ప్రయాణికులకు ముఖ్య గమనిక - సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ముందు ఇవి తెలుసుకోండి
సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీ నియంత్రణకు అధికారుల చర్యలు - అందుబాటులో ఉన్న 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) - టీటీఈలు, ఆర్‌పీఎఫ్ బృందాల నియామకం

Published : January 10, 2026 at 8:53 AM IST
Security Personnel Supervision in Railway Station : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. నగరంలో ఉండే వారు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వైభవంగా జరుపుకునే 3 రోజుల పండగ కోసం ఇప్పటి నుంచే పయనమవుతుండటంతో స్టేషన్లలో రద్దీ పెరిగిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సాఫీ ప్రయాణానికి చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రయాణికులు గందరగోళానికి తెరదించుతూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఏర్పాట్లు చేశారిలా :
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) అందుబాటులో ఉన్నాయి. టికెటింగ్ సేవల కోసం రైల్ వన్ మొబైల్ యాప్‌ను వినియోగించడంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
- ‘రైల్ వన్’ మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతులతో టికెట్ బుక్ చేసే అన్‌రిజర్వ్‌డ్ టికెట్లపై ఇటీవల 3 శాతం రాయితీ ప్రకటించారు. ఈ అవకాశం ఈ నెల 14 నుంచి జులై 14 వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
- పండగ నేపథ్యంలో స్టేషన్‌లో టీటీఈలు, ఆర్‌పీఎఫ్ బృందాలను నియమించారు. సీసీ టీవీ నిఘా, డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో వార్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
- స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా తాత్కాలికంగా పార్కింగ్ నిలిపివేశారు. ప్లాట్‌ఫాం-1 వద్ద పరిమిత పికప్, డ్రాప్ ఆఫ్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్లాట్‌ఫాం నం.10 వద్ద బేస్‌మెంట్ పార్కింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
- బోయిగూడ ప్రవేశమార్గం (ప్లాట్‌ఫాం- 10) వైపు యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థను తాత్కాలికంగా తొలగించి ప్రయాణికుల కదలికలను మరింత వేగవంతం చేశారు.
- జనవరి 20వ తేదీ వరకు హైటెక్ సిటీలో 16 రైళ్లకు, చర్లపల్లి స్టేషన్‌లో మరో 11 రైళ్లకు అదనపు స్టాపేజీలు కల్పించారు. లింగంపల్లిలో 10 రైళ్లకు ఏప్రిల్ 30వ తేదీ వరకు తాత్కాలిక స్టాపేజీ కల్పించారు.
- లింగంపల్లిలో ప్లాట్‌ఫామ్ నం.1 వద్ద బ్యాగేజ్ స్క్రీనింగ్ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
''సంక్రాంతి సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు దొంగలకు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా జరుగుతున్న చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు మరింత గస్తీ పెంచారు.'' - రెజిమెంటల్ బజార్ పోలీసులు
కష్టమైనా వెళ్లాల్సిందే - ఊరు చేరాల్సిందే : సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్లడానికి నగరవాసులు సిద్ధమయ్యారు. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వెళ్లే రైలులో ప్రయాణికులకు కూర్చునే స్థలం దొరకక అప్పర్ బెర్త్‌లపై, ఫుట్‌బోర్డు, టాయిలెట్ల వద్ద కూర్చుని వెళ్లారు. ఇప్పుడే ఇలా ఉంటే, మరో మూడు రోజులు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని ప్రయాణికులు వాపోతున్నారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు : సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉంటుంది. ఈ సందర్భంగా రైళ్లు, బస్సులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ మేరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కానీ అవి హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కొంతమంది రిజర్వేషన్ చేసుకోలేకపోయారు.
అలాంటి వారి కోసం ద.మ రైల్వే 11 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ నుంచి నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు వెళుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలకు వెళ్లే వాటికి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రయాణికుల అవసరాన్ని కొంతమంది ప్రైవేటు ట్రావెల్స్ వారు క్యాష్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి ఉన్న డిమాండ్ దృష్ట్యా టికెట్ ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
టికెట్ బుకింగ్ టైంలో ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయండి - పైసా ఖర్చులేకుండా పై తరగతిలో ప్రయాణించండి
జనవరి 1 నుంచి మారనున్న ట్రైన్ టైం టేబుల్- లిస్టులో వందే భారత్ సహా 25 రైళ్లు!

