హిట్ అండ్ రన్ కేసు - ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి కుమారుడు సందీప్ అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసులో సందీప్‌ను అరెస్టు చేసిన పోలీసులు - తెల్లవారుజామున నడిచి వెళ్తుండగా ప్రమాదంలో నందకిశోర్ అనే వ్యక్తి మృతి - కిచెన్ హెల్పర్‌గా పని చేస్తున్న మృతుడు

Published : September 2, 2026 at 12:35 PM IST
Anand Sai Son Sandeep Arrested in Hyderabad : హైదరాబాద్‌లోని ఖాజాగూడలో కార్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో ప్రమాదానికి కారణమైన నిందితుడిని రాయదుర్గం పోలీసులు గుర్తించారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్టు చేశారు. మృతి చెందిన వ్యక్తిని సైతం గుర్తించారు. రాయదుర్గం సీఐ భూపతి తెలిపిన కథనం ప్రకారం,
మృతుడు బిహార్‌కు చెందిన నందకిశోర్(31) అని గుర్తించారు. నందకిశోర్ రాయదుర్గంలోని ఓ హోటల్‌లో కిచెన్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తన స్నేహితుడిని కలిసి, తెల్లవారుజామున రోడ్డుపై నడిచి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో జైద్ షా అనే ఓ డ్రైవర్, మరో వ్యక్తి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రెండు కార్లు వేగంగా వచ్చి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాయి. దీంతో నందకిశోర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
సీసీ కెమెరాలు జల్లెడ పట్టి : స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఖాజాగూడ నుంచి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఉన్న పలు సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. సందీప్ నడుపుతున్న కారు ఢీ కొనడంతోనే నందకిశోర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు. మరో కారు నడిపిన శౌర్య అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ స్నేహితులు కావడం గమనార్హం.
వెంటాడిన మృత్యువు : నందకిశోర్‌ను మృత్యువు వెంటాడింది. ఒక ప్రమాదంలో గాయాలతో బయటపడగా, అంతలోనే మరో రెండు కార్లు వరుసగా ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఖాజాగూడ తౌటోనికుంట వద్ద సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నందకిశోర్ (31) రోడ్డు దాటుతున్నాడు. నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ వైపు నుంచి ఖాజాగూడ వైపు వెళ్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే ఇన్నోవా డ్రైవర్ జైద్ షా కద్రి (21), అటుగా వెళ్తున్న మరో క్యాబ్ డ్రైవర్ కలిసి నందకిశోర్‌ను పైకి లేపి ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నడిచే స్థితిలో ఉన్న అతడిని పట్టుకుని రోడ్డు దాటించేందుకు వెళుతున్న సమయంలో ఖాజాగూడ వైపు నుంచి నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ వైపు వేగంగా వెళ్తున్న రెండు కార్లు వారిని ఒకదాని తర్వాత మరోటి బలంగా ఢీ కొట్టాయి. ఈ ఘటనలో క్షతగాత్రుడు (నందకిశోర్) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన రెండు కార్లు ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్‌లో బాలయ్య ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టి

