ETV Bharat / state

'న్యాయమూర్తుల కళ్లకు గంతలు కట్టలేరు' - మండిపడిన హైకోర్టు

వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని నివాస గృహం కోసమంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నం - అధికారికి రూ.2.5 లక్షలు, భవన యజమానులకు రూ.2.5 లక్షలు జరిమాన విధించిన ధర్మాసనం

AP High Court
AP High Court (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 28, 2025 at 1:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

AP High Court on Bhimavaram Municipality: న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టి ఉండొచ్చు, కానీ న్యాయమూర్తుల కళ్లకు గంతలు కట్టలేరంటూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని నివాస గృహం కోసమంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురపాలక సంఘం అప్పటి కమిషనర్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించినందుకు గాను ఖర్చుల కింద రూ.2.5 లక్షల సొంత సొమ్ము చెల్లించాలని కమిషనర్‌ను, మరో రూ.2.5 లక్షలు చెల్లించాలని భవన యజమానులను ఆదేశించింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అంధులు, బధిరుల సంక్షేమం కోసం వినియోగించాలని స్పష్టం చేసింది.

అనుమతులను రద్దు చేయడం లేదు: వాణిజ్య నిర్మాణం కోసం ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ నుంచి ఆ నిర్మాణానికి 2024లో అనుమతులు పొందారని ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం నివాస జోన్‌ నుంచి వాణిజ్య జోన్‌గా మార్చుతూ నోటిఫికేషన్‌ ఇచ్చినందున వాణిజ్య అనుమతులను రద్దు చేయడం లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 8న ఈ మేరకు తీర్పునిచ్చింది.

మాల్‌ తరహాలో వాణిజ్య నిర్మాణం: టీఎస్‌వీఎస్‌ఎన్‌ఆర్‌ మణిమంజరి, టీసీహెచ్‌వీ నరసింహారావు భీమవరం పురపాలక సంఘ పరిధిలోని సర్వే నంబరు 99/5, 99/6లో నివాస గృహ నిర్మాణానికి మున్సిపాల్టీ నుంచి 2022 ఫిబ్రవరిలో అనుమతి తీసుకొని షాపింగ్‌ మాల్‌ తరహాలో వాణిజ్య నిర్మాణం చేస్తున్నారంటూ శ్రీనివాస్‌కుమార్‌ వర్మ గతంలో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తమ నిర్మాణం సక్రమమేనని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని మణిమంజరి, నరసింహారావు వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ఖర్చుల కింద రూ.50 వేలు చీఫ్‌ జస్టిస్‌ రిలీఫ్‌ ఫండ్‌కు చెల్లించాలని మణిమంజరి, నరసింహారావులను ఆదేశించారు.

అప్పీల్‌ దాఖలు చేసిన శ్రీనివాస్‌కుమార్‌ వర్మ: దీనిపై శ్రీనివాస్‌కుమార్‌ వర్మ దాఖలు చేసిన అప్పీల్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ నిర్మాణ ఫొటోలను పరిశీలిస్తే వాణిజ్య అవసరాల కోసం నిర్మిస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. భీమవరం మున్సిపాల్టీ అప్పటి కమిషనర్‌ మాత్రం నివాస గృహంగా పేర్కొంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది. సింగిల్‌ జడ్జి విధించిన రూ.50 వేల ఖర్చులను రూ.5 లక్షలకు పెంచుతూ తీర్పును సవరించింది.

కల్తీ నెయ్యి సరఫరా చేసినా మీరెందుకు గుర్తించలేదు - భూమనను ప్రశ్నించిన సిట్

రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలంటూ నిరసనలు - ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం