ETV Bharat / state

తెలంగాణ గురించి చెప్పేందుకు టూరిస్ట్ గైడ్లు వచ్చేస్తున్నారు!

పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వారసత్వ, పర్యాటక శాఖలు కీలక నిర్ణయం - 500 మంది శిక్షణ పొందిన టూరిస్ట్‌ గైడ్లు నియామకం - యువతకు ఉపాధితో పాటు వారసత్వ పరిరక్షణ

చార్మినార్
చార్మినార్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 4:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Telangana Tourist Guides 2026 : తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, కోటలు, శిల్పకళా సంపదను పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వారసత్వ, పర్యాటక శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 మంది శిక్షణ పొందిన టూరిస్ట్‌ గైడ్లను నియమించేందుకు రంగం సిద్ధం చేశాయి. చారిత్రక ప్రదేశాల విశిష్టతను వివరించడంతో పాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.

22 ఏళ్ల తర్వాత భారీగా నియామకాలు : తెలంగాణలో చివరిసారిగా 2004లో సుమారు 30 మంది టూరిస్ట్‌ గైడ్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. ఆ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో గైడ్లను నియమించడం ఇదే తొలిసారి. దాదాపు 22 ఏళ్ల విరామం తర్వాత 500 మందిని ఎంపిక చేయడం రాష్ట్ర పర్యాటక రంగంలో ఆసక్తికర పరిణామంగా మారింది.

మూడు వేల దరఖాస్తులు : టూరిస్ట్‌ గైడ్ల ఎంపిక కోసం మూడు నెలల క్రితమే వారసత్వశాఖ దరఖాస్తులు స్వీకరించింది. డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు చదువుకున్న దాదాపు 3 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 500 మందిని ఎంపిక చేసి ఐదు బ్యాచ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నారు. చరిత్ర, ఆర్కియాలజీ వంటి సంబంధిత సబ్జెక్టులు చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

రెండు వారాల ప్రత్యేక శిక్షణ : హైదరాబాద్‌లోని నిథిమ్‌లో ప్రతి బ్యాచ్‌కు రెండు వారాల పాటు శిక్షణ నిర్వహించనున్నారు. చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యం, కట్టడాల చరిత్ర, శిల్పకళా విశేషాలు, పర్యాటకులతో వ్యవహరించే విధానం తదితర అంశాలను నిపుణులు బోధించనున్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే తొలి విడతలో 100 మందికి శిక్షణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పర్యాటక ప్రాంతాలకు కొత్త ఆకర్షణ : నేలకొండపల్లి, ఘన్‌పూర్‌ దేవాలయం, భువనగిరి కోట, లక్నవరం సరస్సు, పాండవుల గుట్ట, మెదక్‌ చర్చి వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో కొత్త గైడ్లు సేవలు అందించనున్నారు. ప్రస్తుతం గైడ్ల సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరి నియామకం పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

ఉపాధితో పాటు వారసత్వ పరిరక్షణ : గైడ్లకు ప్రభుత్వం తరఫున నెలవారీ గౌరవ వేతనం అందించే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పర్యాటకుల నుంచి వసూలు చేయాల్సిన పారితోషికాన్ని కూడా త్వరలో నిర్ణయించనున్నారు. ఎంపికైన వారికి వారసత్వశాఖ గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. ఈ చర్యతో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ గురించి పర్యాటకులకు ప్రత్యక్షంగా వివరించే అవకాశం ఏర్పడటమే కాకుండా, యువతకు కొత్త ఉపాధి మార్గాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఈ జలపాతం శబ్దం మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది

టూరిస్ట్ హబ్​లుగా తెలంగాణ బౌద్ధస్థూపాలు - ఆగ్నేయాసియా దేశాల సహకారంతో ప్రణాళికలు