ETV Bharat / state

రూ.30 వేల కోట్ల బకాయిలు ఇవ్వకపోతే భారీ ఉద్యమం తప్పదు: బొప్పరాజు

ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక డిమాండ్లు - ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి - పెండింగ్‌లో ఉన్న రూ. 30 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

AP Govt Employees Demands
AP Govt Employees Demands (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 29, 2026 at 6:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

AP Govt Employees Demands : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగ సంఘాలను అధికారికంగా చర్చలకు ఆహ్వానించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

కలెక్టర్లకు వినతిపత్రాల వెల్లువ : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిని బొప్పరాజు వెంకటేశ్వర్లు కలిశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ ఆమెకు వినతిపత్రం సమర్పించారు.

రూ. 30 వేల కోట్ల బకాయిలు ఇవ్వకపోతే భారీ ఉద్యమం తప్పదు : బొప్పరాజు (ETV)

రాష్ట్ర ప్రభుత్వం ముందు బొప్పరాజు పలు కీలక డిమాండ్లను ఉంచారు. 'గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు సంబంధించి సుమారు రూ. 30 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి చెల్లింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ (వేతన సవరణ సంఘం) ఇచ్చేందుకు తక్షణమే కమిషన్‌ను నియమించాలి. పీఆర్సీ నివేదిక వచ్చి అమలు జరిగే వరకు, ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కరవు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలి. ఉద్యోగులకు రావాల్సిన లీవ్ ఎరియర్స్, సరెండర్ లీవ్ నగదును తక్షణమే విడుదల చేయాలి' అని కోరారు.

"ఐదు డీఏలు సుమారుగా 10 శాతం పైన 100కి 10 రూపాయల పైన ఈరోజు ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక, అది కాకుండా ఈ రెండు సంవత్సరాల నుంచి ఆ డీఏలకి ఏరియర్స్ కింద ఎన్ని వేల కోట్లు రావాలో లెక్కేయండి, ఇవి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి. ఇంతవరకు ప్రకటన లేదు, ఏరియర్స్ సంగతి లేదు. అదేవిధంగా మూడు సంవత్సరాల క్రితం నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ, ఈరోజుకు ఆ పీఆర్సీ కమిషన్ నియామకం కూడా లేదు. 'మేము అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తాం' అని చెప్పినటువంటి ప్రభుత్వం, ఆ ఊసే ఇప్పుడు ఎత్తడం లేదు. ​ఈరోజు ఒక్క సరెండర్ లీవ్ కూడా పోలీసులయితే చాలా బాధపడేటువంటి పరిస్థితి. దాదాపు 7 వేల కోట్ల పైచిలుకు సరెండర్ లీవ్ల బకాయిలు ఉన్నాయంటే ఆలోచించండి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిల లెక్కలు చెప్పట్లేదు. ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో చెప్పమంటే చెప్పరు. ఈ ప్రభుత్వ హయాంలో మీరు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఏ ఒక్క ప్రయోజనానికి కూడా మాకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో చర్చించినటువంటి దాఖలాలు కూడా లేవు." -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్

సన్నాహక సభల షెడ్యూల్ : ఆర్థికపరమైన ఇబ్బందులతో రాష్ట్రంలోని ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని బొప్పరాజు తెలిపారు. వారిని పోరాటానికి సన్నద్ధం చేసేందుకు ఏపీ జేఏసీ అమరావతి కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. జూలై 12వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో 'ఉద్యమ సన్నద్ధత తొలి సభ'ను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత జూలై 21న అనంతపురంలో రెండో సభను నిర్వహించేందుకు ప్లాన్ చేశామన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సన్నాహక సభలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ఏపీ ఎన్జీవోలతో పాటు కలిసివచ్చే ఇతర అన్ని ఉద్యోగ సంఘాలను ఏకం చేస్తామన్నారు.

'బకాయిలు అన్నీ అడగట్లేదు - పదవీ విరమణ చేసిన వారివి ముందు చెల్లించండి'

జీతాల విషయంలో ఇప్పుడా పరిస్థితి లేదు- వెంటనే పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించాలి