భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి: వ్యోమగామి శుభాంశు శుక్లా
చంద్రుడిపైకి భారతీయుడిని పంపడానికి సన్నద్ధమవుతోన్న భారత అంతరిక్ష రంగం - ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శుభాంషు శుక్లా

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 23, 2026 at 11:20 AM IST
IIT Tirupati convocation : '2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపడానికి, 2030 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడానికి భారత అంతరిక్ష రంగం సన్నద్ధమవుతోంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో రేపటి తరం ఇంజనీర్ల పాత్ర కీలకమైనది. భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, విద్యార్థులు తమ సౌకర్యవంతమైన పరిధిని దాటి కష్టపడి పనిచేయాలి.' అని గగన్‌యాన్ వ్యోమగామి, భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా కోరారు. శనివారం ఏర్పేడులోని ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో జరిగిన 8వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
మనం చేసే శ్రమే : అంతిమ విజయం కంటే ఆ విజయం కోసం చేసే ప్రయాణమే ముఖ్యమని శుభాంషు శుక్లా తెలిపారు. తన జీవిత అనుభవాల నుంచి కీలక సూత్రాలను వివరించారు. ‘ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లే (లాంచ్) రోజే ప్రపంచానికి గుర్తుంటుంది. కానీ దానివెనుక ఎన్నో ఏళ్ల నిస్సారమైన, ఇబ్బందికరమైన రోజులు ఉంటాయి. ఎవరూ చూడనప్పుడు ఆ రోజుల్లో మనం చేసే శ్రమే మనల్ని అసలైన విజయానికి చేరువ చేస్తుంది. క్రమశిక్షణ అంటే అన్నీ వదులుకోవడం కాదు, గమ్యానికి అక్కరలేని విషయాలను పక్కన పెట్టడం’ అని ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
వ్యక్తిత్వం, నైతికతే ముఖ్యం : ఈ సందర్భంగా సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ వర్చువల్‌గా ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో యువ సాంకేతిక నిపుణులదే ప్రధాన పాత్రన్నారు. ఇప్పుడు పాత పరిశ్రమలు అంటూ ఏవీలేవని, సంప్రదాయ స్టీల్ తయారీ రంగం కూడా ఏఐ, అడ్వాన్స్‌డ్ ఎనలిటిక్స్, రోబోటిక్స్‌తో రూపాంతరం చెందుతోందని చెప్పారు. కేవలం ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేయడమే కాకుండా, కొత్త డిజైన్లు, ఆవిష్కరణలు మనమే చేయాలన్నారు. విద్యార్థులకు నైపుణ్యాలు ఎంత ఉన్నా వారి వ్యక్తిత్వం, నైతికతే సమాజంలో వారిని ఉన్నతంగా నిలబెడతాయని స్పష్టం చేశారు.
నాలుగు కొత్త విభాగాలు : ఐఐటీ డైరెక్టర్ ఆచార్య కె.ఎన్.సత్యనారాయణ సంస్థ ప్రగతి నివేదికను సమర్పించారు. గతేడాది 60 స్పాన్సర్డ్ రీసెర్చ్ ప్రాజెక్టుల ద్వారా రూ.38 కోట్లు, 99 ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీల ద్వారా రూ.7.5 కోట్ల నిధులు సాధించినట్లు తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, అప్లైడ్ ఏఐ అనే నాలుగు కొత్త విభాగాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కియా ఇండియా సంస్థ రూ.35 కోట్లతో ఐదేళ్లపాటు సహకారం అందిస్తోందన్నారు. 2025-26లో 195 కంపెనీలు రాగా 81 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారు. స్నాతకోత్సవంలో 457 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
భార్య కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌కు భర్త - విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజం
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు అప్డేట్స్ - పోలీసుల అదుపులో నిందితుడు సాధిక్‌ఖాన్

