ETV Bharat / state

'చెత్త పన్ను' రద్దు చేశాం - రూ.21 వేల కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి నారాయణ

చెత్త పన్నును రద్దు చేసి ఊరటనిచ్చిన కూటమి సర్కార్ - విజయవాడలో మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ వర్క్‌షాప్ - గడువులోగా చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం

AP Garbage Tax Abolished
AP Garbage Tax Abolished (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 3, 2026 at 7:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

AP Garbage Tax Abolished : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోపిన 'చెత్త పన్ను' భారాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గత పాలకులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేశారని, కానీ ఊళ్లలో చెత్త కుప్పలను మాత్రం అలాగే వదిలేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పురపాలక శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.21 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన ప్రకటన చేశారు. విజయవాడలో మున్సిపల్ అధికారులతో జరిగిన కీలక వర్క్‌షాప్‌లో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు.

చెత్త పన్ను రద్దుతో ప్రజలకు ఊరట : విజయవాడలో మున్సిపల్ ఇంజనీర్లతో ఒక కీలక వర్క్‌షాప్ జరిగింది. పురపాలక, ప్రజారోగ్య శాఖల ఇంజనీర్లు దీనికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చెత్త పన్ను పేరుతో గత ఐదేళ్లుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. పన్నులు వేసినా పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిచ్చాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఆ చెత్త పన్నును పూర్తిగా రద్దు చేసిందని, దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఊరట లభించిందని ఆయన తెలిపారు.

'చెత్త పన్ను' రద్దు చేశాం - రూ.21 వేల కోట్లతో పురపాలక అభివృద్ధి: మంత్రి నారాయణ (ETV)

వేగంగా చెత్త ప్రాసెసింగ్ యూనిట్లు : మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థల్లో పనుల తీరుపై ఆయన సమీక్షించారు. పారిశుద్ధ్యంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం ఉందని, ఈలోగా అన్ని పురపాలక సంస్థల్లో పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా చెత్త ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలు వేగవంతం కావాలన్నారు. ఎక్కడికక్కడ ఈ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి రావాలని, ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

సమన్వయంతో పని చేయాలి : రాష్ట్ర మున్సిపల్ శాఖలో రూ.21 వేల కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ పనుల్లో నాణ్యత ఉండాలని, పనుల వేగం కూడా చాలా ముఖ్యం అని మంత్రి స్పష్టం చేశారు. పనులు వేగంగా జరగాలంటే సమన్వయం ఎంతో అవసరమన్నారు. అధికారులు, గుత్తేదార్లు కలిసికట్టుగా పని చేయాలని, పరస్పరం అపార్థాలు లేకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నిర్దేశించిన గడువులోగా పనులను కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం : క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో నేరుగా సమావేశం కావడం మంచి పరిణామమని ఆయన అన్నారు. దీనివల్ల కింది స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు. అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకోవచ్చని, వాటిని అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు 'చెత్త నుంచి విద్యుత్ తయారీ' ప్లాంట్లు ఉన్నాయని, ఇవి రెండూ విజయవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. కాకినాడ ప్లాంటు పనులు కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ఈ కాకినాడ ప్లాంటును అందుబాటులోకి తెస్తామన్నారు.

"క్షేత్రస్థాయిలో వర్క్ చేయడంలో లోకల్​గా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ల్యాండ్ ఇబ్బందులు రావచ్చు. ఏజెన్సీలతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటన్నింటినీ డిస్కస్ చేసి, ఆ సమస్యలన్నీ పరిష్కరించేందుకే ఈ వర్క్‌షాప్ నిర్వహించాం. దీని ద్వారా అధికారుల నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 'అమృత్ 1.0' పనులను మధ్యలోనే ఆపేసింది. ఆ తర్వాత 'అమృత్ 2.0' కింద కేంద్రం నుంచి రూ.8,500 కోట్లు వచ్చాయి. ఆ పనులను కూడా ఆపేశారు. వచ్చిన ఆ డబ్బులన్నింటినీ ప్రభుత్వ ఖజానా నుంచి పక్కదారి పట్టించారు. అలాగే, 'స్వచ్ఛ భారత్' పథకం కింద రూ.3 వేల కోట్లు వస్తే, వాటిని కూడా వాడుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ నిధుల్లో మెజారిటీ భాగాన్ని పనుల కోసం ఉపయోగించాం." - పి. నారాయణ, పురపాలక శాఖ మంత్రి

107 మున్సిపాలిటీల్లో 'ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు' ఏర్పాటు: మంత్రి నారాయణ

అమరావతిలో శరవేగంగా పనులు -త్వరలోనే జీఎడీకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు: మంత్రి నారాయణ