ETV Bharat / state

ఏపీ మున్సిపాలిటీల సమూల ప్రక్షాళన - రూ.40 వేల కోట్లతో బృహత్తర ప్రణాళిక

123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.40,743 కోట్లతో భారీ ప్రాజెక్టులు - రోడ్లు, డ్రైనేజీల కోసం రూ.7,469 కోట్లకు పరిపాలనా అనుమతులు - పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు

​​AP Municipalities Master Plan
​​AP Municipalities Master Plan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 11:06 AM IST

2 Min Read
Choose ETV Bharat

​​AP Municipalities Master Plan : రాష్ట్రంలోని మున్సిపాలిటీల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేసింది. స్వర్ణాంధ్ర-2047కు అనుగుణంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఏకంగా రూ.40,743 కోట్ల అంచనాతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, సెంట్రల్ మీడియన్లు, వీధిదీపాల ఏర్పాటు కోసం రూ.7,469.46 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తోంది. మంజూరైన రూ.7,469.46 కోట్లలో రూ.5,500 కోట్లు మూలధన పనులకు, మిగతా రూ.1,969.46 కోట్లు పదేళ్ల వడ్డీ చెల్లింపుల కోసం కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 4,388 కి.మీ మేర రోడ్ల నిర్మాణం, 541 పార్కులు, 1,186 కి.మీ సెంట్రల్ మీడియన్లు, 20,340 వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం అంటే రూ.2,200 కోట్లు, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్/బీపీఎస్ నిధుల ద్వారా ముందుగా చెల్లిస్తుంది.

పదేళ్ల పాటు నిర్వహణ : మిగతా 60 శాతం అంటే రూ.3,300 కోట్లు గుత్తేదారు సంస్థ భరిస్తుంది. పనులు పూర్తయిన తర్వాత పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా ఆ సంస్థదే. ఎస్క్రో ఖాతా ద్వారా 40 త్రైమాసిక వాయిదాల్లో ప్రభుత్వం వారికి నిధులు చెల్లిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో మౌలిక వసతుల లేమిపై ప్రభుత్వం శాస్త్రీయంగా గ్యాప్ అసెస్‌మెంట్ నిర్వహించింది.

అమృత్ 2.0, ఏఐఐబీ, యూఐడీఎఫ్ పథకాల ద్వారా ఇప్పటికే రూ.15,274 కోట్ల పనులు జరుగుతున్నాయి. అభివృద్ధి పనులను విడివిడిగా కాకుండా రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు తదితర పనులన్నింటినీ ఒకేసారి సమగ్రంగా చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జనాభా వృద్ధి, భవిష్యత్ అవసరాలకు ముందే మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్​ కుమార్ వెల్లడించారు.

తొలిదశలో 1,153 ఎలక్ట్రిక్ ఆటోలు : పట్టణాభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం, రాజధాని నిర్మాణాలపైనా సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. చెత్త రహిత పట్టణాల కోసం 108 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు ఇప్పటికే వర్క్ ఆర్డర్లు జారీ చేసింది. ఇంటింటి చెత్త సేకరణ కోసం తొలిదశలో 1,153 ఎలక్ట్రిక్ ఆటోలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రంగంలోకి దించుతోంది. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం ఏకంగా రూ.66,802 కోట్ల పనులు మంజూరు కాగా, ఇప్పటికే రూ.43,422 కోట్ల పనులు మొదలయ్యాయి. పెండింగ్‌లో ఉన్న ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల నియామకం

కీలకంగా ఎక్స్‌అఫీషియో సభ్యులు - కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టీడీపీ కైవసం