పర్యాటకులకు అరుదైన ఆతిథ్యం - పచ్చని కొండలపై లగ్జరీ 'టెంట్ సిటీ'లు
లంబసింగిలో కొండలపై ఇగ్లూ తరహా టెంట్లు - రూ.14 కోట్లతో పునరుద్ధరణ పనులు - పచ్చదనం మధ్యలో బయట వాతావరణం కనిపించేలా గ్లాసులతో టెంట్లు నిర్మాణం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 8:05 PM IST
AP Government Plans Tent Cities in Araku : పర్యాటకులకు అరుదైన ఆతిథ్యాన్ని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) అందిస్తోంది. పచ్చని కొండల పై ప్రకృతి అందాల నడుమ సందర్శకులను ఆకట్టుకునేలా 'టెంట్ సిటీ'లు నిర్మిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి, టైడాలో ఈ ప్రాజెక్టులు చేపట్టారు. టైడాలో నిర్మాణాలు ఇప్పటికే పూర్తియ్యాయి. ప్రస్తుతం వీటిని అందుబాటులోకి తీసుకు వచ్చారు.
కొరియా నుంచి ఫ్యాబ్రిక్ : ఈ టెంట్ల నిర్మాణానికి కొరియా నుంచి ఫ్యాబ్రిక్ దిగుమతి చేశారు. వీటిని ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఒక్కో టెంట్ సైడ్ వాల్స్ 7 అడుగులు ఉంటున్నాయి. మధ్యలో పన్నెండు అడుగుల ఖాళీ ప్రదేశం ఉంటుంది.
ట్రయాంగిల్, ఇగ్లూ నమూనాల్లో నిర్మాణాలు : వేడి, చల్లదనాన్ని నియంత్రించేలా 3,4 పొరలతో ఆకట్టుకునేలా టెంట్లు నిర్మిస్తున్నారు. లోపల అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ప్రత్యేక పడక గది, పందిరి మంచం, ఆరుబయట కుర్చీలు, టీవీ సౌకర్యం, విద్యుత్తు అలంకరణలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పచ్చదనం మధ్యలో బయట ఆహ్లాద వాతావరణం కనిపించేలా గ్లాసులతో టెంట్లు నిర్మించడం వీటి ప్రత్యేకత. వెన్నెల రోజుల్లో మరింత మనోహరంగా ఉంటుంది.
ఆసక్తి చూపిస్తున్న ప్రముఖులు : గతంలో 'టైడా' వద్ద జంగిల్ బెల్స్లో వెదురుతో గదులు నిర్మించారు. అవి శిథిలమయ్యాయి. ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తగా టెంట్ సిటీ నిర్మించారు. ఇక్కడ 12 గదులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖులు వీటి పై ఆసక్తి చూపిస్తున్నారు. ఒకసారి వచ్చినవారు మళ్లీ మళ్లీ సరదాగా గడపాలని వస్తున్నారు.
అరకులో వ్యాలీ రిసార్టులో 68 గదులు, మయూరి రిసార్టులో 101 గదులను పూర్తిగా నవీకరించారని ఏపీటీడీసీ డీవీఎం జి.జగదీష్ అన్నారు. ఆధునిక వసతులతో సిద్ధం చేసారని తెలిపారు. మయూరి వద్ద బడ్జెట్లో నిర్మించిన అమీబా గదులు 12 అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. రూ.14 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు.
విశాఖ అప్పూఘర్ రిసార్టులో 100 మందికి సరిపడే హాలు అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అరకులోనూ ఒక హాలు ఉంది. టైడాలోని టెంట్లకు బడ్జెట్ అవి రూ.2,940, ఏసీ ప్రీమియం రూ.4,200 ఉండగా, ఏసీ డీలక్స్ రూ.3,360, ఇక ఏసీ లగ్జరీకి రూ.5,250గా ధరలు నిర్ణయించమని పేర్కొన్నారు.
రూ.4 కోట్లు ఖర్చు : హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు వీకెండ్లో సరదాగా గడిపేందుకు వాహనాలు బుక్ చేసుకొని మరీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ భారీగా ఉంది. దీంతో లంబసింగిలో ఇప్పటికే 15 గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకోసం రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్వరలో ఇక్కడ కొండలపై సమతల ప్రదేశాన్ని అభివృద్ధి చేసి ఇగ్లూ తరహా టెంట్లు నిర్మించనున్నారు.
పర్యాటక రంగంలో మరో కీలక ముందడుగు- ఎనిమిది చోట్ల హౌస్ బోట్లు!
కూటమి చొరవతో పట్టాలెక్కుతోన్న పర్యాటకం - గోదారి గట్టు పొడవునా స్టాళ్లు ఏర్పాటు

