ETV Bharat / state

దర్గప్పకు వైద్య పరీక్షలు నిర్వహించండి - కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశం

దర్గప్పకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు - వైద్య నివేదికలను తమ ముందు ఉంచాలన్న న్యాయస్థానం - కర్నూలు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశం - హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్గప్ప

AP HC on Dargappa Case
AP HC on Dargappa Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 24, 2026 at 10:37 AM IST

3 Min Read
Choose ETV Bharat

Dargappa Case Updates in AP : హత్య కేసులో నిందితుడిగా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన బేగరి దర్గప్పను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసిన మెజిస్ట్రేట్‌ దానిని సీల్డ్‌ కవర్​లో ధర్మాసనం ముందు ఉంచారు. మంగళవారం నాడు జరిగిన విచారణలో ఆ నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. మరోవైపు దర్గప్పకు సంబంధించిన మొత్తం వైద్య నివేదికలను బుధవారానికి సీల్డ్‌ కవర్​లో తమ ముందు ఉంచాలని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో దర్గప్ప జైల్లో ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు స్పష్టంచేసింది. ఒకవేళ వైద్య చికిత్స అవసరమని భావిస్తే ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందించాలని పేర్కొంది. తాజా వైద్య నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన మాల గంగమ్మ కుమారుడు వీరేంద్ర(వీరేశ్‌) 2024 నవంబర్​లో అదృశ్యమయ్యాడు. తన కుమారుడ్ని కనుగొనే వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ గంగమ్మ 2025 ఏప్రిల్‌లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ ఏడాది మేలో విచారణ జరిపిన న్యాయస్థానం వీరేంద్రను కనుగొనేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. దీంతో సిట్‌ను ఏర్పాటు చేశారు.

AP HC on Gangamma Case : దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ తల్లి గంగమ్మ, బంధువు బేగరి దర్గప్ప మధ్యనున్న వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తున్నాడనే కారణంతో వారిరువురు కలిసి వీరేంద్రను హత్య చేశారని తేల్చింది. వారిపై కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గంగమ్మ, దర్గప్పను తీసుకెళ్లి చిత్ర హింసలకు గురిచేశారని, ఈ క్రమంలో గంగమ్మ చనిపోయిందని సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన కాసుకుర్తి ఆగమన్‌ రాజ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. మరోవైపు గంగమ్మను చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో కీలక సాక్షిగా ఉన్న దర్గప్ప ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతని వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరారు.

ఈ పిల్​పై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు మెజిస్ట్రేట్‌తో దర్గప్ప వాంగ్మూలం నమోదు చేసి ఆ వివరాలను తమకు పంపాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన విచారణలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ప్రణతి వాదనలు వినిపించారు. దర్గప్పను హాజరుపరచగా అతడి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేశారని హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడిషియల్‌ కస్టడీలో కర్నూలు జైల్లో ఉన్నారని వివరించారు. దర్గప్ప ఆరోగ్యం బాగానే ఉందని న్యాయస్థానానికి తెలియజేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ మృతురాలు గంగమ్మ పోస్ట్​మార్టం రిపోర్ట్​లో గాయాలతో ఆమె మృతి చెందినట్లు పేర్కొన్నారని హైకోర్టుకు తెలిపారు. ఆ రిపోర్ట్​ను న్యాయస్థానం ముందు ఉంచేలా ఆదేశించాలని కోరారు. మరోవైపు గంగమ్మ కుమార్తె అందుబాటులో లేదని, ఫోన్‌ స్విచ్‌ చేసి ఉందని వివరించారు. ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఎస్‌జీపీ ప్రణతి స్పందిస్తూ పిటిషనర్‌ కోర్టును తప్పుదోవపట్టిస్తున్నారని తెలిపారు. పిటిషనర్‌ కర్నూలుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని ఆయనకు వాస్తవాలు తెలియవన్నారు. గంగమ్మ కుమార్తె స్వగ్రామంలోనే ఉన్నారని హైకోర్టుకు తెలియజేశారు.

కుమారుడిని చంపి మిస్సింగ్‌ అంటూ డ్రామా - ఏడాదిన్నర తర్వాత గుట్టురట్టు!

కల్యాణదుర్గం ఈ-స్టాంప్‌ వ్యవహారంపై విచారణ - సీఐడీ దర్యాప్తు పురోగతి నివేదిక కోరిన హైకోర్టు