ETV Bharat / state

విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేపట్టాలి: ఆర్టీసీ జేఎసీ

ఉద్యోగుల సమస్యలపై అధికారులతో చర్చలు - 30 డిమాండ్లు ముందుంచిన ఆర్టీసీ ఐకాస - ‘స్త్రీ శక్తి’ పథకానికి అవసరమైన మేర బస్సుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి

RTC JAC Demands
RTC JAC Demands (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 6, 2026 at 3:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

RTC JAC Demands: ఉద్యోగుల సమస్యలపై ఆర్టీసీ ఐకాస నేతలు చర్చలు జరిపింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం, సంస్థ పరిరక్షణ కోసం ఆర్టీసీ ఐకాస (JAC) ఇటీవల పలు డిమాండ్లతో కార్యాచరణను ముమ్మరం చేసింది. ఈడీ అడ్మిన్ బ్రహ్మానందరెడ్డి, ఈడీ ఇంజినీరింగ్ వర్మతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఐకాస నేతలతో ఈడీ ఆపరేషన్స్ నాగేశ్వరరావు పలు కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. అనంతరం స్పెషల్ సీఎస్​, ఎండీలకు ఈడీలు వివరాలను తెలిపారు.

30 డిమాండ్లు: విద్యుత్ బస్సుల కొనుగోలు ఆర్టీసీ ద్వారానే చేపట్టాలని ప్రధాన డిమాండ్‌తో ఐకాస చర్చలు జరిపింది. ఆర్టీసీ సిబ్బందితోనే ఈ-బస్సుల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులు నడుపుతామంటే అంగీకరించలేమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. మరోవైపు 'స్త్రీ శక్తి' పథకానికి అవసరమైన మేర బస్సుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేసింది. స్త్రీ శక్తి పథకం వల్ల ప్రయాణికులు సంఖ్య బాగా పెరిగిందని, ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు వసూలు చేసి బస్సులు కొనాలని సూచించారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయటం సహా 30 డిమాండ్లను ఆర్టీసీ ఐకాస అధికారుల ముందుంచారు. ప్రకటించిన కార్యాచరణ ప్రకారం నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేపట్టాలి: ఆర్టీసీ జేఎసీ (ETV Bharat)

ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయనివ్వం: తమ అజెండాపై ఇంకా స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాల కన్వీనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులు కొనాలని చెప్పగా దానిపై వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయబోమని రవాణా మంత్రి చెప్పారని ఆపరేటర్లతో విద్యుత్ బస్సుల కొనుగోలు ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడమే అవుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమావేశం మొక్కుబడిగా జరిగిందని ఉద్యోగ సంఘాల కన్వీనర్‌ దామోదర్‌రావు వివరించారు.

ఆర్టీసీకి బకాయిలు పడ్డ వివిధ వర్గాల నుంచి వందల కోట్లు నగదు వసూలు చేసి విద్యుత్ బస్సులు కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యాలు పరిష్కరించే సమస్యలు అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు ఇలా వేరువేరుగా సమావేశంలో అధికారులు చర్చించారని తెలిపారు. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని సంస్థ పరిరక్షణ కోసం ముందుగా ప్రకటించిన కార్యాచరణ ప్రకారం నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

'ఐకాస అజెండాపై ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. మేం చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈడీలు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ బస్సుల కొనుగోలు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మూసివేసిన డిపోలు పునరుద్ధరించాలి. పరిష్కరించాల్సిన సమస్యలపై 10 రోజుల్లో సమావేశం పెడతామన్నారు. మా పోరాటం వ్యక్తిగతం కాదు, ఆర్టీసీని రక్షించుకోవడంమే.' -ఉద్యోగ సంఘాలు

డీజిల్ బస్సులు కొనం - ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్, సీఎన్జీలే: మంత్రి మండిపల్లి

అవనిగడ్డ డిపోలో 20 అద్దె బస్సులు నిలిపివేత - ఇబ్బందుల్లో ప్రయాణికులు