రూ.300 దాటిన చికెన్ - కొత్త ఏడాదిలో తొలిసారి
మూడు నెలలుగా రూ.260 - గత రెండు వారాల వ్యవధిలోనే రూ.300 - ఏడాది కిందట బర్డ్‌ఫ్లూతో కొనుగోళ్లు తగ్గి ధరలు భారీగా పతనం - రూ.8.50కు చేరిన గుడ్డు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 7:11 PM IST
Chicken Rates Become 300 Per Kg: కోడి మాంసం ధర కొండెక్కింది. నూతన సంవత్సరం ఆరంభంలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టింది. మూడు నెలలుగా రూ.260 వద్ద కొనసాగుతున్న ధర రెండు వారాల వ్యవధిలోనే రూ.300కి చేరింది. ఇప్పటికే గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తుండగా పెరిగిన మాంసం ధరతో కళ్లు తిరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ మాంసం కేజీ రూ.300కు చేరింది. లైవ్ కోడి రూ.170కు పెరిగింది. ఫారం కోడి మాంసం కేజీ రూ.180, బండ కోడి మాంసం రూ.280గా ఉంది.
నాలుగైదు నెలలుగా తగ్గుతూ, పెరుగుతూ: అనకాపల్లి జిల్లాలో 450 వరకు పౌల్ట్రీలు ఉన్నాయి. వీటి ద్వారా 20 లక్షల వరకు కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచి స్థానిక మార్కెట్‌తో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నాలుగైదు నెలలుగా కోడి మాంసం ధర తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నా ఈ స్థాయిలో పెరగలేదు. ఏడాది కిందట బర్డ్‌ఫ్లూ కారణంగా ప్రతికూల పరిస్థితులతో కొనుగోళ్లు తగ్గి ధరలు భారీగా పడిపోయాయి. ప్రభుత్వ సహకారంతో పౌల్ట్రీ యాజమాన్యాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వచ్చాయి. తద్వారా మాంసం ధర గరిష్ఠంగా గతేడాది మొత్తం మీద రూ.285 దాటలేదు. డిసెంబరు 21న కేజీ మాంసం రూ.240 ఉండగా, తర్వాత వారం రోజులకే రూ.30 పెరిగింది.
గతేడాది చివరలో గరిష్ఠ ధర రూ.280గా ఉంది. తాజాగా రూ.300కి చేరింది. సంక్రాంతి సమీపిస్తుండటం, కోళ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ధరలు ధర పెరుగుదలకు కారణమని పాయకరావుపేటకు చెందిన వ్యాపారి సత్యనారాయణ చెప్పారు. రెండు వారాలకుపైగా కోడిగుడ్డు ధర రూ.8.50గా ఉంది. సంక్రాంతి పండగ వరకు ధర తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. ఇప్పటికే గుడ్డు ధర చూసి గుడ్డు తేలేస్తుండగా ప్రజలు దీన్ని తగ్గించాలని కోరుతున్నారు. గతేడాది బర్డ్‌ఫ్లూతో మొదలైన ప్రతికూలత చాలా రోజుల పాటు కొనసాగింది. మధ్యలో ధర పెరిగినా, రూ.300కి చేరలేదు. కోళ్లకు వ్యాధులు రావడంతో పౌల్ట్రీ యజమానులు పెంపకం తగ్గించేశారు. దీంతో ఒడిశా నుంచి ఇక్కడకు కోళ్లు వస్తున్నాయి. ఆదివారం 250 కేజీల వరకు విక్రయించే వారని, ప్రస్తుతం సగానికి పడిపోయిందని, ధర పెరగడంతో చాలామంది ప్రత్యామ్నాయంగా చేపలు కొనుగోలు చేస్తున్నారని నక్కపల్లికి చెందిన నానాజీలు అంటున్నారు.
ఇలా అయితే పౌల్ట్రి పరిశ్రమకు ఇబ్బందే: ప్రస్తుతం కోళ్ల దాణా ఉత్పత్తిలో మొక్కజొన్న, వరి, ఆవాలు, సోయాబీన్‌తో తయారయ్యే అధిక ప్రోటీన్ కలిగిన డీఆయిల్డ్ కేక్‌ను వాడుతున్నారు. దేశంలో మూడు కోట్ల టన్నుల మేర మొక్కజొన్న ఉత్పత్తి అవుతోంది. దాంట్లో అధిక భాగాన్ని ఇథనాల్ ఉత్పత్తికే తరలిస్తున్నారు. 2047 నాటికి ఇథనాల్ పరిశ్రమ నుంచి మొక్కజొన్నకు భారీగా డిమాండ్ పెరగనుంది. ఆ మేరకు ధరలు కూడా పెరగవచ్చు. మొక్కజొన్న ధరల్లో ఏమాత్రం పెరుగుదల కనిపించినా, అది కోడిమాంసం, కోడిగుడ్ల ధరలను అమాంతం పెంచేస్తోంది. ధరలు సామాన్యులు భరించలేని స్థాయికి పెరిగితే పౌల్ట్రీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవుతాయి.
దేశంలో దాణా ఉత్పత్తి నిర్వహణకు దీర్ఘకాలిక వ్యూహం అవసరం. దాణా కొరత, ధరల్లో పెరుగుదల కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా మొక్కజొన్న, సోయాబీన్, ఆవాల ఉత్పత్తిని పెంచడమే ఈ సమస్యకు పరిష్కారం. సాగుభూమిని పెంచలేం కాబట్టి, అధిక దిగుబడులను సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలి.
ధరల నియంత్రణకు మార్గం: దాణా సమస్యను సమర్థంగా ఎదుర్కోవాలంటే, వ్యవసాయంలో కొత్తరీతుల్ని అందిపుచ్చుకోవాల్సిందే. ప్రధానంగా అధిక దిగుబడులను ఇచ్చే మొక్కజొన్న, సోయాబీన్ వంగడాలను రూపొందించే బ్రీడింగ్, బయోటెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా జన్యుమార్పిడి రకాలు అధిక దిగుబడులు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. భూసారాన్నీ, ఉత్పాదకతనూ పెంపొందించడమే కాకుండా సమర్థ సాగునీటి నిర్వహణ, కర్బన ఉద్గారాల కట్టడి వంటి చర్యల ద్వారా ఉత్పాదకతను పెంచుకోవాలి. పౌల్ట్రీ పరిశ్రమకు నిరంతరంగా ముడి పదార్థాలను సరఫరాచేసే వ్యవస్థ అవసరం. మెరుగైన మౌలిక సదుపాయాలు, శీతల గిడ్డంగులనూ సమకూర్చుకోవాలి. ఇవన్నీ ధరల నియంత్రణకు దోహదపడతాయి. ఆల్గే, వ్యవసాయ ఉప ఉత్పత్తులు వంటి ప్రత్యామ్నాయ దాణా ముడిసరకులు సంప్రదాయంగా ఉపయోగించే ధాన్యాల అవసరాన్ని చాలావరకు తగ్గిస్తాయి. విభిన్నమైన దాణా ముడిసరకుల వాడకం వల్ల మొక్కజొన్న, సోయాబీన్‌లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
ఎమర్జెన్సీ నా జీవితాన్ని మార్చింది - 18 నెలలు జైల్లో పెట్టారు : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
మారేడుమిల్లిలోని కాఫీ తోటలు - రెట్టింపు దిగుబడులు- మంచి ఆదాయం

