నేటితో పర్యాటకాభివృద్ధి సంస్థకు 50 ఏళ్లు పూర్తి - అంచెలంచెలుగా ఎదుగుతున్న ఏపీటీడీసీ
వైఎస్సార్సీపీ హయాంలో పర్యాటకంపై తీవ్ర నిర్లక్ష్యం - పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించిన కూటమి సర్కార్ - కొత్త పాలసీతో పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించిన ప్రభుత్వం - ఉత్సవ్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 7:43 AM IST
AP Tourism Development Corporation 50th Anniversary : కోరిన కోర్కెలు తీర్చే వేంకటేశుడి కొలువైన తిరుమల.! మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అరకు లోయ, లంబసింగి. సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు సూర్యలంక, విశాఖ బీచ్‌లు. చారిత్రక ఆనవాళ్లకు నిలయమైన అమరావతి బౌద్ధ స్మారక చిహ్నాలు, కొండపల్లి కోట. ఔరా అనిపించే బొర్రా, బెలుం గుహలు. ఇలా ఏ రాష్ట్రానికి లేనన్ని పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం.! పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పర్యాటకాభివృద్ధి సంస్థ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఏపీ టూరిజం 50 ఏళ్ల ప్రస్థానం, దాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక కథనం.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల స్వర్గధామం! శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, విశాఖ నుంచి అనంతపురం వరకు ఎటు చూసినా ఆధ్యాత్మిక ఉట్టిపడే ఆలయాలు, అహ్లాదం పంచే అడవులు, హుషారు కలిగించే జలపాతాలు, చారిత్రక కట్టడాలు, ఉత్తేజాన్నిచ్చే తీరప్రాంతం కనిపిస్తాయి. ఈ అద్భుతాలను చూసేందుకు ఏటా సుమారు 27 కోట్ల మంది దేశీయ పర్యాటకలు, లక్షా 80 వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వస్తుంటారు. అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో నిలుస్తోంది. పర్యాటకలను ఏపీ వైపు రప్పించేలా చేస్తూ రాష్ట్రానికి రాబడి పెంచుతున్న పర్యాటకాభివృద్ధి సంస్థ నేటితో అర్ధ శతాబ్ధం పూర్తి చేసుకుంటోంది.
అంచెలంచెలుగా ఎదుగుతున్న ఏపీటీడీసీ: 1976 ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ప్రారంభమైన పర్యాటకాభివృద్ధి సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. అయితే గత వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యంతో పర్యాటకం పూర్తిగా పడకేసింది. పర్యాటకుల రాక తగ్గింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. టూరిజానికి పారిశ్రామిక హోదా ఇచ్చింది. కొత్త టూరిజం పాలసీ తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో 17 వేల 973 కోట్ల రూపాయల పెట్టుబడులకు 103 ఒప్పందాలు జరిగాయి. 97 వేల 876 మంది ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు రాబడుతుంది.
''కేంద్రం ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు ఇస్తుంది. ముఖ్యంగా ప్రసాద్ స్కీం దేవాలయాలను అభివృద్ధి చేయడానికి నిధులు ఇస్తుంది. దీనిలో భాగంగా అన్నవరం, సింహాచలం ఆలయాలను డెవలప్ చేస్తున్నాం. ఒక ప్రదేశాన్ని టూరిజం స్ఫాట్గా తీర్చిదిద్దేందుకు మనకి స్వదేశీ దర్శన్-2 వంటి ప్రోగ్రామ్ ద్వారా అఖండ గోదావరి, గండి కోట ప్రాజెక్టుకి నిధులు మంజూరు అయ్యాయి.'' - ఎం. శేషగిరి, ఏపీటీడీసీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఉత్సవ్ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహణ: హరిత హోటళ్లు, రిసార్టుల విస్తరణ, హౌస్ బోట్లు, స్పీడ్ బోట్లు, చారిత్రక ప్రదేశాల్లో సౌండ్, లైట్ షోలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యమిస్తూ 29 వోల్వో కోచ్‌లు, 63 హైటెక్ బస్సులు, ఈవీ బస్సులతో ఆధునిక సేవలు అందిస్తోంది. కారవాన్ ప్యాకేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, అడ్వంజర్ టూరిజం వంటి కార్యక్రమాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. విశాఖ ఉత్సవ్, అనకాపల్లి ఉత్సవ్, విజయవాడ ఉత్సవ్, అమరావతి ఆవకాయ్, సూర్యలంక బీచ్ ఫెస్టివల్, మసులా బీచ్ ఫెస్ట్ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పర్యాటకానికి సరికొత్త బ్రాండ్ తీసుకొస్తుంది.
ప్రస్తుతం రాష్ట్ర స్థూల విలువ జోడింపులో 4.6 శాతంగా ఉన్న పర్యాటక వాటాని 2029 నాటికి 8 శాతానికి పెంచేలా కూటమి సర్కార్ లక్ష్యం పెట్టుకుంది. 2028 నాటి 50 వేల గదులు అందుబాటులో ఉంచాలనే ధ్యేయంతో కొత్త హోటళ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. పీపీపీ విధానంలో పర్యాటక శాఖే భూములు, స్థలాలు లీజుకు కేటాయిస్తోంది. సొంత భూముల్లో చేపట్టే హోటళ్ల నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లలో స్టాంపు డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను, జీఎస్టీ వంటి విషయాల్లో రాయితీలు అందిస్తోంది. పలు రాయితీలు అందిస్తోంది.
పర్యాటక రంగంలో మరో కీలక ముందడుగు- ఎనిమిది చోట్ల హౌస్ బోట్లు!
హోప్ ఐలాండ్లో స్పేస్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు - కానీ సౌకర్యాలే అరకొర

