ETV Bharat / state

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం - దాదాపు 2 లక్షల మందికి మేలు

ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ నాలుగు రకాల పాస్‌లు జారీ - పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ సర్వీసుల్లో ఇకపై ఫ్రీ

Free Bus for Physically Challenged People
Free Bus for Physically Challenged People (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 6, 2025 at 10:17 AM IST

2 Min Read
Choose ETV Bharat

Free Bus for Physically Challenged People: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినందున రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికి మేలు చేకూరనుంది. ఇప్పటివరకు వీరందరికీ టిక్కెట్‌ ఛార్జీలో 50 శాతం రాయితీ అందిస్తున్నారు. త్వరలో వీరికి పూర్తిగా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కలగనుంది. ఈ హామీ అమలు చేసేందుకు దివ్యాంగుల పాస్‌లు పొందినవారు ఎందరు? రాయితీ రూపంలో ఆర్టీసీకి ఎంత మొత్తం చెల్లించాలి? తదితర వివరాలు తెలియజేయాలంటూ ప్రభుత్వం సూచించడంతో ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు.

నాలుగు రకాల పాస్​లు జారీ: ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ నాలుగు రకాల పాస్‌లు జారీ చేస్తోంది. 40% శారీరక వైకల్యం, 100% వినిపించకపోవడం, 100% అంధత్వం, 69% కంటే తక్కువ ఐక్యూతో మానసిక వైకల్యం ఉంటే వారికి ఈ ఆర్టీసీ పాస్‌లు ఇస్తోంది. దివ్యాంగులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్‌ బస్సు సర్వీసుల్లో 50 శాతం ఛార్జీ వసూలు చేస్తున్నారు. అయితే మిగిలిన సగాన్ని రాయితీగా ఇస్తోంది. విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఛార్జీలు ఏమీ లేకుండా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది.

దివ్యాంగులైన మగవారికి: మొత్తంగా 2 లక్షల దివ్యాంగులకు పాస్‌ల అందిస్తోంది. రాయితీ రూపంలో ఆర్టీసీ ప్రతీ సంవత్సరం రూ.188 కోట్ల మేరకు భారం భరిస్తోంది. వీరిలో 30 నుంచి 40% మహిళలు ఉంటారు. వీరికి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దివ్యాంగులైన మగవారికి ఉచిత ప్రయాణ సదుపాయం కలగనుంది.

ఏటా సగటున పాస్​లు: రాష్ట్రంలో 7.68 లక్షల మంది వికలాంగుల పింఛన్లు పొందుతున్నారు. మరో 24,000 మంది పూర్తిగా మంచానికి, వీల్‌ఛైర్‌కి పరిమితమై పింఛను తీసుకుంటున్న వారు ఉన్నారు. అయితే ప్రతీ సంవత్సరం సగటున 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీలో దివ్యాంగుల పాస్‌లు పొందుతున్నారు. ఉచిత ప్రయాణ పథకం వల్ల ఈ పాస్‌ల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

దివ్యాంగులకు సీఎం 7 వరాలు: తాజాగా కూటమి ప్రభుత్వం తరఫున దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 7 వరాలు ప్రకటించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. వాటితో పాటుగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. శాప్‌ (SAAP) ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు.

దివ్యాంగులకు సీఎం 7 వరాలు - ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగులకు గుడ్ న్యూస్ - ఒక్క క్లిక్​తో ఇంటి నుంచే రైల్వే పాస్‌లు పొందొచ్చు