ETV Bharat / state

రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు నోటిఫికేషన్‌ విడుదల

మరికొన్ని మండలాలూ ఒక డివిజన్‌ నుంచి మరో డివిజన్‌లోకి - మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ

Three New Districts and 5 Revenue Divisions in AP
Three New Districts and 5 Revenue Divisions in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 28, 2025 at 8:26 AM IST

3 Min Read
Choose ETV Bharat

Three New Districts in AP: రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్​ విడుదల చేసింది. పలు చోట్ల ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాన్ని మరో డివిజన్​లోకి మార్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామం పేరును వాసవీ పెనుగొండగా మార్చింది. అలాగే కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివాణం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసింది. వీటన్నింటిపైనా జిల్లాల వారీగా ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయాలని జిల్లాల కలెక్టర్లకు సూచిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్​ నిన్న (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనల్ని 30 రోజుల్లోగా జిల్లా కలెక్టర్లకు అందజేయాలని పేర్కొన్నారు. డిసెంబరు నెలాఖరులోగా జిల్లాల విభజన ప్రక్రియ పూర్తి చేసి, తుది నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు.

  • ప్రకాశం జిల్లాలో కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్ని తిరిగి కలిపారు. కందుకూరు డివిజన్‌లో కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, మర్రిపూడి, పొన్నలూరు మండలాలు ఉంటాయి. కొత్తగా ఏర్పాటు అయ్యే అద్దంకి రెవెన్యూ డివిజన్‌లో అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు, ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు రానున్నాయి.
  • మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్ని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్‌లో చేర్చారు.
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం మండలాల్ని కావలి రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేశారు. ఆత్మకూరు డివిజన్‌లోని కలువాయి మండలం, నెల్లూరు డివిజన్‌లోని రాపూరు, సైదాపురం మండలాల్ని తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లో కలిపారు.
  • వైఎస్సార్‌ కడప జిల్లా కడప రెవెన్యూ డివిజన్‌లోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్ని అన్నమయ్య జిల్లా రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేశారు.
  • కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించారు. పెద్ద హరివాణం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేశారు. దీంతో ఆదోని మండలంలో 29 గ్రామాలతో పాటు కొత్తగా ఏర్పడే పెద్ద హరివాణం మండలంలో 17 గ్రామాలు ఉంటాయి.
  • పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోని గోరంట్ల మండలాన్ని పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లోకి కదిరి డివిజన్‌లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్‌లోకి చేర్చారు.
  • చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్‌లోకి మార్చారు.
  • శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని ఉన్న నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లోకి మార్చారు.
  • సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దాపురం డివిజన్‌లో చేర్చారు.
జిల్లా కొత్త డివిజన్ మండలాలు
అనకాపల్లినక్కపల్లియలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్.రాయవరం
శ్రీసత్యసాయి మడకశిరమడకశిర, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగలి
నంద్యాల బనగానపల్లి బనగానపల్లి, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల

ఆ డివిజన్‌లో ఇక రెండు మండలాలే: డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయనున్నారు. తద్వారా దాని పరిధిలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లోకి రాబోతున్నాయి. వీటిని వేరు చేయడంతో రామచంద్రాపురం డివిజన్‌లో కేవలం రామచంద్రపురం, కె.గంగవరం మండలాలే మిగిలాయి. ఈ డివిజన్‌ను ఇలాగే కొనసాగిస్తారా? లేదా? ఆ రెండు మండలాలను మరో డివిజన్‌లో విలీనం చేస్తారా అనే చర్చ అయితే నడుస్తోంది.

కొత్త జిల్లాలు, వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు:-

  • మార్కాపురం జిల్లా - మార్కాపురం రెవెన్యూ డివిజన్‌: గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు, మార్కాపురం, తర్లుపాడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, పొదిలి, కొనకనమిట్ల.
  • కనిగిరి రెవెన్యూ డివిజన్‌: హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి (పీసీపల్లి), చంద్రశేఖరపురం (సీఎస్‌పురం), పామూరు
  • పోలవరం జిల్లా - జిల్లా కేంద్రం: రంపచోడవరం
  • రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌: రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి
  • చింతూరు రెవెన్యూ డివిజన్‌: ఎటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం
  • మదనపల్లె జిల్లా - మదనపల్లె రెవెన్యూ డివిజన్‌: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, చౌడేపల్లి, పుంగనూరు
  • కొత్తగా ఏర్పాటయ్యే పీలేరు రెవెన్యూ డివిజన్‌: సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె, కలికిరి, వాల్మీకిపురం

రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు - సీఎం చంద్రబాబు ఆమోదం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు - నేడు సీఎం చంద్రబాబు కేబినెట్​తో భేటీ!