ETV Bharat / state

పరకామణి కేసు - టీటీడీ అధికారులు, పోలీసులు నిబంధనలు పాటించలేదు: హైకోర్టు

పరకామణి కేసులో మరోసారి హైకోర్టు కీలక వ్యాఖ్యలు - రవికుమార్, కుటుంబసభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వెల్లడి - టీటీడీ, సెక్యూరిటీ అధికారులు, పోలీసులు నిబంధనలు పాటించలేదని ఆగ్రహం

High_Court_on_Parakamani_case
High_Court_on_Parakamani_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 8, 2026 at 7:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Court Comments on Parakamani Theft Case: పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్​తో కుమ్మక్కై కేసును టీటీడీ, పోలీసు అధికారులు బలహీనపర్చారని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఐడి, ఏసీబీ నివేదికల్లో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు స్పష్టం అవుతోందని న్యాయస్థానం తెలిపింది. రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగి పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. రవికుమార్ ఆస్తులు స్వీకరించే సమయంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు, పోలీసులు,సెక్యూరిటీ అధికారులు చట్టనిబంధనలు అనుసరించలేదని తెలిపింది. పరకామణి ఘటనలో సీఐడీ, ఏసీబీ డీజీలు చట్టనిబంధనల మేరకు నడుచుకునేందుకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది.

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీసు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఏవీఎస్వి సతీష్ కుమార్ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్ షీట్ దాఖలు చేసేవరకు దర్యాప్తును పర్యవేక్షిస్తామని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారం ముందుకెళ్లాలని సీఐడీ, ఏసీబీకి ఉత్తర్వులు ఇచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం కానుకల లెక్కింపు విధానాన్ని ఆధునికరించేందుకు మెరుగైన ఆలోచనలతో ముందుకురావాలని టీటీడీ ఈవోకు హైకోర్టు ఆదేశించింది.

లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలి: తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కానుకల లెక్కింపుపై గతంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించాలని టీటీడీని ఆదేశించింది. ఏఐ, అత్యాధునిక యంత్రాలను వినియోగించాలని సూచించింది. దొంగతనాలను అరికట్టేందుకు రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేసింది.

హుండీ సీలింగ్‌, రవాణా, లెక్కింపులో భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కానుకలను వర్గీకరించడంతో పాటు విదేశీ కరెన్సీని గుర్తించేందుకు ఏఐని ఉపయోగించాలని సూచించింది. విలువైన లోహాలను వేరు చేసే అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనిపై 8 వారాల్లోపు ముసాయిదా రూపొందించి సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన హుండీ కానుకల లెక్కింపు కేంద్రం పరకామణిలో దొంగతనం కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు, సూచనలు చేసిన విషయం తెలిసిందే. విరాళాల లెక్కింపులో అవకతకవలు అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఇది కోట్ల మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా అభిప్రాయపడింది. పరకామణిలో జరిగిన నేరం దొంగతనం కంటే మించిందనే భావనను వ్యక్తం చేసింది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలను ఎంత మాత్రం ఉపేక్షించలేమని స్పష్టం చేసింది.

పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశం: మరోవైపు ఏప్రిల్ 2023లో టీటీడీకి చెందిన ఒక మఠం ఉద్యోగి సి.వి. రవికుమార్ పరకామణి హాల్‌లో సుమారు 900 అమెరికన్ డాలర్లను దొంగిలిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ దొంగతనం కేసులో విచారణ జరపకుండానే, నిందితుడు రవికుమార్ తిరుపతి - చెన్నైలోని తనకున్న 7 ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చేలా సెప్టెంబర్ 2023లో లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిర్చారు. ఈ రాజీ వెనుక ఉన్న అక్రమాలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ, ఏసీబీ దర్యాప్తు చేపట్టాయి. 2 సంస్థలకు కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

'పరకామణి కేసు దొంగతనం కంటే పెద్ద నేరం' - ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

'మహాపాపం చేశా - ఏడవని రోజు లేదు' - పరకామణి కేసు నిందితుడు రవికుమార్‌