ETV Bharat / state

రైలుకు రూ.30 - ఆటోకు రూ.50 - బెంబేలెత్తిపోతున్న ప్రయాణికులు

రైలు టిక్కెట్‌ కంటే ఆటో ఛార్జీలే అధికం - రైల్వేస్టేషన్లకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు - ఇదే అదునుగా భావించి ప్రయాణికుల వద్ద అందినకాడికి దోచుకుంటున్న ఆటో డ్రైవర్లు

రైలు ఛార్జీ కంటే ఆటోలకే ఎక్కువ చెల్లిస్తున్నామంటున్న ప్రజలు
రైలు ఛార్జీ కంటే ఆటోలకే ఎక్కువ చెల్లిస్తున్నామంటున్న ప్రజలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 4:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

Railway Passengers Problems in AP : రైలు టిక్కెట్‌ కంటే ఆటో ఛార్జీల ధరలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. రైలులో తక్కువ ఛార్జీలు ఉంటాయని పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. కానీ రైలు వద్దకు చేరుకోవాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లు ఊరికి దూరంగా ఉండటం, బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి ప్రయాణికుల వద్ద ఆటో డ్రైవర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. రాత్రివేళల్లో రవాణా ఛార్జీలు రెట్టింపులో ఉంటాయి.

అన్నమయ్య జిల్లాలో పలు రైల్వేస్టేషన్లు పట్టణాలకు దూరంగా ఉండటంతో రైలు ఛార్జీల కంటే రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణంగా తిరుపతి నుంచి సీటీఎం (మదనపల్లె రోడ్‌)కు రైలు ఛార్జీ రూ.30 మాత్రమే. అయితే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలంటే ఆటో ఛార్జీ రూ.50 వరకు తీసుకుంటున్నారు. రాత్రివేళల్లో రవాణా ఛార్జీలు రెట్టింపులో ఉంటాయి.

అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నుంచి రైలు మార్గం ప్రారంభమవుతుంది. తిరుపతి వైపు వెళ్లే రైళ్లన్నీ తుమ్మనగుంట (బి.కొత్తకోట) మీదుగా కురబలకోట, మదనపల్లె రోడ్డు, వాల్మీకిపురం, కలికిరి, పీలేరు, పులిచర్ల మీదుగా పాకాలకు వెళ్తాయి. ఈ మార్గంలో రోజుకు 10 నుంచి 12 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రైళ్లు తిరుపతి, మధురై, సికింద్రాబాద్, కాచిగూడ, కదిరిదేవరపల్లి వైపు నడుస్తున్నాయి.

రైలుకు రూ.30, ఆటోకు రూ.50

  1. సీటీఎం (మదనపల్లె రోడ్డు) రైల్వేస్టేషన్‌ నుంచి మదనపల్లెకు 10 కిలోమీటర్లు ఉంది. వాల్మీకిపురానికి 10 కిలోమీటర్లు, అంగళ్లు (కురబలకోట)కు దాదాపు 7 నుంచి 9 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కురబలకోట, వాల్మీకిపురంలో స్టాపింగ్‌ లేని కారణంగా మదనపల్లె రోడ్డులోనే దిగాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో ఈ స్టేషన్‌లో దిగే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.
  2. మదనపల్లె రోడ్‌ నుంచి రాత్రివేళలో 10.30 గంటలకు వారానికి నాలుగు రోజులు ముంబయి వైపు, తిరుపతి నుంచి పోయే ప్యాసింజర్‌ రైలు (కదిరిదేవరపల్లి) రాత్రి 1.40 గంటలకు, రోజూ హైదరాబాదు నుంచి తిరుపతికి వెళ్లే రైలు రాత్రి 3.05 గంటలకు మదనపల్లెకు వస్తుంటాయి. కాచిగూడ నుంచి (మధురై) తూత్తుకుడి వారానికి ఒకసారి (మంగళవారం) రాత్రి 1.05 గంటలకు, గురువారం రాత్రి ఈ మార్గంలో వెళ్తుంది.
  3. మదనపల్లెకు రైల్వేస్టేషన్‌ నుంచి ప్యాసింజర్‌ ఆటోల్లో ఒక్కొక్కరి నుంచి రూ.20 నుంచి రూ.50 రాత్రివేళల్లో రూ.80కు పైగా ఛార్జీ వసూలు చేస్తున్నారు. అదే విధంగా అంగళ్లుకు రూ.50 వసూలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి అదనంగా చెల్లించాలి.
  4. కురబలకోట రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్‌ రైలు దిగితే ఇదే పరిస్థితి మూడు కిలోమీటర్ల వరకు ఆటోలో ప్రయాణం చేయాల్సి వస్తోంది.
  5. కలికిరి క్రాస్‌కు కిలోమీటరు దూరంలో ఉండటంతో రాత్రివేళ ఆటోలో ఒక్కొక్కరికి రూ.60 చెల్లించాల్సి వస్తోంది. జేఎన్‌టీయూ, పత్తేగడ పాళ్యంలో ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌లు, ఉద్యోగులు, శిక్షణ పొందేవారు ఆరు కిలోమీటర్ల దూరానికి వెళ్లాల్సి వస్తోంది.
  6. పత్తేగడ గ్రామానికి వెళ్లాలంటే ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ.150 చెల్లించాల్సి వస్తోంది. రాత్రివేళల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. కలికిరి క్రాస్‌లో కనీసం బస్‌షెల్టర్‌ కూడా లేకపోవడం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
  7. పీలేరు రైల్వేస్టేషన్‌ పట్టణ సరిహద్దులో ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం బైపాస్‌ రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో బస్సులు అందుబాటులో ఉండటం లేదు. రాత్రివేళల్లో రైల్వే ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. పట్టణానికి వచ్చేందుకు ప్యాసింజర్‌ ఆటోలో రూ.30 నుంచి రూ.40 వరకు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే : పట్టణాలకు దూరంగా ఉన్న రైల్వేస్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రైలు వచ్చే సమయాల్లో సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. దీంతో అటు రైల్వేకు, ఇటు ఆర్టీసీకి ఆదాయం పెరిగి లాభాలు వచ్చే అకాశాలున్నాయి. ఈ దిశగా రెండు శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉంది.

  • అన్నమయ్య జిల్లాలో ప్రధాన రైలు నిలయాలు: ఏడు
  • రైలు మార్గం నిడివి : 110 కి.మీలు

రైళ్లలో లగేజీ ఎంత తీసుకెళ్తున్నారు? - "రైల్వే కొత్త రూల్" మీకు తెలుసా?

రైలు ప్రయాణంలో ఫోన్​లో టిక్కెట్ చూపిస్తున్నారా? - ఈ విషయాలు తెలియకుంటే కష్టమే!