ETV Bharat / state

18 ఏళ్లు న్యాయపోరాటం చేశాం - మాకు న్యాయం జరగలేదు: ఆయేషా మీరా తల్లిదండ్రులు

తెనాలి ముస్లిం శ్మశానవాటికలో ఆయేషా మీరా అంత్యక్రియలకు ఏర్పాట్లు - 18 ఏళ్లు పోరాడినా న్యాయం జరగలేదన్న ఆయేషా తల్లిదండ్రులు

Ayesha Meera Murder Case Updates
Ayesha Meera Murder Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 2:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ayesha Meera Murder Case Updates: కుమార్తెను దారుణంగా హత్య చేశారు. 18 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశాం. రీపోస్ట్ మార్టం చేయాలంటూ సీబీఐ అధికారులు శరీర భాగాలు తీసుకున్నారు. హంతకులెవరో పోలీసులు, సీబీఐ అధికారులు తేల్చలేకపోయారు. మాకు న్యాయం జరగలేదు అంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. ఆ అవశేషాలు తీసుకునేందుకు ఏడేళ్లు పోరాటం చేశామన్నారు. ఆయేషా మీరా అవశేషాలు విజయవాడ సీబీఐ కోర్టు నుంచి తీసుకున్నారు. తన కుమార్తెను చంపిన నిందితుడ్ని పట్టుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు కోర్టు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు . అనంతరం శరీర భాగాలను ఖననం చేసేందుకు తెనాలి వెళ్లారు.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను కర్కశంగా కడతేర్చారు. 18 ఏళ్ల పాటు న్యాయ కోసం పోరాటం చేశాం. అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రజాస్వామ్యంలో పేదలకు న్యాయం జరగదా ? అంటూ ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ప్రశ్నించారు. ఆయేషా హత్య కేసును విచారణ చేసిన పోలీసులు, సిట్, సీబీఐ అధికారులు అసలైన హంతకుడ్ని పట్టుకోలేకపోయారని ఆరోపించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు రీపోస్ట్ మార్టం చేయాలని ఆయేషా శరీర భాగాలను తీసుకున్న సీబీఐ అధికారులు వాటిని తిరిగి తీసుకునేందుకు సైతం ఏడేళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సీబీఐ కోర్టు ఆదేశాలతో అయేషామీరా అవశేషాలను తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. శరీర భాగాలను తీసుకుని ఆయేషా మీరా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు కోర్టు నుంచి బందర్ రోడ్​లోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. న్యాయం కోసం‌ తాము తిరుగుతుంటే, దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేస్తున్నారని ఆయేషా తల్లి ఆరోపించారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నాని తెలిపారు. సీబీఐ అధికారులు ఆధారాలు లేవని చెబుతున్నారని, ధనికులకు మాత్రమే న్యాయం జరుగుతోందని ఆక్షేపించారు. ఎఫ్​ఐఆర్​లో వయస్సు కూడా తప్పుగా నమోదు చేశారని ఆరోపించారు. తన కుమార్తె కేసును పోలీసు అధికారులు తొక్కిపెట్టారని ఆరోపించారు.

'మేము న్యాయం కోసం‌ తిరుగుతుంటే, దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేస్తున్నారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నా. సీబీఐ కూడా ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిని తేల్చలేకపోయింది. మాకు న్యాయం చేయకపోగా అన్యాయం చేశారు. ఆధారాలు లేవని చెప్పి కేసు కొట్టేశారు. ధనికులకు మాత్రమే న్యాయం జరుగుతోందిక్కడ. పేదవారికి న్యాయం జరగటం లేదు.' -ఆయేషా తల్లిదండ్రులు

ఆయేషా మీరాను 2007 డిసెంబరు 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో కర్కశంగా హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మొదట పనివాడని, ఆ తర్వాత లడ్డూ అనే వ్యక్తి పేరును తెరపైకి తెచ్చారు. అనంతరం సత్యంబాబు నిందితుడని తేల్చారు. మొదటి నుంచి కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. కేసు ఆధారాలు సేకరించటం, ఉన్న ఆధారాలను భద్రపరచటంలో సైతం నిర్లక్ష్యం వహించారని ఆయేషా తల్లి ఆరోపించారు. విజయవాడలోని మహిళా సెషన్స్‌ కోర్టు సత్యంబాబును దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టేసి సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి అప్పట్లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 11 నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్‌ దిగువ కోర్టులో కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమయ్యాయని హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సీబీఐకి హైకోర్టు బదిలీ చేసింది.

మూడు దర్యాప్తు సంస్థలు విచారణ చేసినా ఆయేషా మీరా హంతకుడ్ని మాత్రం పట్టుకోలేకపోయారని ప్రజా సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి . ప్రభుత్వం ఆయేషా మీరా తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతున్నారు

అయేషా మీరా హత్య కేసులో కోర్టు కీలక తీర్పు - అవశేషాలను కుటుంబానికి అప్పగించాలని ఆదేశం

18 ఏళ్లుగా మిస్టరీగానే - విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు