ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తరాంధ్రకు వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడి - పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం - విజయనగరం, మన్యంతోపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 23, 2026 at 2:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

AP Weather Alert : బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్న విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

దీంతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. అటు వర్షాల కోసం మార్కాపురం జిల్లాలో స్థానికులు వినూత్న పూజలు నిర్వహించారు.

ఉత్తరాంధ్రపై అల్పపీడన ప్రభావం : బంగాల్ - బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. అలాగే శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

యంత్రాంగానికి మంత్రి ఆదేశాలు : వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి వంగలపూడి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నందున జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించాలన్నారు.

ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

వర్షాల కోసం 101 బిందెలతో జలాభిషేకం : ఒకవైపు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా, మరోవైపు వానలు సమృద్ధిగా పడాలని రైతులు, ప్రజలు వినూత్న పూజలు చేస్తున్నారు. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం పిల్లికుంట తండాలో గ్రామస్థులు ప్రత్యేక భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోలేరమ్మ, గంగమ్మ తల్లులకు బిందెలతో నీళ్లు పోసి జలాభిషేకం చేశారు. ముఖ్యంగా గంగమ్మ తల్లికి 101 బిందెల నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాన దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. పాడిపంటలు వృద్ధి చెంది, ప్రతి ఒక్కరూ సిరిసంపదలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్థులు మొక్కుకున్నారు.

వరదల బీభత్సం- 5 రోజులు తాటిచెట్టుపైనే ఉండి ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి!

వాతావరణం అంచనా వేయడం ఇక ఈజీ - IMD తీసుకొచ్చిన 4 అత్యాధునిక యాప్‌లు ఇవే