రైతన్నలకు గుడ్‌న్యూస్- పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఊరట
రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక- కొత్త కనెక్షన్ల కోసం 3 డిస్కంల పరిధిలో 46,113 మంది రైతులు దరఖాస్తులు- అవసరమైన సామగ్రి కొరకు దాదాపు రూ. 250 కోట్లు ఖర్చు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 10:40 AM IST
AP Government Sanctioned Agricultural Electricity Connections: రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి అన్నదాతలకు ఊరట కలిగించనుంది. నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న ఈ దరఖాస్తులకు అనుమతులివ్వాలని విద్యుత్ సంస్థలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కొత్త కనెక్షన్ల కోసం 3 డిస్కంల పరిధిలో 46,113 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. వీటి కోసం అవసరమైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సామగ్రి అందుబాటులో లేకపోవడంతో డిస్కంలు దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
1.12 లక్షల కొత్త కనెక్షన్లు: అవసరమైన సామగ్రి కొరకు దాదాపు రూ. 250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎప్పటికప్పుడు ఇవ్వకుండా వాటన్నింటిని పెండింగ్‌లో పెట్టినట్లు అధికారిక నివేదికలు తెలుపుతున్నాయి. సుమారు 50వేల దరఖాస్తులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. వాటన్నింటికి కలిపి డిస్కంలు దాదాపు 1.12 లక్షల కొత్త కనెక్షన్లను ఇచ్చాయి.
అందుకే జాప్యం: దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 22.30 లక్షలకు చేరింది. డిస్కంల పరిధిలో ఇంకా 2025 జనవరి నుంచి అందిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా దరఖాస్తు అందిన నాటి నుంచి రెండు నెలల్లో కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఈ ( అసిస్టెంట్ ఇంజినీర్) ల కొరత వల్ల కొంత కాలం జాప్యమవుతోన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం డిస్కంల వద్ద 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఈపీడీసీల్‌లో 7,382, సీపీడీసీఎల్‌లో 266, ఎస్‌పీడీసీఎల్‌లో 88 ఉన్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెండు నెలల్లో అందుబాటులోకి: పెండింగ్ కనెక్షన్లకు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు కనీసం మరో 10వేల వరకు అవసరం. ఒక్కో కనెక్షన్‌కు సగటున రూ.50వేల వరకు డిస్కంలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని డిస్కంలను ఆదేశించినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అందుకు అవసరమైన సామగ్రిని విద్యుత్ సంస్థలు సమకూర్చుకుంటున్నాయని వెల్లడించారు. ముందుగా వాటికి అంచనాలు తయారు చేసి, మంజూరుకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
మొదటిసారి ఏసీఎస్ మించి ఏఆర్‌ఆర్ - కోలుకునే దిశగా డిస్కంల అడుగులు
విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గింపుపై సర్కార్ చర్యలు - అవకాశాలు పరిశీలన

