నగరాలు, పట్టణాల్లో ఖాళీ భూముల పన్ను తగ్గింపు - చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
భవన నిర్మాణంలో 50శాతం మాత్రమే ఖాళీ స్థలం పన్ను చట్ట సవరణ బిల్లుకు ఆమోదం - సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ - నగరాలు, పట్టణాల్లో మరింత వేగంగా అభివృద్ధి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 2:44 PM IST
Vaccant Land Tax Bill in Assembly : నగరాలు, పట్టణాల్లో ఖాళీ భూముల పన్ను తగ్గిస్తూ పురపాలక చట్టంలో సవరణలు చేసే బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. సవరణ బిల్లును మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నారెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు భవన నిర్మాణ సమయంలో 50 శాతం మాత్రమే ఖాళీ స్థలం పన్ను చెల్లించేలా చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేలా చట్టంలో సవరణలు చేశామన్నారు. దీని ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసే వరకూ కేవలం 50 శాతం పన్ను చెల్లించేలా మార్పులు చేశామని వివరించారు.
ఈ సవరణ బిల్లుని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వాగతించారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు వల్ల నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. అనంతరం సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది.
4 సార్లు ఓటు హక్కు నమోదుకు అవకాశం : అదేవిధంగా గ్రామాల్లో యువతకు ఓటు హక్కు నమోదు అవకాశం నాలుగు సార్లకు పెంచుతూ పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేకపోవడంతో ఆయన బదులు మంత్రి దుర్గేష్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు గతంలో జనవరి 1న ప్రాతిపదికగా ఓటు నమోదుకు అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వ చట్టం మేరకు ఇకపై ఏడాదికి నాలుగు సార్లు నమోదుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
పంచాయతీరాజ్ చట్టంలో సవరణ : ఈ మేరకు జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీలకు 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్‌గా నమోదుకు అవకాశం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తూ బిల్లు రూపొందించారు. మంత్రి దుర్గేష్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లు స్వాగతిస్తూ ఎమ్మెల్యేలు లోకం మాధవి, నడికుడితి ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. అనంతరం పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు : 22A విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం రామన్నపాలెం భూ వివాదంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానం ఇచ్చారు. 22ఏకు సంబందించి జీవోను అమలు చేయడం ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గిట్టని వారి భూములను 22Aలో పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. 22ఏ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి మంత్రి దీనిపై దృష్టి సారించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రికి సూచించారు.
అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
11వ తేదీ 11 మంది 11 నిమిషాలు - అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సభ్యులు

