్లు పెరగడానికి మట్టి ప్రముఖ పాత్ర వహిస్తుంది. కిరణజన్య సంయోగ క్రియకు నీరు, గాలి, సూర్యరశ్మి ఎంత ముఖ్యమో, మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి మట్టి కూడా అంతే ముఖ్యం. కానీ మట్టి లేకుండానే మొక్కలు పండించవచ్చని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవునండి. సరిపడినంత మట్టి అందుబాటులో ఉండకపోవడం, చీడపీడల వల్ల ఎదుగుదల సరిగ్గా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఓ కొత్త ఆవిష్కరణ చేస్తున్నారు. అదే మట్టి లేకుండానే మొక్కలు పెంచడం. మరి మట్టికి ప్రత్యామ్నాయంగా ఏది తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం.
మట్టికి బదులుగా ఏంటంటే : కడియం నర్సరీలలో కొన్ని లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇవి జాతీయస్థాయిలో ఎంతగానో గుర్తింపును తెచ్చుకున్నాయి. అయితే, ఈ మొక్కలను పెంచడానికి అవసరమైన మట్టి అందుబాటులోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం ప్రత్యామ్నాయంగా 'కోకోపిట్' వంటివాటిపై పరిశోధనలు చేస్తున్నారని వేమగిరిలోని పూల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం. లక్ష్మీపతి ఈటీవీ భారత్‌తో అన్నారు.
ఉత్తరాల నుంచి అవుతున్న దిగుమతి :'మొక్కలను పెంచడానికి మట్టి ఎంత అవసరమో తెలిసిందేనని, అవసరమైనంత దొరక్కపోవడంతో మట్టిని ఉత్తర ప్రాంతాల నుంచి రూ. లక్షల్లో దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. దానికి తోడు అందులో చీడపీడలు ఉండడంతో మొక్కల ఎదుగుదల తగ్గిపోతోందని చెప్పారు. దీంతో పసుపుమచ్చల తెగుళ్లు, ఆకుముడత వంటివి వస్తున్నాయని, నష్టాలు మాత్రం తప్పట్లేవన్నారు. ఆలమూరు, అమలాపురం, కడియం, రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతాలు, అంబాజీపేట, ఆత్రేయపురం, ప్రత్తిపాడు వంటి పలు మండలాల్లో పూలతోటల సాగు ఎక్కువగా ఉందని లక్ష్మీపతి చెప్పారు. అందువలన మట్టికి బదులుగా ఏదైనా వాడడానికి రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.
చాలా దేశాలు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి : మట్టికి బదులుగా పేపరుమిల్లు, వరిపొట్టు, కోకోపిట్‌తో వరిపొట్టు, ఆయిల్‌పామ్ వ్యర్థాలు, వర్మీకంపోస్ట్ వాడుతూ కొన్ని మొక్కలను పెంచుతున్నామని ఆయన అన్నారు. అవి బాగా పెరుగుతున్నాయని చెప్పారు. కోకోపిట్‌ను వాడుతూ చాలా దేశాలు మట్టి లేకుండానే మొక్కలు పెంచుతున్నాయన్నారు. బరువు తక్కువగా ఉండడంతో రవాణాను సులభంగా చేయవచ్చన్నారు. దీంతో తెగుళ్లు వ్యాపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.
సూక్ష్మ పోషకాలు అందించడం ద్వారా : కడియం, వెలిచేరు, కొత్తపేట, ప్రత్తిపాడు ప్రాంతాల్లోని నేలలో నెమటోడ్స్ ఎక్కువగా ఉండడంతో, స్పాతోఫిల్లం, చామంతి మొక్కలను పెంచుతున్నామని చెప్పారు. ఇందులో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. మొక్కల అవసరమైన సూక్ష్మ పోషకాలు, నీరు అందించడం వల్ల ఎదుగుదల బాగుందని అన్నారు.
అక్కడి ప్రభుత్వాల ప్రోత్సాహంతో : మొక్కల ఉత్పత్తి కోసం బయో కేంద్రాలను స్థాపించడానికి కర్ణాటక ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో చీడపీడలు లేని మొక్కల తయారీలో రైతులు దృష్టి సారించారు. హోసూరు, బెంగళూరులో దాదాపుగా 1500 టిష్యూ కల్చర్ కేంద్రాలున్నాయి. వాటి తర్వాత గుజరాత్, మహారాష్ట్ర ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు పాలీహౌస్ నిర్మాణాలు, పనిముట్లు, విత్తనాలు, వంటివి రైతులకు అందిస్తూ, ప్రోత్సహిస్తున్నాయి. ఇదిలా ఉండగా, మన రాష్ట్రంలో మాత్రం టిష్యూ కల్చర్ విధానాన్ని అనుసరించడానికి రైతులు ఆసక్తి కనబరచడం లేదు. దీని వల్ల తెగుళ్లు లేకుండా, మొక్కలు బాగా పెరుగుతాయి.
నర్సరీల్లో మొక్కలు కొనే ముందు జాగ్రత్త : తల్లిమొక్కను చూసి రకాల్ని ఎంచుకోవాలి, దాని లక్షణాలే అంటుకట్టిన మొక్కలకూ వస్తాయని అధికారులు చెప్పారు. అంతేకాకుండా నర్సరీల విశ్వసనీయతను పరిశీలించాలి. దీనికితోడు నర్సరీల్లో విత్తనాలిచ్చి నారు పెంచుకునే రైతులు విత్తన కొనుగోలు రసీదుల్ని భద్రంగా దాచుకోవాలి. పెంచిన మొక్కలను తీసుకునేటప్పుడు కూడా నర్సరీ యజమానుల నుంచి రసీదులు తీసుకోవాలి. మొక్కల్లో లోపాలుండి, ఒకవేళ దిగుబడి రాకపోతే రసీదు ఆధారంగా పరిహారం పొందవచ్చు. తెగుళ్లను సైతం రైతులు పరిశీలించాలి. ఒక మొక్క ద్వారా మొత్తం తోటకు వ్యాపించవచ్చు.
ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి - ఆరోగ్యంతో పాటు డబ్బు ఆదా
మినీ నర్సరీలా మారిన ఇల్లు - 600 రకాల మొక్కలను పెంచుతోన్న విశ్రాంత ఉద్యోగిని

