ఏపీలో కొత్తగా 25 భారీ పారిశ్రామిక పార్కులు - 'భవ్య' యోజనతో మౌలిక సదుపాయాలు
పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట - కేంద్ర ప్రభుత్వ 'భవ్య' పథకం కింద నిధుల వినియోగానికి కసరత్తు - 22 పార్కుల కోసం ఇప్పటికే 12,000 ఎకరాల భూసేకరణ పూర్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 30, 2026 at 8:34 AM IST
AP Industrial Parks Development : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ (ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులను గరిష్టంగా వినియోగించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (భవ్య) పథకం కింద 22 పార్కులను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే భారీ ప్రాజెక్టులకు అనుబంధంగా శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో మరో మూడు భారీ పార్కులను అభివృద్ధి చేయనున్నారు.
ఎకరాకు రూ.కోటి కేంద్రం గ్రాంటు : కేంద్ర ప్రభుత్వం 'భవ్య' పథకం కింద రూ. 33,660 కోట్లతో దేశవ్యాప్తంగా 100 పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఎంపికైన పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ. కోటి చొప్పున కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. తొలి దశలో 20 పార్కుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, రాష్ట్రం నుంచి ఏపీఐఐసీ 6 పార్కులకు ప్రతిపాదనలు పంపింది. వీటిలో కనీసం రెండింటికి కేంద్రం ఆమోదం దక్కుతుందని అధికారులు ఆశిస్తున్నారు. రెండో దశలో 80 పార్కుల అభివృద్ధి కోసం కేంద్రం దరఖాస్తులు కోరింది. దీంతో రాష్ట్రంలోని 16 చోట్ల పార్కులకు ఏపీఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
నిబంధనల ప్రకారం ఈ పథకం కింద 90 శాతం భూసేకరణ పూర్తయిన వాటినే ప్రతిపాదించాలి. భవ్య పార్కుల కోసం ఏపీఐఐసీ ఇప్పటికే 12,000 ఎకరాలను సేకరించింది. ఆ భూములను ఈ పథకం కోసం ప్రతిపాదించారు. కేంద్రం అనుమతించని పార్కులు ఏవైనా ఉంటే, వాటిని ఏపీఐఐసీ తన సొంత నిధులతో అభివృద్ధి చేయనుంది.
మరో మూడు భారీ పార్కులు : రాష్ట్రంలోకి వచ్చే భారీ ప్రాజెక్టులకు అనుసంధానంగా మరో మూడు పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేయనుంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి చెందే ఎకోసిస్టమ్‌ను వాడుకుంటూ, అనుబంధ సంస్థలకు భూములు కేటాయించేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఈ మూడు పార్కుల కోసం ఏకంగా 8,000 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 2,000 ఎకరాల్లో భారీ కెమికల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. భవ్య రసాయన పథకం కింద దేశవ్యాప్తంగా రూ. 3,030 కోట్లతో కెమికల్ పార్కుల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకం కింద మూలపేట ప్రాజెక్టుకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. ఇందులో 450 ఎకరాలను కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ ఇక్కడ రూ. 2,250 కోట్ల భారీ పెట్టుబడితో ఫాస్పారిక్ యాసిడ్, ఫెర్టిలైజర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
పుట్టపర్తి, అనకాపల్లిలో ప్రత్యేక పార్కులు : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వద్ద ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ) రూ. 15,803 కోట్లతో 'అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' తయారీ ప్రాజెక్టును స్థాపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా మరిన్ని సంస్థలు వచ్చేందుకు వీలుగా ఇక్కడ 5,000 ఎకరాల్లో కొత్త పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ భూసేకరణ చేస్తోంది.
అలాగే, అనకాపల్లి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో రేర్‌ఎర్త్ మినరల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఏటా 25,000 టన్నుల రేర్ ఎర్త్ మినరల్స్‌ను ఉత్పత్తి చేసి, శుద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వీటికి అనుగుణంగా వచ్చే పరిశ్రమల కోసం కొత్త పార్కుల అభివృద్ధిపై తాము ప్రత్యేక దృష్టి సారించామని ఏపీఐఐసీ వీసీ, ఎండీ దినేశ్‌కుమార్ 'ఈటీవీ భారత్'కు వివరించారు.

