ETV Bharat / state

​రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు ఊరట - జీపీఎఫ్‌ బకాయిలు చెల్లించాల్సిందేనని కీలక ఆదేశాలు

ఆస్తులు, అప్పుల పంపకాల వివాదంతో రిటైర్మెంట్ ప్రయోజనాలు ఆపడం సరికాదన్న ఏపీ హైకోర్టు - రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావు - అది ఉద్యోగుల హక్కు అని జస్టిస్ నిమ్మగడ్డ వ్యాఖ్యలు

రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు ఊరట
రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు ఊరట (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 30, 2026 at 12:00 PM IST

4 Min Read
Choose ETV Bharat

AP HC Orders TSHB : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన వివాదం ఇంకా పరిష్కారం కాలేదనే కారణంతో ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు నిలిపివేయడం సరికాదని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. ఉమ్మడి హౌసింగ్‌ బోర్డుకి చెందిన 96% ఆస్తులు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌(టీఎస్‌హెచ్‌బీ) ఆధీనంలో ఉన్నందున పిటిషనర్లకు ఇవ్వాల్సిన విభజనకు పూర్వపు జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌) బ్యాలెన్స్‌ బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత టీఎస్‌హెచ్‌బీపైనే ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్లకు రావాల్సిన జీపీఎఫ్‌ బకాయిలను వడ్డీతో ఎనిమిది వారాల్లో చెల్లించాలని టీఎస్‌హెచ్‌బీని ఆదేశించింది.

ఎనిమిది వారాల్లో సొమ్ము చెల్లించకపోతే, పదవీ విరమణ తేదీ నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ ఆదేశాల మేరకు చేసే చెల్లింపులను రెండు రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య జరిగే ఆస్తులు, అప్పుల విభజన సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 47(4), 71 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య హౌసింగ్‌ బోర్డు ఆస్తులు-అప్పుల విభజనకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

'ప్రయోజనాలు నిలిపివేయడం సరికాదు' : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన వివాదం ఇంకా పరిష్కారం కాలేదనే కారణంతో ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు నిలిపివేయడం సరికాదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులకు అందించే పదవీ విరమణ ప్రయోజనాలు దాతృత్వం, ఉదారత, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కాదని తెలిపింది.

ఏళ్ల తరబడి సేవలు అందించి ఉద్యోగులు సంపాదించుకున్న విలువైన హక్కు అని స్పష్టం చేసింది. సర్వీసు కాలంలో పొందిన వేతనం నుంచి క్రమం తప్పకుండా మినహాయించిన సొమ్మును పీఎఫ్‌లో జమ చేస్తారు. పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీతో సహా పొందే హక్కు ఉద్యోగికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని హైకోర్టు గుర్తుచేసింది.

ప్రస్తుత కేసులోని అంశాలు అందోళన కలిగించేలా ఉన్నాయని, నాలుగు దశాబ్దాలకు పైగా సేవలు అందించి చాలా ఏళ్ల కిందట పదవీ విరమణ చేసిన పిటిషనర్లు తమ జీతాల నుంచి మినహాయించిన సొమ్మును రాబట్టుకునేందుకు కోర్టు తలుపులు తట్టే పరిస్థితి కల్పించడం బాధాకరమని కోర్టు తెలిపింది. ఉద్యోగులకు చట్టబద్ధంగా దక్కాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను అనవసర జాప్యం లేకుండా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు : ఉమ్మడి ఏపీ హౌసింగ్‌ బోర్డులో దాదాపు 32 నుంచి 35 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించి, విభజన అనంతరం ఏపీ హౌసింగ్‌ బోర్డుకి కేటాయించిన పలువురు ఉద్యోగులు 2018-2020 మధ్య కాలంలో పదవీ విరమణ చేశారు. వారికి రావాల్సిన పూర్తి జీపీఎఫ్‌ సొమ్ము అందకపోవడంతో 2021, 2022 సంవత్సరాల్లో హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యాలపై విచారణ పెండింగ్‌లో ఉండగా ఏపీహెచ్‌బీలో పనిచేసిన కాలానికి జీపీఎఫ్‌ సొమ్ము అందుకున్నారు.

ఉమ్మడి హౌసింగ్‌ బోర్డులో పనిచేసిన కాలానికి సేకరించిన జీపీఎఫ్‌ నిధులను హైదరాబాద్‌ బ్యాంక్‌లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజనకు ముందు సేకరించిన రూ.8.77 కోట్ల జీపీఎఫ్‌ సొమ్ము టీఎస్‌హెచ్‌బీ ఆధీనంలోనే ఉందన్నారు. ఆ సొమ్మును బదిలీ చేయాలని లేఖలు రాసినా స్పందన లేదన్నారు. టీఎస్‌హెచ్‌బీ తరఫు న్యాయవాది ఈ వాదనలను తోసిపుచ్చారు. పిటిషనర్లు ఏపీహెచ్‌బీలో పనిచేసి ఏపీలో పదవీ విరమణ చేశారన్నారు.

96 శాతం ఆస్తులు : వారికి సంబంధించిన జీపీఎఫ్‌ ఖాతాలను ఏపీహెచ్‌బీ నిర్వహిస్తోందన్నారు. పిటిషనర్లకు చెల్లించాల్సిన జీపీఎఫ్‌ బకాయిల బాధ్యతను టీఎస్‌హెచ్‌బీపై ఏపీహెచ్‌బీ మోపడం సరికాదన్నారు. ఈ కేసు విచారణలో కోర్టుకు సహాయకులుగా ఉండేందుకు నియమితులైన అమికస్‌ క్యూరీ, న్యాయవాది పదిరి రవితేజ కోర్టుకు నివేదిక ఇస్తూ ఉమ్మడి బోర్డుకు చెందిన 96 శాతం ఆస్తులు టీఎస్‌హెచ్‌బీ ఆధీనంలో ఉన్నాయన్నారు. ఆస్తులను అనుభవిస్తున్న సంస్థే బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందన్నారు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును ప్రస్తావించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ బోర్డు విభజన అనంతరం పింఛను చెల్లింపు వ్యవహారంలో ఏర్పడిన వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హౌసింగ్‌ బోర్డుకు చెందిన దాదాపు 96% ఆస్తులు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వద్దే ఉన్నాయని తీర్పులో పేర్కొంది. ఆస్తుల ప్రయోజనాలను పొందుతూ బాధ్యతల నుంచి టీఎస్‌హెచ్‌బీ తప్పుకోవడానికి వీల్లేదని తెలిపింది.

రూ.8.77 కోట్ల జీపీఎఫ్‌ నిధులు : ఆస్తులు, అప్పులు రెండు రాష్ట్రాల హౌసింగ్‌ బోర్డుల మధ్య పంపిణీ జరిగే వరకు ఆస్తులను అనుభవిస్తున్న సంస్థ ఆయా బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని 'ఆర్‌.సుమతి' కేసులో తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఏపీహెచ్‌బీకి కేటాయించిన ఉద్యోగులకు చెందిన సుమారు రూ.8.77 కోట్ల జీపీఎఫ్‌ నిధులు ప్రస్తుత టీఎస్‌హెచ్‌బీ నియంత్రణలోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం, ఏపీహెచ్‌బీ తరఫు న్యాయవాదులు మా దృష్టికి తెచ్చారని తెలిపింది.

ఏపీ విభజన చట్టం ప్రకారం అపాయింటెడ్‌ డే ముగిసి పదేళ్లు దాటినప్పటికీ ఉమ్మడి హౌసింగ్‌ బోర్డుకు చెందిన ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాకపోవడాన్ని విస్మరించడానికి వీల్లేదంది. పంపకాల్లో జరుగుతున్న జాప్యాన్ని సాకుగా చూపిస్తూ, ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను నిరవధికంగా నిలిపివేయడాన్ని అంగీకరించలేమని తెలిపింది. పరిపాలనాపరమైన జాప్యాలు, విభజన వివాదాల కారణంగా ఉద్యోగులను బాధితులుగా మార్చడం సరికాదని స్పష్టం చేసింది.

సంస్థల మధ్య చోటు చేసుకున్న అంతర్గత వివాదాల కంటే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల హక్కులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు పూర్వం, పిటిషనర్లకు రావాల్సిన జీపీఎఫ్‌ బ్యాలెన్స్‌ బాకాయిలను చెల్లించాలని టీఎస్‌హెచ్‌బీని ఆదేశిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు.

డిప్యూటీ స్పీకర్‌ రఘురామపై ఫిర్యాదు - కేసు నమోదులో నిబంధనలు పాటించాలన్న హైకోర్టు

సర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి - హైకోర్టులో వైఎస్సార్‌సీపీ పిల్‌