ETV Bharat / state

రేషన్‌ డిపోల్లో "డిజిటల్ విప్లవం" - బియ్యం వద్దు అనుకుంటే నగదు బదిలీ

రేషన్‌ డిపోల్లో సీబీడీసీ విధానం అమలుకు విశాఖ జిల్లా ఎంపిక - గుజరాత్‌ తరహాలో రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా చేపట్టనున్న ప్రభుత్వం - అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్న సర్కార్

CBDC policy in ration depots
ఏపీలో రేషన్‌ డిపోల్లో సీబీడీసీ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 12:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

CBDC policy in ration depots : రేషన్‌ బియ్యం పంపిణీలో దశాబ్దాలుగా వేధిస్తోన్న అక్రమాలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగా రేషన్‌ డిపోల్లో సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (CBDC) విధానాన్ని అమలు చేసే అంశాన్ని పౌరసరఫరాల శాఖ సునిశితంగా పరిశీలిస్తోంది. గుజరాత్‌లో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ఈ విధానాన్ని, మన రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి అధికారులు విశాఖపట్నం జిల్లాను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.

అక్రమాలకు బ్రేక్‌: రేషన్ డిపోల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యంలో సింహభాగం నల్లబజారుకు తరలిపోతోందనే విమర్శలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అక్రమార్కులు ఆ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని పాలిష్‌ పట్టి విదేశాలకు సైతం స్మగ్లింగ్ చేస్తున్నారు. నిఘా వర్గాలు, యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మాఫియాకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

విధానం ఎలా పనిచేస్తుందంటే?
ఈ సరికొత్త విధానంలో కార్డుదారులకు ప్రత్యేక డిజిటల్ కూపన్లు జారీ చేస్తారు. లబ్ధిదారులు ఆ కూపన్లను డీలర్లకు అందజేసి తమ కోటా ప్రకారం బియ్యం పొందవచ్చు. ఒకవేళ ఏ నెలైనా రేషన్ బియ్యం తీసుకోవడం ఇష్టం లేకపోతే, ఆ కోటాను లబ్ధిదారులు వదులుకోవచ్చు. అలా వదులుకున్న బియ్యం విలువకు సమానమైన నిధులను సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఇది ఒక రకమైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకం లాంటిదే. గుజరాత్‌లో ఈ విధానం అద్భుత ఫలితాలు ఇస్తుండటంతో, ఏపీ అధికారుల బృందం ఇటీవలే అక్కడ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలిన చేసింది.

తొలి దశలో ‘కేంద్ర’ కార్డులకే: విశాఖ జిల్లాలో మొత్తం 5,28,863 రేషన్‌ కార్డులుండగా, వాటిలో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 1,54,703 కార్డులున్నాయి. వారికి అవసరమయ్యే రేషన్ సరకులు కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా కేవలం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులకే ఈ సీబీడీసీ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియ ప్రయోగాత్మకంగా విజయవంతమైతే మిగలిన వారికి వర్తింపజేయనున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల నుంచి తుది ఆదేశాలు రాగానే జిల్లాలో దీని అమలుకు చర్యలు తీసుకోనున్నారు.

ఈ విధానం వల్ల ప్రభుత్వానికి రవాణా, నిల్వ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఈ డిజిటల్ విధానంపై అవగాహన కల్పించడం, రేషన్ డీలర్ల కమిషన్ల సర్దుబాటు వంటి సవాళ్లు ఉన్నాయి. విశాఖ జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతమైతే, తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని కార్డులకు దీనిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తుది విధివిధానాలు ఖరారైన వెంటనే క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

ప్రజలకు మంచి సేవలను అందించడమే లక్ష్యం: మంత్రి నాదెండ్ల మనోహర్

బియ్యం బదులు నాసిరకం జొన్నలు - ఏమిస్తే అదే తీసుకోవాలంటూ బెదిరింపులు