ఒంటరి మహిళపై ఏఎస్‌వో లైంగిక వేధింపులు - 14 రోజుల రిమాండ్
అసెంబ్లీలో ఏఎస్‌వోగా పని చేస్తున్న నిందితుడు - ఒంటరి మహిళ, ఆమె కుమార్తెకు వేధింపులు - బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 1:06 PM IST
ASO Arrested in Sexual Harassment Case: ఉన్నతస్థాయి ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి తన వక్రబుద్దిని పోనిచ్చుకోలేదు. అసెంబ్లీలో ఏఎస్‌వోగా పని చేస్తూ నగర శివారు ప్రాంతంలో ఒంటరిగా ఉన్న మహిళ, ఆమె మైనర్ కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించాడు. చివరకు ఏం చేయాలో దిక్కు తోచని ఆగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్న ఆమె, తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ను విధించింది.
ఒంటరి మహిళపై లైెంగిక వేధింపులు: మునిరాజా గ్రూప్ 2 ఉద్యోగిగా రాష్ట్ర అసెంబ్లీలో ఏఎస్‌వోగా పని చేస్తున్నాడు. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న ఒంటరి మహిళపైన, మైనర్ బాలికైన ఆమె కుమార్తె పైనా లైంగిక వేధింపులకు తెగబడుతున్నారు. ఆమె నుంచి నుంచి పలు విడతల్లో నగదును తీసుకుని తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారు. కులం పేరుతో, సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య దూషణలకు పాల్పడుతున్నారు. ఆ మహిళకు సంబంధించిన నగ్న చిత్రాల్ని, దృశ్యాలను పలువురికి పంపిస్తూ ఆమెను నిత్యం ఆందోళనకు గురిచేస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ వేధింపులపై బాధితురాలు గతంలో ఒకసారి పోలీసులను ఆశ్రయించింది. దాంతో మునిరాజాపై కేసు నమోదైంది.
కానీ అయినా సరే అతని ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. అంతేకాకుండా వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. అయితే దీన్ని భరించలేక బాధిత మహిళ తాజాగా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మునిరాజాపై కేసు నమోదు చేసి విజయవాడ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వాదోపవాదాలు ముగిసిన అనంతరం నిందితుడు మునిరాజాకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మునిరాజాకు గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు తెలిసింది. అతనిపై చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీసు స్టేషన్లో గతంలో సైతం నాలుగు కేసులు, విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఒక కేసు ఉంది.
ఖాకీ ముసుగులో ఎన్నో ఘోరాలు: గతంలో తూనికలు కొలతల శాఖలో ఇన్స్పెక్టర్గా డిప్యూటేషన్ పై పనిచేసిన మునిరాజా ఆ సమయంలోనే బాధిత మహిళను పరిచయం చేసుకుని ఇక ఆ తర్వాత ఆమె పై నిత్యం వేధింపులకు తెగబడ్డాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వివరాలన్నింటినీ రిమాండ్ రిపోర్టులో అధికారులు ప్రస్తావించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు చెప్పుకుని ఇతని బెదిరింపులకు పాల్పడుతున్నాడనే తీవ్ర ఆరోపణలున్నాయి.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు: ఖాకీ యూనిఫాం ముసుగులో ఎన్నో ఘోరాలు, దందాలకు పాల్పడాడు మునిరాజా. తనను లైంగికంగా వేధించారని బాధిత మహిళ ప్రధానంగా ఫిర్యాదులో ప్రస్తావించారు. మునిరాజా పై బీఎన్ఎస్ లోని సెక్షన్ 78 (మహిళలను వేధించడం), 79 (స్త్రీల గౌరవానికి భంగం కలిగించడం), 351 (నేరపూరిత బెదిరింపులు), ఎస్సీ,ఎస్టీ చట్టంలోని 3 (1), (ఆర్), (ఎస్)తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 12 (చిన్నారులపై లైంగిక వేధింపులు) కింద కేసు నమోదైంది.
2018వ సంవత్సరంలో గ్రూప్ 2 కు ఎంపికైన బి.కె మునిరాజా అసెంబ్లీ కార్యాలయంలో ఏఎస్‌వోగా విధుల్లో చేరాడు. తర్వాత రెండేళ్ల పాటు తూనికలు, కొలతల శాఖలో ఇన్స్పెక్టర్గా విజయవాడ-1 కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలోనే 2023, జూన్ 11వ తేదీన విధుల్లో భాగంగా నున్న స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి బదిలీపై వెళ్లాడు. అక్కడ ఆర్ఎంపీగా ఉన్న బాధిత మహిళ క్లినిక్ కు వెళ్లి గుండె సమస్యకు సంబంధించి ఆమెకు చెప్పి పరీక్షించమని కోరాడు. అలా పరిచయమై తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. ఆమెకు భర్త 2022లో అనారోగ్య కారణాలతో చనిపోయాడు.
నమ్మించి మోసం: అయితే తన కూమార్తె లాంటి దానివని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆపై ఆమెకు కారణ్య నియామకంలో భాగంగా ఉద్యోగం వచ్చిందని వంచించాడు. హృద్రోగ సమస్యతో నిందితుడు ఆసుపత్రిలో చేరానని, వైద్యం, ఇతర ఖర్చులకు గాను విడతల వారీగా దాదాపు రూ.27 లక్షల వరకు బాధిత మహిళ వద్ద నుంచి తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత కాలంలో తీసుకున్న డబ్బులను సైతం ఇవ్వకపోగా ఆమెకూ లైెంగిక వేధింపులనేవి ఎక్కువయ్యాయి. ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని, అంగీకరించాలని వెంటపడి మరీ ఎక్కువగా వేధించడం ప్రారంభించాడు.
దీనికితోడు అసభ్యంగా ప్రవర్తిస్తూ, తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. పలుమార్లు ఆమె పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేది. కానీ తీరా పోలీసులు ఇంటికి వచ్చే సరికి మునిరాజా అక్కడి నుంచి మెల్లగా జారుకునేవాడు. బాధిత మహిళ పనిచేస్తున్న కార్యాలయానికి కూడా వెళ్లి ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలు, ఫొటోలను ఆమె సహోద్యోగులకు పంపించి మానసిక క్షోభకు గురిచేశాడు. తన కోరిక తీర్చకపోతే కుటుంబాన్ని హతమారుస్తానని ఎన్నో బెదిరింపులకు పాల్పడేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
వేధింపులను భరించలేకే ఫిర్యాదు: ఆమె పిల్లలను సైతం చంపేస్తానని హెచ్చరించేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులకు తాళలేకే చివరకు బాధితురాలు నున్న విజయవాడలోని నున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆమె జోలికి వెళ్లనని పోలీసుల సమక్షంలో నిందితుడు చెప్పడంతో ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకుంది. కానీ ఆ తర్వాతే ఆమెకు ఇవ్వాల్సిన మొత్తంలో రూ.6.47 లక్షలు చెల్లించాడు. కానీ మిగిలింది మాత్రం విడతలవారీగా చెల్లిస్తానని వివరించాడు.
అనంతరం మళ్లీ కొన్ని రోజులకే వేధింపులు తారాస్థాయికి పెరగడంతో బాధిత మహిళ గత ఏడాది నవంబరు, 9వ తేదీన నున్న స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తనపై కేసు పెట్టిందనే ప్రతీకారంతో మునిరాజా బాధితురాలి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశాడు.
మునిరాజా సహచరులైన రవిపాల్, హరిబాబు, జబేదాల సహకారంతో బాధిత మహిళ ఇంటిని అక్రమంగా అమ్మేందుకు పథకం పన్నాడు. అంతేకాకుండా బాధితురాలు ఇంట్లో లేని సమయంలో మునిరాజా లోపలికి ప్రవేశించి తన 15 ఏళ్ల వయసున్న కుమార్తెపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధిత మహిళ పేర్కొంది.
లేడీ కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులు!- రెండేళ్లల్లో 3అబార్షన్లు- పరారీలో నిందితుడు

