అథ్లెట్ జ్యోతి యర్రాజీకి మహారాష్ట్రలో ఘన సన్మానం - హాజరైన ఎంపీ అప్పలనాయుడు
ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఘన సన్మానం - ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు - ప్రస్తుతం శిక్షణ కోసం ముంబయికి వెళ్లిన జ్యోతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 10:43 PM IST
Athlete Jyothi Receives Grand Honour in Mumbai : అర్జున అవార్డు గ్రహీత రాష్ట్రానికి చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీకి మహారాష్ట్రలో ఘన సన్మానం జరిగింది. తానే వెస్ట్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం శిక్షణ కోసం ముంబయికి వెళ్లిన జ్యోతి యర్రాజీకి సన్మానం చేశారు.
" తెలుగు బిడ్డ జ్యోతి యర్రాజీ 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించినదానికి అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించేందుకు జ్యోతి సిద్ధమౌతోంది. ఈ క్రమంలోనే ఆమె కోసం అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో అద్భుతమైన సత్కార కార్యక్రమం జరిగింది. ఒక తెలుగమ్మాయి ముంబయిలో గౌరవం పొందటం చాల శుభపరిణామం. త్వరలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను అథ్లెట్ జ్యోతి యర్రాజీ కలుస్తుంది." - కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ
" 2025లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాను. దీంతో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఘన సన్మానం చేశారు. నా కష్టాన్ని గుర్తించి గౌరవించినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం కోసం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏపీ నుంచి మహారాష్ట్ర వచ్చారు. నన్ను సత్కారించినందుకు కృతజ్ఞతలు." - జ్యోతి యర్రాజీ, అర్జున అవార్డు గ్రహీత
అంతర్జాతీయ స్థాయిలో రాణింపు : విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించింది. ఇప్పటికే భారత్‌లో వేగంగా పరిగెత్తే మహిళా హర్డ్‌లర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రేక్షకులు లేకున్నా అద్భుత ప్రదర్శన : ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ 12.96 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సాధించింది. 13 సెకన్లలోపు దీన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. స్టేడియంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.
దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇన్ని రికార్డులు, పతకాలు సాధిస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించట్లేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు(శనివారం) ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.
తెలుగు తేజం అరుదైన ఘనత - తన రికార్డును తానే బ్రేక్ చేసిన జ్యోతి
భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు.. సత్తా చాటిన ఆంధ్రా పరుగుల రాణి జ్యోతి!

