ETV Bharat / state

మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లేదు - గుంటూరు పోలీసుల వైఫల్యంపై హైకోర్టు ఆశ్చర్యం

గుంటూరు పట్టాభిపురం పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనడంలో విఫలం కావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు - ఇది నిస్సందేహంగా పోలీసుల వైఫల్యమేనని స్పష్టం

గుంటూరు పోలీసుల వైఫల్యంపై హైకోర్టు ఆశ్చర్యం
గుంటూరు పోలీసుల వైఫల్యంపై హైకోర్టు ఆశ్చర్యం (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 3, 2026 at 10:37 AM IST

2 Min Read
Choose ETV Bharat

High Court On Missing Minor Girl Guntur : షేక్ జాన్ సైదా (రబ్బానీ) అనే వ్యక్తి 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను తీసుకెళ్లి మూడు నెలలు గడిచినా, గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఆమె ఆచూకీని కనుగొనడంలో విఫలం కావడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది నిస్సందేహంగా పోలీసుల వైఫల్యమేనని స్పష్టం చేసిన కోర్టు, అటువంటి పోలీసు సిబ్బంది ఉండటం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది.

గురువారం తమ ముందు హాజరుపరచాలి : సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలించేందుకు ఠాణాకు వెళ్లిన ఏపీ ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావును అడ్డుకున్న ఘనత "గుంటూరు జిల్లా పోలీసులు గ్రేట్‌" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కనిపించకుండా పోయిన బాలికను గురువారం తమ ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ తుహిన్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులిచ్చింది.

హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ : గుంటూరులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదని, ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ తండ్రి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. షేక్‌ జాన్‌ సైదా ఇన్‌స్టా ద్వారా పరిచయమై ట్రాప్‌ చేసి తన కుమార్తెను తీసుకెళ్లాడని దీనిపై పట్టాభిపురం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మూడు నెలలవుతున్నా తన కుమార్తె ఆచూకీ కనిపెట్టలేదని పేర్కొన్నారు.

కోర్టుకు నమ్మకం లేదు : పిటిషనర్‌ తరఫున న్యాయవాది డీవీ శశిధర్‌ వాదనలు వినిపిస్తూ బాలికను సైదా ఎక్కడికి తీసుకెళ్లాడో పోలీసులకు తెలిసినా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టడం లేదన్నారు. పోలీసులు బాలిక కోసం మూడు రాష్ట్రాల్లో గాలించారన్న ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) కృష్ణ ప్రణీత్‌ వాదనల్ని ధర్మాసనం తోసిపుచ్చింది. బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది. అయితే డీజీపీకి కాకుండా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీచేయాలని ఏజీపీ కోరగా ఎస్పీ, ఎస్‌హెచ్‌వోలపై కోర్టుకు నమ్మకం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఏం జరిగిందో తేల్చారా? : వాదనలు జరుగుతుండగా ధర్మాసనం జోక్యం చేసుకుని, "ఫిర్యాదు జూన్‌లోనే నమోదైంది. అప్పటి నుంచి ఏం చర్యలు తీసుకున్నారు? ఆ అమ్మాయి తనంతట తానే వెళ్లిపోయిందా? లేక అపహరణకు గురైందా? ఎవరికైనా అమ్మేశారా? ఏం జరిగిందో తేల్చారా?" అని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ సహాయ న్యాయవాది స్పందిస్తూ, పోలీసులు మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారని, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లారని తెలిపారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు చేస్తున్న తీవ్ర ప్రయత్నాల గురించి ఆయన వివరిస్తుండగా, అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఇంత సమయం పట్టేది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మద్యం కుంభకోణం కేసు - నిందితుడు షేక్‌ సైఫ్‌ అహ్మద్‌ను లొంగిపోవాలన్న ఏసీబీ కోర్టు

అమరావతి ఎకనమిక్‌ రీజియన్​కి మాస్టర్​ ప్లాన్ - 9 జిల్లాల్లో ఒకే ఆర్థికవ్యవస్థ