ETV Bharat / state

కొత్తగా పోలవరం, మార్కాపురం - 28కి పెరిగిన జిల్లాలు

అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె - 9 జిల్లాల్లో మార్పులు లేవు - 17 జిల్లాల్లో మార్పులు - రాష్ట్రంలో మొత్తం 25 మార్పులు చేశామని మంత్రులు వెల్లడి

New Districts in AP
New Districts in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 4:24 PM IST

|

Updated : December 30, 2025 at 8:02 AM IST

5 Min Read
Choose ETV Bharat

Two New Districts in Andhra Pradesh : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర పడింది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య ఇకపై 28కి చేరనుంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటునకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, సహా పలు చోట్ల సరిహద్దుల మార్పులనూ మంత్రి వర్గం ఆమోదించింది. గత ప్రభుత్వం రాజకీయ లబ్దికోసం జిల్లాల పునర్విభజన చేయగా ప్రజలు అవస్థలు పడ్డారు. ప్రజాభిప్రాయాలు తీసుకుని వాటికి అనుగుణంగా సుపరిపాలన అందించేలా మార్పులు చేస్తూ మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే సరిహద్దుల మార్పులు చేశారు. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ రానుండగా మార్పులన్నీ జనవరి 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

క్యాబినెట్‌లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో కలిసి అనగాని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని ఆమోద ముద్ర వేశారు. ఈ నెలాఖరు లోపు జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పులపై తుది నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్ధితుల్లో మార్పులు చేర్పులపై ప్రజలనుంచి వచ్చిన అభ్యంతరాలు సూచనలపై క్యాబినెట్లో సమగ్రమంగా చర్చించారు. ఇప్పటికి ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో ప్రజాభిప్రాయం మేరకు మార్చాల్సిన అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తీసుకున్నారు.

Two New Districts in Andhra Pradesh (ETV)

తెరపైకి కొత్తగా 2 జిల్లాలు : సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు మార్లు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ప్రతిపాదనలను క్యాబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉండగా కొత్తగా2 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేశారు. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మార్కాపురం కొత్తజిల్లాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండ పాలెం నియోజక వర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆమోద ముద్ర వేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మదనపల్లిని జిల్లాగా చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చారు. ఇకపై మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

సరిహద్దుల మార్పులపైనా కసరత్తు పూర్తిచేశారు. 9 జిల్లాల్లో మార్పులు లేవీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులు చేస్తూ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. మదనపల్లె హెడ్ క్వాటర్​గా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, మదన పల్లె హెడ్ క్వాటర్​గా ఏర్పడే అన్నమయ్య జిల్లాలో రాయచోటి ఉంటుందని మంత్రి వర్గం స్పష్టం చేసింది. రాయచోటిని జిల్లా కేంద్రం మార్పు పై స్థానిక మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి వర్గ సమావేశంలో బాధపడగా మంత్రి మండిపల్లిని సీఎం పిలిపించి ఓదార్చారని మంత్రులు తెలిపారు. రాయచోటిని అన్ని విధాలా అభివృద్ది చేసే బాధ్యత సీఎం చంద్రబాబు తీసుకుంటారని సమావేశం అనంతరం మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల పునర్విభజన చేసిందని, అప్పట్లో సరిగ్గా చేసి ఉంటే ఇప్పడు ఈ పరిస్ధితి వచ్చేది కాదని మంత్రులు అభిప్రాయపడ్డారు.

కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు : ప్రజల అభిప్రాయం మేరకు పలు జిల్లాల్లో సరిహద్దుల మార్పులపై మంత్రి వర్గ ఉపసంఘం సూచించిన మార్పులపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూడివిజన్లుగా ఏర్పాటు చేస్తూ ఆమోద ముద్ర వేశారు. పెనుగొండ మడలాన్ని వాసవీ పెనుగొండగా మార్పునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గూడురు నియాజవర్గంలోని 3 మండలాలు నెల్లూరుకు తీసుకువచ్చారు. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి తీసుకు రావాలని ప్రజల కోరికకు క్యాబినెట్ ఆమోదతెలిపింది.

రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడపలోకి మార్చాలని క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదోనిని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆదోని- 1, ఆదోని- 2 మండలాలుగా విభజించే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ ఆదోని ప్రతిపాదన ఉందని, రాబోయే రోజుల్లో వీటిని గ్రేటర్ సిటీలుగా విభజించి అన్ని విధాలా అభివృద్ది చేస్తామని సీఎం తెలిపినట్లు మంత్రులు తెలిపారు. మెరుగైన పాలన అందించేందుకు వీలుగా సరిహద్దుల్లో పలు మార్పులు చేస్తున్నామన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు : గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చుతూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం ఆమోదముద్ర వేసింది. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డుగా పేర్లు మార్చుతూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించి అన్ని విధాలా అభివృద్ది చేయాలని నిర్ణయంచినట్లు తెలిపారు. విశాఖ - పశ్చిమ గోదావరి వరకు ఇండస్ట్రియల్ పార్క్​ల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం, తిరుపతిని ఇండస్ట్రియల్ హాబ్ గామార్చాలని నిర్ణయం, ఓర్వకల్లును పారిశ్రామిక హబ్​గా మార్చడమే లక్ష్యంగా పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్గించేందుకు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్ని విధాలా పూర్తి స్థాయిలో కసరత్తు చేశాకే కొత్త జిల్లాల ఏర్పాటు, మార్పులు చేసినట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ది, మంచి భవిష్యత్తు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్న మంత్రి ఆ దిశగానే ఏడాది కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

పీపీపీ విధానంలోనే మెడికల్ కళాశాలల నిర్మాణం : మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించే అంశంపై క్యాబినెట్లో చర్చించారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తి చేసి నాణ్యమైన విద్యను తీసుకురావాలని నిర్ణయించారు. కొత్తగా 6250 పడకలు, 1500 సీట్లు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు. పీపీపీ విధానంపై పెట్టుబడి దారులను జగన్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, జగన్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జగన్ ఎన్ని చేసినా భయపెట్టినా పెట్టుబడిదారులు ఎవరూ భయపడరని తెలిపారు. ఆదోని కళాశాలకు టెండర్ వేసిన వారితో అగ్రిమెంట్ చేసుకుంటామని, మెడికల్ కళాశాలల టెండర్ల ప్రక్రియను పొడిగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9 వరకు రాజముద్రతో కల్గిన రైతుల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని చేపట్టాలని నిర్ణయించారు. చిన్నపాటి తప్పులున్నా వెంటనే సరిచేసి అంతా కరెక్ట్​గా ఉన్న వాటినే పంపిణీ చేయాలని ఆదేశించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత సర్కారులో పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేసుకుని ప్రచారం చేసుకోగా వాటన్నింటినీ తొలగించి ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

అమరావతిలో కీలక కార్యాలయాలు - 44 అంశాలకు మంత్రివర్గం ఆమోదం

అన్నమయ్య జిల్లాలోని నియోజకవర్గాల మార్పు - జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

Last Updated : December 30, 2025 at 8:02 AM IST