ETV Bharat / state

డేటా సెంటర్​కి సింహాచలం భూములు - నోటీసులు ఇచ్చిన హైకోర్టు

పిల్​ దాఖలు చేసిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ - ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ - కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం

Ap High Court Issues Notices To Govt On Simhachalam Temple
Ap High Court Issues Notices To Govt On Simhachalam Temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 10:51 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ap High Court Issues Notices To Govt On Simhachalam Temple : సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని 'హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్'కు బదిలీ చేయడంపై పర్యావరణవేత్త, 'జల్ బిరాదరి' జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, పర్యావరణ దేవాదాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ కార్యదర్శి, పీసీబీ (PCB), ఏపీఐఐసీ (APIIC), దేవాదాయ శాఖ కమిషనర్, జీవీఎంసీ (GVMC) కమిషనర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, న్యాయమూర్తి చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది . ఈ భూ కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.

విశాఖపట్నం రూరల్ మండలంలోని అడవివరం, ముదసర్లోవ గ్రామాల పరిధిలో ఉన్న సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని, పర్యావరణ పరిరక్షణ నిబంధనలను ఉల్లంఘించి సదరు కంపెనీకి బదిలీ చేశారని ఈ పిటిషన్‌లో ఆరోపించారు. పిటిషనర్ తరపున వాదించిన న్యాయవాది చల్లా అజయ్ కుమార్, ఈ భూ బదిలీ దేవాదాయ చట్టంలోని సెక్షన్ 80(1)(b)కి విరుద్ధమని పేర్కొన్నారు. డేటా సెంటర్ కోసం ప్రతిపాదించిన స్థలం కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి కేవలం 860 మీటర్ల దూరంలోనే ఉందని ఆయన తెలిపారు. ఆ భూములను తిరిగి సింహాచలం దేవస్థానానికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.

అభ్యంతరాలు ఉంటే ఎన్‌జీటీ (NGT)ని ఆశ్రయించండి : రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూ బదిలీ విషయంలో పిటిషనర్‌కు అపోహ ఉందని పేర్కొన్న ఆయన, ఆ భూమిని లీజు ప్రాతిపదికన డేటా సెంటర్ పార్క్ కోసం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులు భూ కేటాయింపులను ఒకే పిటిషన్‌లో సవాలు చేయలేమని ఆయన వాదించారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి అనుమతులు మంజూరు చేశారనే ఆందోళనలు ఉంటే, ఆ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ముందు సవాలు చేయాలని ఆయన తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆయన సమయం కోరారు.