సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - సర్వీసులపై ఆర్టీసీ కసరత్తు
ప్రయాణికుల దృష్ట్యా మరో 150పైగా పెరిగే అవకాశం - హైదరాబాద్‌కు అరకొర సర్వీసులే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 10:12 AM IST
APSRTC Special Bus Services For Sankranti Festival: సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి పల్లెల పచ్చందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, పిండివంటలు, పందేలు. పండగ అంటేనే పల్లెటూళ్లు, పచ్చని పొలాలు, గలగల పారే సెలయేళ్లు, బంధుమిత్రులందరి ఆత్మీయ కలయికలు. ఒకటేమిటీ గత స్మృతులన్నీ నెమరువేసుకోవడం పండగ ప్రత్యేకత. ఆ అనుభూతులను ఆస్వాదించేందుకు ఎన్ని కష్ట, నష్టాలకు ఓర్చుకోనైనా పండగలకు సొంతూళ్లకు వెళ్లడం పరిపాటి.
కొందరూ ఉద్యోగం రీత్యా, మరికొందరూ ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన వారంతా పండగ వచ్చిందంటే కుటుంబసమేతంగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతికీ అదే జరుగుతుంది. ఇంతవరకు బానే ఉన్నా సంక్రాంతి పండగకి ఊరికి పయనం అవ్వాలి అంటేనే జంకాల్సిన పరిస్థితి తలెత్తింది. కారణం రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ. రైళ్లలో చాంతాడంతా వెయిటింగ్ లిస్ట్ పేరుకుపోయింది. బస్సుల్లో సీట్లు నిండుకున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు కొండెక్కాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లేదెలా? అంటే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
ప్రత్యేక బస్సు సర్వీసులు: సంక్రాంతి నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 596 ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. విజయవాడ, మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే బస్సుల పై ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. జనవరి 8 నుంచి 14 వరకు సర్వీసులు తిప్పనున్నారు. తిరుగు ప్రయాణానికి 17 నుంచి 19 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతారు.
సర్వీసులు అంతంత మాత్రమే: హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది సంక్రాంతికి సొంతూళ్లు వస్తున్నారు. బస్సు సర్వీసులు మాత్రం ఆశించిన స్థాయిలో అందుబాటులో లేవు. విజయవాడ-హైదరాబాద్, మచిలీపట్నం-హైదరాబాద్ మధ్య 29 ప్రత్యేక బస్సులు సైతం కేటాయించారు. గత ఏడాదిలో అయితే మచిలీపట్నం నుంచే 70 ప్రత్యేక బస్సులు నడిచాయి. విజయవాడ నుంచి 100 పైగా తిరిగాయి.
కనీసం 30 బస్సులైనా: ఈసారి స్త్రీశక్తి పథకానికిి బస్సుల కేటాయింపుతో ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. పరిస్థితిని బట్టి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయినా ఎలాంటి ఇబ్బందులైనా తప్పవనిపిస్తోంది. విశాఖ నుంచి కూడా ప్రస్తుతానికి 10 సర్వీసులే ఖరారు అయ్యాయి. కనీసం 30 బస్సులైనా నడపాల్సి ఉంది.
ప్రైవేటు ట్రావెల్స్‌కే పండగ: అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులే పండగ చేసుకుంటారు. 2 నెలల ముందే ప్రైవేటు వారు ఆర్టీసీ రేటుకు రెండు మూడు రెట్లు అధికంగా పెట్టి వారి దందా మొదలుపెట్టారు. సర్వీసులు పెంచకుంటే రేట్లు మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. చెన్నై, బెంగళూరు సర్వీసులపైనా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
డిమాండ్ బట్టి సర్వీసులు: విజయవాడ నుంచి 200 బస్సులు ఉంచుతామని పీఎన్‌బీఎస్ డిప్యూటీ సీటీఎం సూర్యపవన్‌కుమార్ తెలిపారు. డిమాండ్‌ను బట్టి సర్వీసులు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు.
సంక్రాంతి సందడితో ప్రయాణికుల రద్దీ : ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండగకు సొంతూళ్లు వెళ్లేందుకు హైదరాబాద్ జంటనగరాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు తమ ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఏపీ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు ఒక్కసారిగా ఫుల్ డిమాండ్ పెరిగింది. ముందస్తు రిజర్వేషన్‌కు విండో తెరుచుకోవడంతోనే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే అదునుగా భావించి బస్సు టికెట్ల రేట్లు పెంటి సామాన్యులను దోచుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ రెండు నెలల ముందటే సిద్ధమైమయ్యాయి.
ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - 'సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు'
'ఈసారి సంక్రాంతి అదిరిపోద్ది' - కారవాన్ టూరిజం స్ఫెషల్ ప్యాకేజీలు!

