ETV Bharat / state

ఏపీ పర్యాటకంలో వినూత్న ప్రయోగం - దేశంలోనే తొలిసారిగా 'డ్రైవర్‌-కమ్‌-గైడ్‌' వ్యవస్థ

రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల కోసం త్వరలో టూరిస్ట్‌ గైడ్‌లు - కారు, ఆటోల్లో తీసుకెళ్లి చూపించి వాటి ప్రత్యేకతల వివరణ - పర్యాటక సంస్థ, ర్యాపిడో రూపొందించే డ్రైవర్‌ కమ్‌ టూరిస్ట్‌ గైడ్‌

Government Will Introduce Driver Cum Guide Services in AP
Government Will Introduce Driver Cum Guide Services in AP (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 10:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Government Will Introduce Driver Cum Guide Services in AP : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పర్యాటక శాఖ - APTDC, ర్యాపిడో సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా 'డ్రైవర్-కమ్-గైడ్' అనే వినూత్న వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ర్యాపిడో ప్లాట్‌ఫారమ్‌లో మంచి రేటింగ్ ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఎంపిక చేసి వారికి పర్యాటక గైడ్లుగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాల విశిష్టత, పర్యాటకులతో ప్రవర్తించే విధానం, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రముఖ సంస్థ ర్య పిడోతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈ డ్రైవర్ కమ్ గైడ్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ‘టూరిస్ట్‌ గైడ్‌’లు త్వరలో అందుబాటులోకి రానున్నారు. పర్యాటకులు కోరుకునే ప్రాంతాలకు కారు, ఆటోల్లో వీరే తీసుకెళ్లి చూపించి వాటి ప్రత్యేకతలు కూడా వివరించనున్నారు. రాష్ట్ర పర్యాటక సంస్థ, ర్యాపిడో సంయుక్తంగా రూపొందించిన టూరిజం టూరిస్ట్‌ గైడ్‌ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా విజయవాడలో త్వరలో అమలు చేయనున్నారు. ఇందుకోసం ర్యాపిడోలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్​గల 280 మంది కారు, ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు : దేశంలోనే మొదటిసారి ప్రారంభించనున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని రెండో దశలో విశాఖపట్నం, తిరుపతి నగరాలకు విస్తరించనున్నారు. రాష్ట్రేతర, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు సందర్శనీయ ప్రాంతాలకు విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్‌ నుంచి నేరుగా వెళ్లేందుకు ఇప్పటివరకు సులువైన మార్గాలు లేవు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్యాకేజీ అమలుకు ర్యాపిడో సంస్థ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రూపొందిస్తున్నదే టూరిజం టూరిస్ట్‌ గైడ్‌.

పర్యాటకుల కోసం యాప్‌లో ప్రత్యేక ఐకాన్‌ : ర్యాపిడో యాప్‌లో కొత్తగా టూరిస్ట్‌ గైడ్‌ పేరుతో మరో ఐకాన్‌ రానుంది. దీన్ని ఓపెన్‌ చేయగానే విజయవాడతోపాటు చుట్టు పక్కలగల దాదాపు 20 సందర్శనీయ ప్రాంతాల వివరాలు అందులో కనిపిస్తాయి. సందర్శనీయ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాక గుర్తింపు పొందిన గైడ్‌ కం డ్రైవర్లు కారు, ఆటోల్లో తీసుకెళ్తారు. ఆయా ప్రాంతాలు, కట్టడాల ప్రత్యేకతలు, విశిష్టతను వివరిస్తారు. టూర్‌ ప్యాకేజీ ధర పర్యాటకశాఖ, రాపిడో కలిసి నిర్ణయించనున్నాయి. ఈ వివరాలు త్వరలో ప్రటించనున్నారు.

ప్రత్యేక సర్టిఫైడ్ డ్రైవర్-గైడ్లు : విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అమరావతి స్థూపం, కొండపల్లి కోట, ఉండవల్లి గుహలు, భవానీ ఐలాండ్, సూర్యలంక బీచ్, మంగినపూడి బీచ్, నాగార్జునసాగర్, కొండపల్లి బొమ్మలు, మంగళగిరి చేనేత వస్త్రాలు, కూచిపూడి, పవిత్ర సంగమం, కనకదుర్గ ఆలయం, పానకాలస్వామి ఆలయం ఉన్నాయి. వీటి గురించి ర్యాపిడో డ్రైవర్లకు వివరిస్తున్నారు.

పర్యాటకులకు చరిత్రను ఎలా వివరించాలనే దాన్ని స్క్రీన్ పైన వేసి అవగాహన కల్పిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాల విశిష్టత, పర్యాటకులతో మర్యాదగా ప్రవర్తించే విధానం, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పర్యాటకుల కోసం ర్యాపిడో యాప్‌లోనే ప్రత్యేకంగా ఐకాన్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా పర్యాటకులు సర్టిఫైడ్ డ్రైవర్-గైడ్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు.

విదేశీ పర్యాటకులతో సంభాషించేలా శిక్షణ : డ్రైవర్లకు శిక్షణలో విదేశీ పర్యాటకులతోనూ సలువుగా సంభాషించేలా భాషిణి యాప్, గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. చరిత్రక కట్టడాలు, వాటి విశిష్టతలను డ్రైవర్లకు తెలియజేస్తున్నారు. బౌద్ధ సర్క్యూట్, అమరావతి, నాగార్జునసాగర్‌ వంటి వాటి ప్రత్యేకతలు వివరిస్తున్నారు. పర్యాటకుల భద్రత, వారిపట్ల ఎలా ప్రవర్తించాలో సూచనలు చేస్తున్నారు. శిక్షణ పొందుతున్న 280 మందిలో 248 మంది ఆటోలు నడిపేవారు, మరో 32 మంది క్యాబ్‌ డ్రైవర్లు ఉన్నారు.

పర్యాటకులకు అరుదైన ఆతిథ్యం - పచ్చని కొండలపై లగ్జరీ 'టెంట్‌ సిటీ'లు

కొండపైన శివాలయం - కొండ కింద మత్స్యగుండం - పర్యటకులకు కనువిందు