సంక్రాంతికి అరకొరగా బస్సుల కేటాయింపు - 35 బస్సులతో పండగని సర్దేస్తారా?
9 నుంచి 12వ తేదీ వరకు వైజాగ్‌కు 37 బస్సులు, రాయలసీమకు 33 బస్సులు కేటాయింపు - గురువారానికి రిజర్వేషన్లు పూర్తి - రిజర్వేషన్ లేకుండా తిరిగే బస్సు సర్వీసులు ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 12:11 PM IST
|Updated : January 9, 2026 at 2:55 PM IST
APSRTC Special Busses For Sankranthi : పెద్ద పండగ సంక్రాంతి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు ఈ ఏడాది కూడా తప్పేలా లేవు. అధికారులు ఈ పండగ సమయంలో అరకొరగానే బస్సులను కేటాయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వచ్చే వారు అధికంగా ఉన్నా బస్సులు మాత్రం ఆ స్థాయిలో లేవు. దీంతో ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి పండగకు వచ్చే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పేలా లేవు.
35 బస్సులతో ఎలా? : సంక్రాంతి అంటే హైదరాబాద్ నుంచి జనం వివిధ ప్రాంతాలకు పోటెత్తుతారు. కొన్నేళ్ల కిందట దాదాపు 150 వరకు ప్రత్యేక బస్సులు నడిపేవారు. ఇటీవల వరకు 18 బస్సులు మాత్రమే కేటాయిస్తున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. గురువారం ఆ సంఖ్యను మరింత కొద్దిగా పెంచి 24 బస్సులను కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నై, బెంగళూరుకు ఐదారు సర్వీసులు మాత్రమే ఉన్నాయి.
- హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి వచ్చేవారి కోసం 11 బస్సులను కేటాయించారు. రెండేళ్ల కిందట వరకు దాదాపు 70 బస్సులు నడిపేవారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 35 బస్సులతో సంక్రాంతి పండగని సర్దేయాలన్నది ఆర్టీసీ అధికారుల ఆలోచన.
- టీఎస్‌ఆర్టీసీ నుంచి మాత్రం పెద్ద సంఖ్యలో బస్సులు కేటాయిస్తున్నారు. కానీ ఏపీఎస్‌ఆర్టీసీ కంటే టీఎస్‌ఆర్టీసీ టిక్కెట్ల రేటు మాత్రం 50శాతం అదనం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏపీఎస్‌ఆర్టీసీలో టికెట్ రేటు రూ.450 ఉంటే టీఎస్‌ఆర్టీసీలో మాత్రం అది రూ.675.
- హైదరాబాద్‌కు ఉన్న బస్సుల్లో ఎక్కువ కేటాయిస్తే పండగకు వచ్చే అంతర్రాష్ట్ర ప్రయాణికులకు, స్త్రీ శక్తి పథకం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవన్న కోణంలో అధికారులు ఉన్న బస్సులను సర్దుబాటు చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ఫుల్ : జనవరి 9, 10 తేదీల నుంచి సంక్రాంతి సెలవులు మొదలవుతున్న నేపథ్యంలో 9 నుంచి 12వ తేదీ వరకు వైజాగ్‌కు 37 బస్సులు, రాయలసీమకు 33 బస్సులు కేటాయించారు. ఈ బస్సుల్లో గురువారానికే రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు వెళ్లేవారి కోసం మరిన్ని బస్సులు కావాల్సి ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన విద్యార్థులు, వివిధ పనుల కోసం వలస వచ్చిన వారు విజయవాడలో ఎక్కువగా ఉన్నారు.
"డిమాండ్‌ను బట్టి స్థానిక సర్వీసులు పెంచుతాం. రాష్ట్రం నలుమూలలకు విజయవాడ నుంచి రిజర్వేషన్ లేకుండా తిరిగే బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ బస్సుల విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తాను" -సూర్యపవన్‌కుమార్, పీఎన్‌బీఎస్ డిప్యూటీ సీటీఎం
ప్రైవేట్ బస్సు ధరలు 50 శాతం పెంపు: సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగా ఈనెల 12,13వ తేదీల్లోనే బయలుదేరేందుకు సిద్ధం అయ్యారు. టికెట్ల కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. ఐతే, ఇదే అదనుగా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీలకు దాదాపు 50% పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. సదుపాయాలు కలిగిన బస్సులు ఆర్టీసీ నడపలేక పోవడంతో పలువురు ప్రయాణికులు ప్రైవేటు బస్సులలో వెళ్తున్నారు.
నిబంధనలు పట్టించుకోని ట్రావెల్స్ బస్సులు: పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ పలురకాల అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రయాణికులకు గత్యంతరం లేదని భావించి నిలుపు దోపిడీ చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, విశాఖ తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో డిమాండ్ విపరీతంగా ఉంటోంది. పండుగ ముందు, తర్వాత రోజుల్లో ఆయా ప్రాంతాలకు నడిచే ట్రావెల్స్ బస్సు సర్వీసుల టికెట్ ధరలను మూడింతలు పెంచారు. నిబంధనలు బేఖాతరు చేస్తున్న కొన్నింటిపై ఇప్పటికే అధికారులు గురి పెట్టారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రవాణా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
వామ్మో! రూ.3.50 లక్షలు పలికిన పందెం కోడి - ప్రత్యేకత ఏంటంటే?
450 ఏళ్ల ఘన చరిత్ర - కోనసీమ ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా

