త్రిముఖ వ్యూహంతో ఏపీ రైజింగ్ - విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనమిక్ రీజియన్లు
విశాఖ రీజియన్‌కు రూ.500 కోట్ల కేటాయింపు - నీతి ఆయోగ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు - కేంద్రం, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టుల అమలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 5:01 PM IST
AP Govt Three Pronged Strategy for Economic Growth: రాష్ట్రంలో ఆర్థికవృద్ధిక ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరిస్తోంది. అమరావతి, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనమిక్ రీజియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ రీజియన్‌కు రూ.500 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. దీనికోసం నీతి అయోగ్‌లో కలిసి ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రాజెక్టులకు అమలు చేయనుంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమ్మిళత అభివృద్ధి లక్ష్యంతోనే ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఎకనమిక్ రీజియన్లూ ఏర్పాటుకు తలపెట్టింది. విజన్ స్వర్ణాంధ్ర-2027 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌లుగా తీర్చిదిద్దానుంది. ఈ సంకల్పంతోనే బడ్జెట్‌లో వాటికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది.
రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజిన్లుగా: ఇప్పటికే ఆర్థికాభివృద్ధి ప్రణాళిక సిద్ధమైంది. తాజా బడ్జెట్‌లో విశాఖ ఎకనమిక్ రీజియన్‌కు రూ.500 కోట్లు కేటాయించింది. విశాఖ మెట్రో ట్రైన్‌తో సహా వీఈఆర్‌కు రూ.28 వేల కోట్లతో కేంద్రానకి ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. అమరావతి, తిరుపతి, విశాఖ కేంద్రాలుగా మూడు ఆర్థిక అభివృద్ధి రీజియన్లను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇవి రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజిన్లుగానూ భావిస్తోంది.
నీతి ఆయోగ్‌తో కలసి వీఈఆర్ ఆర్థికాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబరులో విడుదల చేసింది. అమరావతి, తిరుపతి, రీజియన్లకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించనుంది. త్వరలో నీతి ఆయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపకల్పన చేయనున్నాయి. ఇంకా ప్రణాళికలు సిద్ధం కాలేదు. అయినా ఈ 2 ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. రాయలసీమలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ హబ్ ఏర్పాటుకు తాజాగా బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లు ప్రకటించింది. అదే విధంగా అమరావతి రీజియన్లో రాజధాని నిర్మాణ పనులు రూ.57 వేల 868 కోట్ల వ్యయంతో చేపడుతోంది.
7 గ్రోత్ డ్రైవర్లను గుర్తించిన ప్రభుత్వం: విశాఖ ఆర్థిక రీజియన్‌లోకి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలు రానున్నాయి. వీఈఆర్‌ను 2032 నాటికి 125-135 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నారు. 60 నుంచి 70 బిలియన్ డాలర్ల జీవీఏ, 20 నుంచి 24 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా 7 గ్రోత్ డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించింది.
పోర్టు ఆధారిత మాన్యుఫ్యాక్చరింగ్ హబ్, ఇన్నోవేషన్ హబ్, ఐటీ, డేటా సెంటర్, ఏఐ, వ్యవసాయం, పర్యాటకం వంటి 7 డ్రైవర్లను ఎంపిక చేసింది. మొత్తం 41 కీలక ప్రాజెక్టులు, పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. వాటికి అవసరమైన నిధులను కేంద్ర, ప్రైవేట్ సంస్థల నుంచి సమకూర్చుకుంటామని ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రసంగంలో చెప్పారు. ముఖ్యమంత్రి ఛైర్‌పర్సన్‌గా వీఈఆర్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు ఆర్థిక, వ్యవసాయ, హోం, పరిశ్రమల, పురపాలక శాఖల మంత్రులను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
నీతి ఆయోగ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు: అమరావతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోకి కృష్ణా, ఎన్టీఅర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలు రానున్నాయి. దీని ప్రణాళికను నీతి ఆయోగ్‌తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందించనున్నాయి. రాజధాని అమరావతిలో ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు అన్నింటినీ ప్రోత్సహిస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులతో పాటు ప్రముఖ విద్యా సంస్థలు ఇక్కడికే రావడం గమనార్హం. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, టెక్స్టైల్, సిమెంట్ క్లస్టర్లు, నాలెడ్జ్ హబ్, ఫైనాన్స్ హబ్‌లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. ఏమియేషన్, కమర్షియల్ హబ్‌లు కూడా రానున్నాయి.
ఆక్వాకల్చర్ హబ్‌గా పశ్చిమగోదావరి జిల్లాను తీర్చిదిద్దబోతోంది. రాయలసీమ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందించనుంది. దీని పరిధిలోకి కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలు రానున్నాయి. రాయలసీమలో ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులను, ఉద్యాన రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆటో మొబైల్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, సెల్ఫోన్ల తయారీ పరిశ్రమలు వంటివి ఆ ప్రాంతంలో పెద్దఎత్తున వస్తున్నాయి. అదే విధంగా సీమలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తోంది.
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ - ఏఏ శాఖకు ఏంతెంత కేటాయించారంటే?
సామాజిక న్యాయానికి బడ్జెట్‌లో పెద్దపీట - సంక్షేమానికే ఏకంగా 17శాతం నిధులు కేటాయింపు

