వైభవానికి వేదికగా విజయవాడ - 3 రోజుల పాటు ఘనంగా 'ఆవకాయ ఉత్సవాలు'
విజయవాడలో అమరావతి-ఆవకాయ ఉత్సవాలకు ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు - 3 రోజుల పాటు పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్‌లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహణ -

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 9:34 PM IST
Amaravati-Avakaya festivals in Vijayawada: సంస్కృతి, సాహిత్యం, సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా విజయవాడ నగరం సిద్ధమైంది. అమరావతి-ఆవకాయ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్‌లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తుత తరానికి తెలియజెప్పటంతో పాటు మన భాషలోని గొప్పదనాన్ని తెలియజేయనున్నారు.
విజయవాడ సాంస్కృతిక వైభవానికి వేదికగా మారుతోంది. అమరావతి-ఆవకాయ పేరుతో నిర్వహించనున్న ఈ వేడుక తెలుగు వారి కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించారు. కృష్ణా నది తీరంలో 8 నుంచి 10వ తేది వరకు 3 రోజుల పాటు అద్భుతమైన సాంస్కృతిక వేదికగా ఈ ప్రాంతం మారబోతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న ఈ ఉత్సావాల్లో అనేక రకాల కళాకారులు పాల్గొననున్నారు. తెలుగు వారికి ప్రీతికరమైన, ఆత్మగౌరవానికి ప్రతీకైన ఆవకాయ పేరుతో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతి వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ఉత్సవ రూపకల్పన జరిగింది. తెలుగు సినిమా, సాహిత్యం, జానపద కళలు, రుచులను ప్రపంచానికి ఈ వేడుకల్లో పరిచయం చేస్తారు.
ఇవాళ ఉత్సవ ప్రారంభ వేడుక రాత్రి 8 గంటలకి జరగనుంది. ఇందుకోసం పున్నమి ఘాట్ వద్ద అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు అధికారులు చెప్పారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు, అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకోనుంది. వేడుకలో భాగంగా కృష్ణా నదిలో లేజర్ షోలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
మన సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా: అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ ఫెస్టివల్‌కు రూపకల్పన చేశారు. నవలల నుంచి వెండితెర వరకు తెలుగు రచనలపై అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతోపాటు బుర్ర కథలు, కూచిపూడి నాట్యంపైనా చర్చలు ఉంటాయని నిర్వాహకులు చెప్పారు. కవులు, రచయితలు, సినీ నిర్మాతలు, సంగీతకారులు, కళాకారులతో ఇంటరాక్ట్ సెషన్లు ఉండనున్నాయి. వీటితో పాటు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ 3 రోజుల ఉత్సవాల్లో సందర్శకుల కోసం అనేక ఆసక్తికరమైన అంశాలు సిద్ధం చేశారు. భవానీ ద్వీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో రాష్ట్ర విశిష్టత, హస్త కళలు, నోరూరించే పిండివంటలు అందుబాటులో ఉండనున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇంటిళ్లిపాదికి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా, నేటి తరం యువతకు మన సంస్కృతి గొప్పతనాన్ని వివరించేలా ఈ వేడుకలను తీర్చిదిద్దారు.
అమరావతి రాజధానికి ముఖ ద్వారంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు సర్వీస్ సెక్టార్ నుంచి అధిక ఆదాయం వస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు పర్యాటకానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే విజయవాడ ఉత్సవాలతో ఒక మార్గాన్ని వేశారు. ఈ ఆవకాయ వేడుకల్లో మన ఖ్యాతిని తెలుపటంతోపాటు పర్యాటక ప్రదేశాలను చూపించనున్నారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదని, సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రాత్మక ఘట్టమని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ వేడుకను విజయవంతం చేస్తామన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు: ఈ కార్యక్రమానికి భారీగా ప్రముఖులు హాజరు కానున్న తరుణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నారు. వీఐపీ పార్కింగ్ సహా సామాన్యుల భద్రతపైనా దృష్టి సారించారు. ఎంత మంది వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా సైన్ బోర్డులు పెట్టారు. పున్నమి ఘాట్, లోటస్, బబ్బూరి గ్రౌండ్స్, ఆర్టీసీ వర్క్ షాపులో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం తెలిపారు.
'ఈసారి సంక్రాంతి అదిరిపోద్ది' - కారవాన్ టూరిజం స్ఫెషల్ ప్యాకేజీలు!

