ఆధునిక సాంకేతికతతో విపత్తు నియంత్రణ - తుపానుపై అవేర్ 2.0 అస్త్రం
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఒకే సమయంలో సమాచారం - ప్రాణ, ఆస్తి నష్టం తగ్గింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 31, 2025 at 10:54 AM IST
Disaster Management Technology: మొంథా తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో విజయవంతమైందని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాత్రింబవళ్లు పర్యవేక్షణ జరిపినట్లు ఆయన చెప్పారు.
తుపాను సమయంలో ‘అవేర్ 2.0’ వ్యవస్థను వినియోగించడం ద్వారా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ, వార్డు స్థాయి అధికారుల వరకు ఒకేసారి సమాచారం చేరేలా వ్యవస్థను రూపొందించామని వెల్లడించారు. ఈ సమగ్ర సమాచారం వలన ఎవరెక్కడ, ఎప్పుడు ఎలా స్పందించాలో స్పష్టత ఏర్పడిందని, దాంతో తక్షణ సహాయచర్యలు చేపట్టడం సులభమైందన్నారు.
డేటా లేక్, సీసీటీవీలు, డ్రోన్లతో రియల్‌టైమ్ మానిటరింగ్: కాటంనేని భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం, అవేర్ 2.0 వ్యవస్థను రాష్ట్ర డేటా లేక్‌తో అనుసంధానం చేశారు. మొత్తం 14,770 సీసీటీవీ కెమెరాలు ఆర్టీజీఎస్ కేంద్రానికి కనెక్ట్ చేసి తుపాను ప్రభావిత ప్రాంతాలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించారు. తీవ్ర వాతావరణ పరిస్థితులను గుర్తించిన ప్రాంతాల్లో 602 డ్రోన్లును వినియోగించి పరిస్థితులను నిశితంగా గమనించారు.
ఇక గ్రామ, వార్డు స్థాయిలో 5,803 కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సచివాలయ సిబ్బంది, స్థానిక అధికారులు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించారు. ఎక్కడైనా చెట్టు కూలినా, విద్యుత్ స్తంభం పడిపోయినా, ప్రజలు ‘మనమిత్ర’ యాప్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ స్థానాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి వెంటనే సిబ్బందిని పంపి సమస్యలను పరిష్కరించారు.
తుపాను మార్గాన్ని ఖచ్చితంగా అంచనా వేసి: భారత వాతావరణశాఖ తుపాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని తెలిపినా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం రూపొందించిన నమూనా ప్రకారం తుపాను నరసాపురం వద్ద తీరం దాటుతుందని ఖచ్చితంగా అంచనా వేసిందని భాస్కర్ చెప్పారు. దీంతో రాష్ట్ర యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైందన్నారు.
నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ముందే గుర్తించి ఆ ప్రాంత అధికారులను, ప్రజలను స్మార్ట్ మెసేజ్‌ల ద్వారా హెచ్చరించామని తెలిపారు. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా 1.1 కోట్ల మంది ప్రజలకు తుపాను హెచ్చరిక సందేశాలు పంపించామని, గ్రామాల్లో మైకుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని ప్రకటించామని వివరించారు.
అన్ని శాఖలను ఒకే డ్యాష్‌బోర్డులో అనుసంధానం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలను, వనరులను ఒకే డ్యాష్‌బోర్డులో మ్యాప్ చేసినట్లు భాస్కర్ తెలిపారు. ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, యంత్రాలు, జేసీబీలు, క్రేన్లు మొదలైన వాటి స్థానాలను కూడా ఇందులో చూపించారు. దీంతో సహాయక చర్యలు తక్షణం చేపట్టడానికి సులభమైంది. మత్స్యకారులను ముందుగానే తీరప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అలాగే 1,742 గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించామని ఆయన వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ సమన్వయానికి కార్యదర్శి శివప్రసాద్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర పాల్గొన్నారు. అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా రాష్ట్రం విపత్తు నిర్వహణలో సాంకేతికతను వినియోగించిన తీరు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని అధికారులు అభిప్రాయపడ్డారు.
తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్ - గందరగోళానికి గురిచేసిన ‘మొంథా’
తుపాను తీరం తాకి మళ్లీ సముద్రంలోకి వెళ్తుందా? - అక్కడ గాలి-వాన ఎందుకు ఉండవు!

