ETV Bharat / state

'మిమ్మల్ని ఎలా డీల్‌ చేయాలో మాకు తెలుసు' - విద్యాశాఖాధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

కేజీబీవీ టీచర్ల పోస్టింగ్‌పై విచారణ - ఎస్‌ఎస్‌ఏ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు

High Court Serious on Education Department Officials
High Court Serious on Education Department Officials (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 9:13 AM IST

3 Min Read
Choose ETV Bharat

High Court Serious on Education Department Officials: ''ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానంతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా? అదే మీ ఆలోచన అయితే మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసని'' హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల అమలులో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. శక్తిమంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్లు కనబడుతోందని వ్యాఖ్యలు చేసింది.

విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను, ఉన్నతాధికారులు కోర్టుకిచ్చిన హామీలను దిగువస్థాయి సిబ్బంది తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చింది. సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఈ మేరకు నోటీసులు జారీచేస్తూ ఫిబ్రవరి 4న స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్‌, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

విజయనగరం ఏపీడీ చర్యల ఫలితం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్‌టైమ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌గా పనిచేస్తున్న తమను తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు 2023లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి వారిని తొలగించిన స్థానంలో కొనసాగించాలని ఆదేశించారు. ఒప్పందం ముగిశాక కూడా వారిని పీజీటీలుగా కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని 2023 డిసెంబర్‌లో ఉత్తర్వులిచ్చారు.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అధికారులు కోర్టులో అప్పీల్‌ చేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది జై భీమారావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇటీవల ప్రభుత్వ న్యాయవాది ఇదే ధర్మాసనం ముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ విజయనగరం అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. విద్యాశాఖ జీపీ గుర్రం రామచంద్రరావు స్పందిస్తూ కోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేయాలని సర్వశిక్ష అభియాన్‌ పీడీ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. విజయనగరం అదనపు పీడీ చర్యలకు రాష్ట్ర పీడీని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆదేశాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని వాటిని అమలయ్యేలా చూడాల్సింది రాష్ట్ర పీడీయేనని స్పష్టం చేసింది.

మరోవైపు గ్రూప్-2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్ట్ ధర్మాసనం కొట్టి వేసింది. గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్​లో క్రీడాకారులు, మహిళలు, దివ్యాంగులతో పాటు మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టేసింది. 2023 డిసెంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్​ని రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన సంగతి తెలిసిందే.

సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్​ని నిర్ణయించి గూప్-2 పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యాల పై విచారణ జరిపింది. హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఇప్పుడు నిర్ణయం వెల్లడిస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. గ్రూప్‌-2 పరీక్షలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా వాటన్నిటినీ అధిగమించి పరీక్షను యథాతథంగా షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని గతంలో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని గతంలో ఏపీపీఎస్సీకి ప్రభుత్వం లేఖ రాసింది. దీని పై స్పందించిన ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పరీక్షలు వాయిదా వేయలేమని అప్పట్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరీక్షలను వాయిదా వేస్తే అభ్యర్థుల మానసికస్థితి పై ప్రభావం చూపిస్తుందన్న వివరించింది.

గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లును కొట్టివేసిన హైకోర్టు

సంక్షేమ హాస్టళ్లలో బాలల మృతి ఆందోళనకరం - వైద్యారోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు