ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అవకాశం - అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు
ఎనిమిదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం - రైతుల నీటిపారుదల వ్యవస్థ యాజమాన్య సవరణ బిల్లు పెట్టిన మంత్రి నిమ్మల

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 1:54 PM IST
|Updated : February 23, 2026 at 4:22 PM IST
AP Govt Introduce Several Bills in Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 8వ రోజులో భాగంగా నేడు ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టనుంది. శాఖల వారీగా బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ ఆమోదించిన అనంతరం ఆ 7 బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టనుంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ సవరణ బిల్లు 2026ను మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. 1997 ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య చట్టం ప్రకారం ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువమంది కలిగి ఉన్నవారిని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు అనర్హులుగా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర సంతాన ఉత్పత్తి రేటును దృష్టిలో ఉంచుకుని 1997 చట్టానికి సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. చట్టంలోని 14వ సెక్షన్, సబ్ సెక్షన్(5)ను తొలగిస్తూ ప్రతిపాదనలు ఇస్తున్నామని అన్నారు. సవరణలు ప్రకారం ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులుగా పోటీ చేయటానికి అర్హులు అని రామానాయుడు వెల్లడించారు.
ఆమోదం తెలిపిన అసెంబ్లీ: సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు కూడా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ అసెంబ్లీ చట్ట సవరణ చేసింది. ఈ బిల్లును మంత్రి నిమ్మల ప్రవేశపెట్టగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బలపరుస్తూ మాట్లాడారు. సాగునీటి సంఘాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సభ్యులుగా పోటీ చేసే వారు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే అనర్హులుగా చేస్తూ 1997లో ప్రభుత్వం చట్టం చేసింది.
అప్పట్లో జనాభా నియంత్రణ కోసం ఈ చట్టం అమలు చేశారని ఇప్పుడు మారిన పరిస్థితుల్లో జనాభా నిర్వహణకు ప్రాధాన్యం పెరిగిందని మంత్రి తెలిపారు. ఏపీలో సంతానోత్పత్తి రేటు 1997లో 3.7శాతం ఉండగా ఇప్పుడు 1.6కు పడిపోయిందని వృద్ధుల జనాభా రాష్ట్రంలో పెరుగుతున్న దృష్ట్యా ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తున్నట్లు నిమ్మల వివరించారు. చర్చ అనంతరం నీటిపారుదల వ్యవస్థల యాజమాన్య చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది.
ఏపీ జైళ్లు, సంస్కరణ సర్వీసుల బిల్లు: జైల్లు, సంస్కరణల చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. హోంమంత్రి అనిత ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ధూలిపాళ్ల నరేంద్ర బలపరుస్తూ మాట్లాడారు. ఖైదీలకు జైలులో సౌకర్యాలు కల్పించటంతో పాటు క్షమాబిక్ష, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై సూచనలు చేశారు. మంత్రి అనిత మాట్లాడుతూ వివిధ నేరాల్లో జైలుకు వచ్చిన ఖైదీలను సంస్కరించి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళా ఖైదీల పిల్లల కోసం జైలులో ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా కేటగిరీలుగా విభజిస్తామని తెలిపారు. జైలులో ఉన్నప్పుడు వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వారు బయటకు వెళ్లాక కూడా ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
'క్షమాపణలు కోరి లెంప లేసుకుంటేనే వైఎస్సార్సీపీకి తిరుమల పేరెత్తే అర్హత' - అసెంబ్లీ లాబీలో మంత్రులు
వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు రాజధానిలో ప్రధాన రహదారుల పనులు పూర్తి: మంత్రి నారాయణ

