శరవేగంగా మూలపేట పోర్టు నిర్మాణం - ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సన్నాహాలు
మూలపేట పోర్టు నిర్మాణ పనులు 75 శాతం పూర్తి - రెండు జనరల్ కార్గో బెర్తులు, నార్త్, సౌత్ బ్రేక్ వాటర్స్ పనులు పూర్తయినట్లు ప్రకటించిన నిర్మాణ సంస్థ, 75 శాతం పనులు పూర్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 18, 2026 at 10:32 AM IST
AP Govt Speed Up Mulapeta Construction works: ఉత్తరాంధ్రకు తలమానికంగా శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మితమవుతున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 75 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. అదే విధంగా కీలకమైన రెండు జనరల్ కార్గో బెర్తులు, అదే విధంగా నార్త్, సౌత్ బ్రేక్ వాటర్స్ పనులు కూడా పూర్తయినట్లు తెలియజేసింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మిగిలిన 25 శాతం పనులను నవంబరు నాటికి పూర్తి చేసి పోర్టు కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెలా సమీక్షిస్తుండటం గమనార్హం.
శరవేగంగా సాగుతున్న పనులు: మూలపేట వద్ద గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణాన్ని మొత్తం 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తొలి దశలో 15,00 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.4,361 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతేకాకుండా ఇందులో పోర్టు అంతర్గత పనులకు గాను రూ.2,981 కోట్లను కేటాయించగా, అందులో రూ.1,887 కోట్లను ఖర్చు చేశారు. ఇక మిగిలింది భూసేకరణ, నిర్వాసిత కాలనీకి వ్యయం చేస్తున్నారు.
ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సన్నాహాలు: సముద్రపు అలల తీవ్రతను తట్టుకునే విధంగా నిర్మాణం కోసం తలపెట్టినటువంటి సౌత్, నార్త్ బ్రేక్ వాటర్స్ పనులన్నీ పూర్తయ్యాయి. అందుకోసం మొత్తం 32 లక్షల టన్నుల రాయిని వినియోగించారు. ఇక సౌత్ బ్రేక్ వాటర్‌కు సంబంధించి 2,450 మీటర్ల పొడవున పనులతో పాటు వేవ్‌వాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఓడలను నిలిపేందుకు 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో మూడు జనరల్ బెర్తులను నిర్మిస్తున్నారు. ఇందులో రెండు బెర్తులు పూర్తయ్యాయి. మరొకటి మాత్రం ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నారు. అదే విధంగా 300 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో కోల్ బెర్తు నిర్మాణ పనులు కూడా దాదాపు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి.
అంతేకాకుండా బెర్తుల వద్ద ఓడలను నిలిపేందుకు 15.5 మీటర్ల లోతున తవ్వకాలను చేపట్టాలి. ఇందుకు మొత్తం 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్ల వెడల్పుతో కోల్ బెర్తు నిర్మాణ పనులను కూడా దాదాపు 50 శాతానికి పైగానే పూర్తయ్యాయి. అదే విధంగా పోర్టుకు అనుసంధానంగా రోడ్డు, రైల్వే, తాగునీరు, విద్యుత్ సంబంధిత పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా 16 వ నంబరు రహదారి నుంచి పోర్టుకు అనుసంధానంగా 12.85 కిలోమీటర్లు మట్టి పనులు పూర్తయ్యాయి.
132 కేవీ సామర్థ్యంతో విద్యుత్ స్తంభాలు: చెన్నై- హౌరా ప్రధాన రైల్వేలైన్‌లో సంతబొమ్మాళి మండలంలో దండుగోపాలపురం హాల్డు వద్ద నుంచి పోర్టుకు పట్టాల ఏర్పాటుకు గాను 7.8 కిలోమీటర్ల మేర మట్టి పనులను పూర్తి చేశారు. దీనికితోడు హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి పోర్టు వరకు మొత్తం 50 కిలోమీటర్ల పొడవునా నీటి పైప్‌లైన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా టెక్కలి మండలంలో రావివలస సబ్‌స్టేషన్ నుంచి 132 కేవీ సామర్థ్యంతో విద్యుత్ స్తంభాలను ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా మూలపేట పోర్టు నిర్మాణంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వాసుల్లో ఆశలు చిగురించాయి. దీనికితోడు పోర్టుకు అనుసంధానంగా భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ప్రత్యక్ష, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలనేవి పుష్కలంగా లభిస్తాయి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత పోర్టు పనులు శరవేగంగా జరగుతున్నాయి.
పారిశ్రామిక క్లస్టర్‌గా మూలపేట: దాంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను పెట్టేందుకు రాష్ట్రానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం పోర్టుకు అనుసంధానంగా 10,000 ఎకరాలను అధికార యంత్రాంగం గుర్తించింది. కూటమి ప్రభుత్వం మూలపేటను తాజాగా పారిశ్రామిక క్లస్టర్‌గా ప్రకటించడం విశేషం.
మూలపేట పోర్టు నిర్వాసితులను మోసం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
మూలపేటలో ఉద్రిక్త వాతావరణం - వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం

