పోలవరం-నల్లమల సాగర్‌పై సుప్రీంకోర్టులో వాదనలు - విచారణ 12కి వాయిదా
సివిల్ సూట్‌లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? అని ప్రశ్నించిన సీజేఐ - మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరిన తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 5:07 PM IST
Arguments Were Heard in Supreme Court on Nallamala Sagar Petition : పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలకు పాల్పడటానికి సిద్ధమైందనేది ఆరోపణ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. తెలంగాణ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. కమిటీ ఏర్పాటు చేశారని మీరే చెబుతున్నారని, అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని కోరింది. ఈ క్రమంలోనే సివిల్ సూట్‌లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? అని సీజేఐ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమకు మధ్యంతర ఉపశమనం కల్పించాలని సింఘ్వీ కోరారు.
మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదన్న సీజేఐ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద జలాలే వాడుకుంటామని చెబుతోందని సింఘ్వీ అన్నారు. కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యపడదని, ఇందుకు సంబంధించి అనేక విషయాలు ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, అక్కడ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. పిటిషన్ దాఖలు తర్వాత కేంద్రం కమిటీని నియమించిందని సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ కేవలం ప్రాజెక్టు నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని సీజేఐ అన్నారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి న్యాయ పరిధి ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని సీజేఐ సూచించారు.
సీమలో కరవు ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికే ప్రాజెక్టు ప్రతిపాదన : సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఆంధ్రప్రదేశ్ తరఫున వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ముకుల్ మాట్లాడుతూ భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. నా ఇల్లు - నేను కట్టుకోవాలనుకుంటే మీకు అభ్యంతరం ఏంటి అని అడిగారు. నా భూభాగంలో చేపట్టే ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుంటే అభ్యంతరం ఎందుకో? సీమలో కరవు ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికే ప్రాజెక్టు ప్రతిపాదన. ఎక్కడా ఏ ఉత్తర్వులు, తీర్పులు ఉల్లంఘనలు ఈ ప్రాజెక్టులో లేవు అని రోహత్గి వాదించారు. పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా సీజేఐ సూచించారు.
తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా : అయితే, ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగదని ముకుల్ రోహత్గి వాదించారు. తెలంగాణ మాత్రం గోదావరిపై వందల ప్రాజెక్టుల నిర్మిస్తోందని ఏపీ తరఫున మరొక న్యాయవాది జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. అందరి అభిప్రాయాలతోనే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీజేఐ వెల్లడించారు.
బనకచర్లకు బదులు 'పోలవరం-నల్లమలసాగర్' ప్రాజెక్టు - రూ.58 వేల కోట్లతో నిర్మాణం!
నల్లమలసాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనే ప్రణాళిక : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి కొత్త ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం తుది రూపు ఇస్తోందని ఇంతకుముందే వెల్లడించింది. ఇందులో భాగంగా తొలుత బొల్లాపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమలసాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనే ప్రణాళికను చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే సోమశిలకూ ఈ జలాలు మళ్లిస్తారని సంబంధిత అధికారులు గతంలోనే తెలిపారు.
తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తుది అంచనాకు వచ్చింది. అందుకే గత ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం పేరుతోనే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవనున్నారు.
పోలవరం నిర్మాణానికి రూ.62,436 కోట్లు! - తాజాగా అంచనాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం

