మద్యం కుంభకోణం కేసు - రంగంలోకి ఐటీ!
గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం - కొల్లగొట్టిన సొత్తు మూలాలు వెలికితీయడంపై గురి - ఈడీ, సిట్ అధికారులతో సమావేశమై వివరాలపై ఆరా

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 27, 2026 at 10:47 AM IST
AP Liquor Case Updates : వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఆదాయపు పన్ను (IT) విభాగం రంగంలోకి దిగింది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును వైఎస్సార్సీపీ ముఠా డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని బహుళ అంచెలు, అత్యంత సంక్లిష్ట లావాదేవీల ద్వారా దుబాయ్ సహా పలు దేశాలకు తరలించినట్లు సిట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు (ED) దర్యాప్తులో ఇప్పటికే తేలింది.
ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను విభాగం ఈ నిధుల మూలాలను గుర్తించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో సిట్, ఈడీ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. 'మనీ ట్రయల్'కు సంబంధించిన వివరాలు వారి నుంచి తీసుకున్నారు. నిధులు మళ్లించేందుకు ఏయే కంపెనీలు, ఏయే ఖాతాలు ఉపయోగించారు? ఆ నిధులు ఎక్కడి వరకూ చేరాయి? ఆ తర్వాత అంచెల్లో విదేశాలకు, బినామీ సంస్థల్లోకి డబ్బును ఎలా మళ్లించారు? అనే అంశాలపై ఆరా తీశారు. ఈ కేసులోని నిందితులు, డొల్ల కంపెనీలు, వారి బ్యాంకు ఖాతాలు, కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ఆదాయపు పన్ను విభాగం యోచిస్తున్నట్లు సమాచారం.
రూ.3,500 కోట్లు మేర లంచాలు: మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ ముఠా రూ.3,500 కోట్ల మేర లంచాలు వసూలు చేసినట్లు సిట్, ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ మొత్తాన్ని వివిధ మార్గాల్లో దారి మళ్లించినట్లు తేలింది. వందల కొద్దీ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు, పెద్ద ఎత్తున నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు నిర్ధారణైంది.
స్థిరాస్తి రంగంలోనూ భారీ పెట్టుబడులు: స్థిరాస్తి రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు వెలుగు చూసింది. నాటి ప్రభుత్వ పెద్దల తరఫున ఈ కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డి హవాలా మార్గాల ద్వారా వందల కోట్ల రూపాయలను దుబాయ్‌కి తరలించడంలో కీలక సూత్రధారిగా వ్యవహరించారని తేలింది. తన ప్రధాన అనుచరుడైన తూకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డితో డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆ లావాదేవీలు అన్నింటి పైనా ఆదాయపు పన్ను విభాగం ఆరా తీస్తోంది.
మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును (నల్ల ధనం) వైట్‌లోకి మార్చడం, పన్ను ఎగవేత, నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా నిధులు మళ్లించడం వంటి కోణాల్లో ఆదాయపు పన్ను విభాగం వివరాలు సేకరిస్తోంది. బినామీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తోంది.
'డొల్ల కంపెనీలు - హవాలా మార్గాలు' - సినిమాను తలదన్నేలా లిక్కర్ స్కాం
సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ ముసుగులో రూ. 192 కోట్ల మళ్లింపు – సిట్ విచారణలో వెల్లడి

