విద్యార్థిగా ఉన్నప్పుడే పచ్చదనం, పర్యావరణంపై ఆసక్తి కనబరిచేవాడిని: ఏపీ గ్రీన్ బోర్డు ఛైర్మన్ నాగబాబు
చిలకలూరిపేటలో 'వన సంక్షేమం - జన సంక్షేమం' కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు - ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మొక్కలు నాటిన నాగబాబు - చిలకలూరిపేటలో పచ్చదనం పెంపు కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 2, 2026 at 8:36 PM IST
MLC Nagababu Planted Saplings With Students in Chilakaluripet : విద్యార్థిగా ఉన్నప్పుడే పచ్చదనం, పర్యావరణంపై మిక్కిలి ఆసక్తి కనబరిచేవాడినని, రాజకీయాల్లోకి రాకముందు గుంటూరు, విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై యువతతో చర్చించి వారిలో అవగాహన పెంచేవాడినని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఆ విభాగం తరుపున పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం ఆర్.వీ.ఎస్, సీ.వీ.ఎస్ హైస్కూల్లో నేడు(బుధవారం) నిర్వహించిన 'వన సంక్షేమం - జన సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
అనంతరం విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి తమకు ఇచ్చిన మొక్కను తమ ఇంటి ఆవరణం, ఖాళీ ప్రదేశాల్లో నాటి సంరంక్షించాలని సూచించారు. ఆర్.వీ.ఎస్, సీ.వీ.ఎస్ హైస్కూల్లో కార్యక్రమానంతరం ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి నివాసంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన నాగబాబు, పవన్ కల్యాణ్ తరుపున ఆయన అభిమానులు, కూటమి శ్రేణులకు ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.
ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం : ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ, విద్యార్ధిగా ఉన్నప్పుడే పచ్చదనాన్ని బాగా ఇష్టపడేవాడినని, రాజకీయాల్లోకి రాకముందు గుంటూరు, విజయవాడ వచ్చినప్పుడు స్థానిక యువతతో పర్యావరణ పరిరక్షణపై చర్చించి, వారి అభిప్రాయాలు తెలుసుకొని పచ్చదనం ఆవశ్యకతపై వారిలో అవగాహన పెంచేవాడినని తెలిపారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటానని, రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని నాగబాబు చెప్పారు. నేడు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం, వారితో నా ఆనందాన్ని పంచుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన చెప్పారు.
పచ్చదనం కనుమరుగై, మొక్కలనేవి లేకపోతే భూమి మార్స్లా తయారవుతుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ సందర్భంగా మా తరం పచ్చదనం పెంపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నేను విద్యార్థులకు (భవిష్యత్ తరాలు) సభాముఖంగా బహిరంగక్షమాపణలు చెబుతున్నానని నాగబాబు అన్నారు. స్వార్థపూరిత మనుషుల ఆలోచనా విధానమే పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతోందని, మొక్కలు, ముఖ్యంగా చెట్లు మన జీవితంలో ఒక భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.
రూ.3 కోట్లతో చిలకలూరిపేటలో ప్రత్యేకంగా పచ్చదనం : ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా తనకు అప్పగించిన ప్రధాన బాధ్యత భావితరాలకు పచ్చని రాష్ట్రాన్ని కానుకగా ఇవ్వడమేనని ఆయన తెలియచేశారు. రూ.3 కోట్లతో చిలకలూరిపేటలో ప్రత్యేకంగా పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటామని, ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేస్తామని నాగబాబు హామి ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని ఒక వివాహ వేడుకలో కలిశానని, మొదట్లో ఆయన చాలా గంభీరంగా ఉంటారని భావించానని, ఒక్కసారి మాట్లాడాక ఆయన స్నేహపూర్వక అభిమానం, ఆత్మీయత తెలిశాయని నాగబాబు పేర్కొన్నారు. నేటి కార్యక్రమంలో ఆయనతో కలిసి పాల్గొనడం మంచి అనుభూతిని కలిగించిందన్నారు. అలాగే ఆర్.వీ.ఎస్ & సీ.వీ.ఎస్ హైస్కూల్ అభివృద్ధి వెనక ఐఏఎస్ అధికారి కృష్ణతేజ కుటుంబ సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని, ఈ పాఠశాల అంటే కృష్ణతేజకు ఎంతో ఇష్టమని నాగబాబు తెలిపారు. పాఠశాల విద్యార్థులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని తమకు నచ్చిన రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు.
రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే పవన్ కల్యాణ్‌తో సినిమా : ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిలకలూరిపేటలో ఏపీ గ్రీన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన తొలి కార్యక్రమానికి ఛైర్మన్ హోదాలో నాగబాబు విచ్చేయడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. రాష్ట్రం మొత్తం పచ్చదనం నిండేలా, సముద్ర తీరప్రాంతాల పరిరక్షణకు పవన్ కల్యాణ్ చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలన్నారు.
పవన్ కల్యాణ్ సహకారంతో, పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి మైలవరపు కృష్ణతేజ ఆర్.వీ.ఎస్ & సీ.వీ.ఎస్ హైస్కూల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రత్తిపాటి కొనియాడారు. నాగబాబు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారని, మెగా కుటుంబాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని, పవన్ కల్యాణ్ కు లభిస్తున్న ఆదరణే అందుకు నిదర్శనమని ప్రత్తిపాటి తెలిపారు. రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే పవన్ కల్యాణ్‌తో సినిమా నిర్మించి, నిర్మాతగా కొనసాగేవాడినని ప్రత్తిపాటి చెప్పారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్.వీ.ఎస్ & సీ.వీ.ఎస్ హైస్కూల్లో నేడు నాటిన మొక్కలన్నీ పెరిగి పెద్దవైతే ఈ ప్రాంగణం మొత్తం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌ను తలపిస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం: గ్రీన్ బోర్డ్ ఛైర్మన్ నాగబాబు
వర్షపు నీటిని ఒడిసిపట్టేలా కందకాలు తవ్వడం అభినందనీయం: ఎమ్మెల్సీ నాగబాబు

