ETV Bharat / state

‘ఏఐ4 ఏపీ పోలీస్‌’ - 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

8 మాడ్యూల్స్‌ సాయంతో పక్కాగా ఛార్జ్‌షీట్‌ - డేటా, సాక్ష్యాల ఆధారిత పోలీసింగ్‌ వైపు పరివర్తన - వచ్చే 6 నెలల్లో రాష్ట్రమంతా విస్తరించనున్నా ప్రాజెక్టు

AP Police Department launches AI4 AP Police project
AP Police Department launches AI4 AP Police project (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 1:24 PM IST

5 Min Read
Choose ETV Bharat

AI4 AP Police in Andhra Pradesh : పోలీసింగ్​లో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగాన్ని మరింత పెంచేందుకు ఏపీ పోలీస్ శాఖ 'ఏఐ 4 ఏపీ పోలీస్' ప్రాజెక్ట్​కు శ్రీకారం చుట్టింది. సంప్రదాయ విధుల నుంచి డేటా, సాక్ష్యాల ఆధారిత, ఏఐ సహాయ పోలీసింగ్ వైపు మళ్లేందుకు వీలుగా ఈ ప్రాజెక్టులో 8 ఏఐ మాడ్యుల్స్​ను సిద్ధం చేసింది. ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. డీజీపీ హరీష్​కుమార్ గుప్తా చొరవతో సాంకేతిక సేవల విభాగం ఐజీ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షణలో 'ఏఐ 4 ఏపీ పోలీస్' ప్రాజెక్టు సిద్ధమైంది.

పిటిషన్‌ ఏఐ: ఈ మాడ్యూల్‌ బాధితుల ఫిర్యాదుల్లోని సారాంశాన్ని సంగ్రహించి ఉన్నతాధికారులకు అందిస్తుంది. క్షేత్రస్థాయి సిబ్బంది సరిగ్గా విచారించారా? విచారణ నివేదిక సమగ్రంగా ఉందా? లోపాలు ఏమైనా ఉన్నాయా? అవేంటి? అవసరమైన పత్రాలు అన్నీ పొందుపరిచారా? వంటి అంశాలు వేగంగా సమీక్షించేందుకు, నాణ్యత మదించడానికి, లోపాలను సరిదిద్దేలా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మాన్యువల్​గా ఒక్కో విచారణ నివేదిక సమీక్షకు 30 నుంచి 45 నిమిషాలు పడుతుండగా, ఆ మాడ్యూల్ ద్వారా 5 నుంచి 10 నిమిషాలు చాలు.

డిజిటల్‌ ఎవిడెన్స్‌ ఏఐ: ఫోన్​ కాల్ డీటెయిల్ రికార్డులు, ఐపీడీఆర్​లు, టవర్ డేటా కోసం దర్యాప్తు అధికారులు వివిధ టెలికాం ఆపరేటర్లకు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు అకౌంట్ల సమాచారం కోసం బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, వివిధ ఈ కామర్స్ సంస్థలకు చట్ట ప్రకారం నోటీసులు ఇస్తుంటారు.

కేసు వివరాలు, కావాల్సిన సమాచారం పొందుపరిస్తే చాలు, ఏ విభాగానికి ఎలా నోటీసులు ఇవ్వాలో ఈ మాడ్యుల్ ఓ ఫార్మాట్​ను సిద్ధం చేసి దర్యాప్తు అధికారికి ఇస్తుంది. వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, కేసుతో అనుసంధానిస్తుంది. నోటీసుల జారీ, స్వీకరణకు ఓ నోడల్‌ అధికారిగా ఉపయోగపడుతుంది.

కాగ్నిటివ్‌నెట్‌ ఏఐ: కాల్ డీటెయిల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు, ఐపీడీఆర్​లు, ఫుడ్ డెలివరీ రికార్డులు, పేమెంట్ గేట్​వేలు, టవర్ డంప్, సహా ఇతరత్రా వనరుల నుంచి సేకరించిన సాంకేతిక ఆధారాలు అన్నింటినీ విశ్లేషించి వాటిల్లో నుంచి దర్యాప్తు అధికారికి కావాల్సిన సమాచారాన్ని వెలికి తీస్తుంది.

ఉదాహరణకు ఓ అనుమానితుడికి సంబంధించి వివిధ రూపాల్లో వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి 'ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య అనుమానితుడు 3 వ్యక్తులతో మాట్లాడాడు. లొకేషన్ డేటా విశ్లేషణలో అతను విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్నట్లుగా ఉంది అని సులువుగా అర్థం అయ్యే రీతిలో సమాచారం ఇస్తుంది. అనుమానితుల ప్రవర్తనను విశ్లేషిస్తుంది. కేసుల దర్యాప్తు, నేరాల ఛేదనకు ఇది కీలకం.

ఇన్వెస్టిగేషన్ కో-పైలట్: ఫిర్యాదు స్వీకరణ, కేసు నమోదు, దర్యాప్తు, ఆధారాల సేకరణ, కేసు డైరీ, ఛార్జ్​ షీట్ తయారీ వరకు కూడా ప్రతి దశలోనూ దర్యాప్తు అధికారికి ఈ టూల్ సహాయపడుతుంది. ఫిర్యాదులోని తీవ్రత, నేర అంశాలను గుర్తించి, ఆ కేసుకు వర్తించే చట్టాలు, సెక్షన్ల సమాచారాన్ని ఇస్తుంది.

ఆయా కేసుల దర్యాప్తునకు నిర్దేశించిన ప్రామాణిక పద్ధతుల ప్రకారం కేసు డైరీ, ఛార్జ్​షీట్ ఉందా? ఆ మేరకు ఆధారాలు సేకరించారా? అని పరిశీలిస్తుంది. తద్వారా విచారణలో లోటుపాట్లను సరిదిద్దుకొని సమగ్ర నివేదికను కోర్టులో సమర్పించవచ్చు. దోషులు తప్పించుకునే వీలు లేకుండా పక్కా సాక్ష్యాధారాలతో కేసును నిలబెట్టి, శిక్ష పడేలా చేస్తుంది. సాంకేతిక కారణాలతో కేసు వీగిపోయే అవకాశాలను తగ్గిస్తుంది.

డాక్స్‌2డేటా: పోలీస్ ఉద్యోగుల సర్వీసు రికార్డులు, బదిలీ ఆర్డర్లు, శిక్షణ సర్టిఫికెట్లు, ఏసీఆర్​లు, మెడికల్ రికార్డులు తదితర పర్సనల్ డాక్యుమెంట్లు అన్నీ ప్రస్తుతం కాగితాల్లో ఉన్నాయి. అవసరమైనప్పుడు వాటిని వెతుక్కోవడం పెద్ద పని. ఈ ఏఐ టూల్‌తో వాటన్నింటినీ డిజిటలైజ్‌ చేస్తారు. ఏ ఉద్యోగి సమాచారమైనా ఉన్నతాధికారులు క్షణాల్లో తెలుసుకోవచ్చు.

సోష్‌ఇంట్‌ ఏఐ: వివిధ వాట్సప్ గ్రూపుల్లో పోటెత్తే మెసేజ్​ల్లో పోలీసులకు అవసరమైనవి గుర్తించి, వాటిని అంశాల వారీగా వర్గీకరించి సంబంధిత జిల్లా, సబ్ డివిజన్, పోలీస్ స్టేషన్లకు పంపించేందుకు ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. ఆందోళనలు, ఆర్థిక మోసాలు, నేరాలు, శాంతి భద్రతల సమస్యలకు దారి తీసే మెసేజ్​లను వడ పోసి, ఆయా విభాగాలను పర్యవేక్షించే అధికారులకు పంపించి వారిని అప్రమత్తం చేస్తుంది. తద్వారా పోలీసులు నేర నియంత్రణ, శాంతి భద్రతల రక్షణకు సత్వరమే స్పందించవచ్చు.

న్యూస్ 360 ఏఐ: న్యూస్ పేపర్స్, న్యూస్ వెబ్​సైట్లు, డిజిటల్ మీడియా వేదికలో వేర్వేరు భాషల్లో వచ్చిన వార్తలను అనువదించి, విశ్లేషించి, వాటి సారాంశాన్ని సంక్షిప్తంగా సిద్ధం చేసి అందిస్తుంది. ఒక అంశానికి సంబంధించిన వార్తలు అన్నింటినీ ఒకే చోట క్రోడీకరించడం, లింక్ చేయడం ఈ మాడ్యూల్ పని. ఆయా వార్తల్లోని వ్యక్తులు, సంస్థలకు ఏవైనా నేరాల్లో సంబంధముంటే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఈ సమాచారాన్ని పోలీసులు ఆటోమేటెడ్ న్యూస్ ఇంటెలిజెన్స్​గా వాడుకుంటారు.

ఏఐ ఫౌండేషన్‌: ఏఐ ఎకోసిస్టమ్‌కు ఇది వెన్నుముకలా పని చేస్తుంది. ప్రాంప్ట్‌ మేనేజ్‌మెంట్, అబ్జర్వబిలిటీ, యాక్సెస్‌ కంట్రోల్, సెంట్రలైజ్డ్‌ అథెంటికేషన్‌ సహా రీయూజబుల్‌ ఏఐ బిల్డింగ్‌ బ్లాక్స్‌ అందిస్తుంది. డేటా సెక్యూరిటీకి హామీ ఇస్తుంది. కొత్త ఏఐ యూజ్‌ కేసుల తయారీకి దోహదపడుతుంది.

దర్యాప్తు నాణ్యత పెరుగుతుంది: 'ఏఐ 4 ఏపీ పోలీస్' ప్రాజెక్టు అమలుతో కేసుల దర్యాప్తునకు పట్టే సమయం తగ్గుతుందని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా తెలిపారు. దర్యాప్తులో నాణ్యత మెరుగై, శిక్షల శాతం పెరుగుతుందన్నారు. పోలీసుల సాధారణ విధులు, రోజువారీ పనులకు సమయం తగ్గుతుందని చెప్పారు. తద్వారా వారు అత్యంత ముఖ్యమైన అంశాలపై, మెరుగైన పౌర సేవలపై దృష్టి పెట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వెల్లడించారు.

హ్యాక్‌థాన్‌ నుంచి అమలు స్థాయికి తెచ్చాం: గత ఏడాది జూన్​లో నిర్వహించిన 'ఏఐ 4 ఆంధ్ర పోలీస్ హ్యాక్​థాన్​'లో ఎంపిక అయిన యూజ్ కేసులను మన అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయించి, అమలు చేయిస్తున్నామని సాంకేతిక సేవల విభాగం ఐజీ సీహెచ్‌ శ్రీకాంత్ తెలిపారు. '4 సైట్స్ ఏఐ' సంస్థ సీఈవో సూర్య కోటను నాలెడ్జ్ పార్టనర్​గా నియమించకున్నామని అన్నారు. దేశంలోనే తొలిసారిగా పోలీస్ సంబంధిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ను అభివృద్ధి చేసి, అమలు చేస్తున్న ఘనత ఏపీ పోలీస్ శాఖదే. భవిష్యత్తులో పోలీసింగ్ పరంగా ఇది పెను విప్లవానికి దారి తీస్తుందని పేర్కొన్నారు.

పోలీసులకు ఏఐ సాయం - ఇంక అంతా దానితోనే!

పోలీసుల చేతిలో ఏఐ ‘ధర్మా’స్త్రం - యాప్‌ సాయంతో పక్కాగా విచారణ, ప్రాసిక్యూషన్‌