రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు - పిడుగులకు అవకాశం ఉన్నందున రైతులు చెట్ల కింద ఉండరాదన్న విపత్తుల నిర్వహణ సంస్థ - ఇవాళ కురిసిన వానతో రోడ్లు జలమయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 8:26 PM IST
Heavy Rain Alert in AP : ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఓ ద్రోణి, అంతర్గత కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా కొమోరిన్ వరకు మరో ద్రోణి విస్తరించాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు (సోమవారం) కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
మరోవైపు ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఎండలో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వానలు కాస్త ఉపశమనం కలిగించాయి. రాజమహేంద్రవరంలో ఈరోజు మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామల సెంటర్, కోటిపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్, హైటెక్ బస్టాండ్, ఆదాయ పన్నుశాఖ కార్యాలయం రోడ్డు, కంబాలచెరువు, కోరుకొండ రోడ్డు తదితర ప్రాంతాల్లో వరదనీరు రహదారిపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
AP Heavy Rains : విజయవాడలో చిరుజల్లులు కురిశాయి. పగలంతా ఎండతో మండిపోయిన వాతావరణం సాయంత్రం కాస్త చల్లబడింది. చిరుజల్లులు ప్రజలను ఆహ్లాదపరిచాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిన్నటి వరకు వేసవి తాపానికి పంట పొలాలు ఎండిపోతుండగా ఒక్కసారిగా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాంలో పిడుగుపడి 26 గొర్రెలు, 6 మేకలు మృత్యువాత పడ్డాయి. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది గ్రామపెద్దలు శవపంచనామా నిర్వహించారు. జీవాల మృతిపై నష్టపరిహారానికి చర్యలు తీసుకుంటామాని అధికారులు భరోసానిచ్చారు.
జనసంద్రమైన స్వర్ణాల చెరువు - మూడో రోజు రొట్టెల పండగకు పోటెత్తిన భక్తులు
సంతానం భారం కాదు, సంపద - పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి : సీఎం చంద్రబాబు

